Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited.

Women Teachers dayమహిళా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలతో ....
సేకరణ: బెస్ట్ సోషల్ టీచర్
జ్ఞాన ప్రదాతలు.. మహిళా ఉపాధ్యాయులు
       అఆలు నేర్పిన దగ్గర నుంచి విద్యాభ్యాసం పూర్తయ్యే వరకూ పాఠం చెప్పిన ప్రతిఒక్కరూ గురువే. గురువంటే మార్గదర్శి. ద గైడ్‌. ఓ వ్యక్తిని జీవనయానంలో ఉన్నత స్థానంలో నిలబెట్టడానికి ఆయనతో అక్షరాలు దిద్దించి, వెన్నంటి ఉండి అభివృద్ధికి దోహదపడేవారే ఆచార్యులు. వీరిలో మహిళా ఉపాధ్యాయుల పాత్ర అమోఘమైనది, అనిర్వచనీయమైనది. భారతదేశంలో గురువంటే ఎలా ఉండాలో, శిష్యులపై ఎలాంటి ముద్రవేయాలో సర్వేపల్లి రాధాకృష్ణ, సావిత్రిబాయి పూలేలు ఆచరించి చూపారు. అందుకే గురువులంటే తొలుత వారే గుర్తుకు వస్తారు. ముఖ్యంగా నాటి కాలంలో అనేక ఒడుదుడుకులను, నిర్బంధాన్ని, వివక్షను ఎదుర్కొని కడదాకా నిలిచారు సావిత్రి బాయి పూలే. ఆమె పుట్టిన రోజును జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా యావత్తు దేశం జరుపుకుంటోంది.ఈ నేపథ్యంలో ఆమె గొప్పతనాన్ని, మహిళా ఉపాధ్యాయినిల గురించి కథనం...
               దేశంలోనే తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా సావిత్రిబాయి పూలే చరిత్రలోకెక్కారు. తొలి మహిళా పాఠశాలను ప్రారంభించిన ఆమె గొప్ప విద్యాబోధన చేశారు. ప్రముఖ సంఘసేవకుడు జ్యోతిరావ్‌పూలే భార్యగా సమాజ సేవలో పాలు పంచుకున్నారు. సావిత్రిబాయి ఆ కాలంలో మహిళా విద్య గురించి ఎంతో తపించారు. దళితవర్గంలో పుట్టి తీవ్ర నిర్బంధాన్ని ఎదుర్కొని బ్రిటిష్‌ వారి కాలంలో మహిళల హక్కుల కోసం పోరాడారు. ఆ కాలంలో స్త్రీలను బయటకు వెళ్లనిచ్చేవారు కాదు. కానీ సావిత్రిబాయి పూలే బాలికలకు విద్యాబుద్ధులు నేర్పేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చారు. అప్పటి ఛాందసులు ఆమెపై కుళ్లిన గుడ్లు, మాంసం, టమాటాలు, రాళ్లు విసిరి హింసించారు. అయినప్పటికీ జంకకుండా ధైర్యంగా విద్యాబోధన చేశారు. ఆమె భర్త పూర్తి అండగా ఉంటూ ప్రోత్సహించారు. దీంతో ఆమె దేశంలోనే మహిళల కోసం 1848లో తొలి పాఠశాలను ప్రారంభించి అక్కడే మొదటి ఉపాధ్యాయినిగా పాఠాలు బోధించారు. మొదట వివిధ కులాలకు చెందిన తొమ్మిది మంది బాలికలు ఆమె పాఠశాలలో చేరి చదువుకున్నారు. ఆ తర్వాత సమాజంలో కొంత మార్పు వచ్చి తల్లిదండ్రులు తమ అమ్మాయిలను చదువుకునేందుకు పాఠశాలకు పంపించడం ప్రారంభించారు. దీంతో సావిత్రిబాయి మహిళల కోసం మరో ఐదు పాఠశాలలను ప్రారంభించారు. ప్లేగు వ్యాధి సోకిన మాంగ్‌లాంటి దళిత కులాలకు చెందిన చిన్నారులను చంకన వేసుకొని చికిత్స చేసి కాపాడారు. చివరికి ఆ ప్లేగు వ్యాధే ఆమెకి సోకి 1897 మార్చి 10న మృతిచెందారు. ఇంతలా స్త్రీ విద్యా వ్యాప్తికి కృషి చేసిన ఆమెను చివరకు బ్రిటిష్‌ ప్రభుత్వమే ఘనంగా సత్కరించడం విశేషం. సావిత్రిబాయి పూలే జయంతిని భారతదేశ మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా ప్రతి ఏటా జరుపుకుంటున్నాం.
           ముఖ్యంగా టెన్త్‌లో విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించడానికి అదనపు సమయాన్ని కూడా వెచ్చించి విద్యాబోధన చేస్తున్నారు. మరోపక్క పాఠశాలలో ఎటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు జరిగినా అగ్రభాగాన ఉంటూ మొత్తం భారాన్ని తమపై వేసుకుంటున్నారు. మహిళాఉపాధ్యాయులు విద్యార్థినుల సమస్యలను తెలుసుకుంటూ మానసికంగా వారు ఎదగడానికి దోహదపడుతున్నారు. ఇటు ప్రయివేటు విద్యాసంస్థల్లోనూ వీరి పాత్ర గొప్పదనే చెప్పాలి.
నిత్య స్ఫూర్తి సావిత్రిబాయి పూలే
     సావిత్రిబాయి పూలే దేశంలో స్త్రీ విద్యా వ్యాప్తికి ఎనలేని కృషి చేశారు. ఆమె స్పూర్తితో నేడు అనేక మంది మహిళలు ఉన్నత విద్యలభ్యసిస్తున్నారు. పురుషులతో సమానంగా అనేక బాధ్యతాయుతమైన విధులు నిర్వర్తించడానికి ముందుకు వస్తున్నారు. అయినప్పటికీ స్త్రీ అణచివేతకు గురవుతూనే ఉంది. ముఖ్యంగా గ్రామీణ మహిళల్లో అక్షరాస్యతా శాతం పెరగాల్సిన అవసరముంది. మనకు ప్రథమ గురువు అమ్మే అంటారు. అలాంటి అమ్మలు పూర్తిగా విద్యావంతులవ్వాల్సిన అవసరముంది. ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాల మహిళలు చదువులకు దూరంగా ఉంటున్నారు. కేవలం అక్షరాస్యతతోనే సరిపోదు. ఉన్నత విద్యలందుకోవాలి. అటువంటి అవకాశాలను ప్రభుత్వాలు కల్పించాలి. కేవలం విద్యతోనే మహిళలు దేన్నైనా సాధించగలరు. దేశంలో పురుషులతో సమానంగా ఉన్న స్త్రీలకు రిజర్వేషన్ల శాతాన్ని పెంచాల్సిన అవసరముంది. స్త్రీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి.


Women Teachers day,Speech on Women Teachers day,Women Teachers day speech,women teachers day speech
Previous
Next Post »
0 Komentar