Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited.

Kotappa Konda


                                                      కోటప్ప కొండ          కోటప్పకొండ గుంటూరు జిల్లా, నరసరావుపేట దగ్గర ఉన్న త్రికోటేశ్వరుని సన్నిధి. కైలాశాధినేత అయిన ఆ మహా శివుడు త్రికోటేశ్వరుని రూపంలో కొలువైన దివ్య సన్నిది కోటప్పకొండ. యల్లమంద కోటయ్యగా భక్తులకు ప్రీతి పాత్రుడైన శివుడు కోటప్పకొండలో కొలువై భక్తుల కొంగు బంగారంగా విలసిల్లుతున్నాడు. పరమేశ్వరుడు జ్ఞానోపదేశం ఇచ్చిన పవిత్ర పుణ్యక్షేత్రమే కోటప్పకొండ.
ఆలయం గురించి:
త్రికోటేశ్వర స్వామి కోటప్పకొండలో వెలసి వున్నారు, ఈ గ్రామం గుంటూరు జిల్లాలోని నర్సారావుపేటకి నైరుతి దిశగా 13 కి.మీ ల దూరంలో ఉంది. శివునికి అంకితం చేయబడిన ఈ ఆలయం ఒక కొండపై వెయ్యి మెట్ల ఎత్తులో నిర్మించబడింది. ఇతర కొండలు చుట్టూ ఉన్నప్పటికీ, మూడు కొండల వలన "త్రికూటాచలం" లేదా "త్రికూటాద్రి" పేర్లతో పిలవబడుతుంది, ఏ వైపు నుండి చూసిన స్పష్టంగా మూడు కొండలు ఉన్నట్లు కనబడుతుంది. ఈ మూడు శిఖరాలను త్రిమూర్తులుగా భావిస్తారు. అనగా సృష్టికర్త బ్రహ్మగా, స్థితికారకుడు విష్ణువుగా మరియు లయకారకుడైన రుద్రునిగా భావిస్తారు.
కొండ మీద అనేక కొలనులు ఉన్నాయి. వీటిలో ఎనిమిది, ఆలయం ఎదురుగా ఉన్నాయి. మహాశివరాత్రి ఇక్కడ ప్రతి సంవత్సరం భక్తి శ్రద్ధలతో జరుపుకొనే ముఖ్యమైన పండుగ. ఆ సమయంలో పెద్ద సంఖ్యలో భక్తులు ఈ ప్రదేశాన్ని చేరుకుంటారు. కోటప్పకొండ తిరునాళ్ల ఉత్సవాన్ని గొప్ప శక్తితో మహాశివరాత్రి సమయంలో జరుపుకుంటారు. ఆలయ చరిత్ర
ఈ స్థలం యొక్క అసలు పేరు కొండకవురు అని ఉంది, కానీ ఇప్పుడు ప్రముఖంగా కోటప్పకొండ లేదా త్రికూటపర్వతం అని అంటారు. కోటప్ప కొండ దేవుడికి వెయ్యేళ్ళ పైబడి చరిత్ర ఉంది. ఇక్కడి దాన శాసనాలలో వెలనాటి గొంకరాజు, వెలనాడు చాళుక్య భీమరాజు, వెలనాటి కుళోత్తుంగ చోళుడు, వెలనాటి రాజేంద్రుడు పేర్లున్నాయి. కృష్ణ దేవరాయలు, మల్రాజు వెంకట నారాయణి, వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు మొదలైన రాజులు జమీందార్లు స్వామికి విలువైన మాన్యాలు రాసి సమర్పించారు.
ప్రధాన ఆలయము బ్రహ్మ శిఖరము కొండ మీద ఉన్నది, పాత కోటయ్య ఆలయము రుద్ర శిఖరము వద్ద ఉన్నది, త్రికోటేశ్వర స్వామి ఉనికిలో ఉన్న అసలు ప్రదేశము ఇది. గొల్లభామ భక్తిని ద్వారా తృప్తిపొందిన బ్రహ్మదేవుడు ఈ శిఖరముకు మకాం మార్చుకున్నారు. అప్పటి నుండి ఇది పాత కోటయ్య ఆలయంగా పరిగణించబడుతుంది. పాపనాశేశ్వర ఆలయం విష్ణు శిఖరం మీద నెలకొని ఉంది. ఇక్కడ, శ్రీ మహా విష్ణు, శివ భగవానుని మెప్పించి తపస్సు చేశారు. ఆలయంలో "పాపనాశం తీర్ధ" గా పిలువబడే ఒక పవిత్ర చెరువు ఉంది.


పురాణాల ప్రకారము దక్ష యజ్ఞం నాశనము తరువాత శివుడు తాను 12 సంవత్సరాల బాలుడిగా మారి మరియు కైలాసంలో దక్షణ మూర్తిగా తపస్సు చేశారు. బ్రహ్మ దేవుడు దక్షణ మూర్తిని బ్రహ్మ జ్ఞానమును ఇవ్వమని ప్రార్థించారు. వారి అభ్యర్థనను దక్షణ మూర్తి అంగీకరించారు, మరియు వారిని త్రికోటి కొండను వీక్షించమని చెప్పారు. బ్రహ్మ ఈ కొండల పవిత్రత, ఈ కొండలను ఏర్పాటు చేసిన రహస్యాల గురించి మరియు దక్షిణ మూర్తి యొక్క బ్రహ్మచర్యం గురించి చెప్తాడు. అందుకే ఏ వివాహాలు ఈ ఆలయ ప్రదేశంలో జరగబడవు.
త్రికూట పర్వత దేవాలయము
త్రికూట పర్వతం అనే త్రికోటేశ్వరుని సన్నిది కల కోటప్ప వెలసిన కొండ మూడు శిఖరాలతో భక్తులనూ ఆకర్షిన్తూ ఉంటుంది. అందుకే దీనికి త్రికూటమని, ఇక్కడ వెలసిన శంకరుడికి త్రికోటేశ్వరుడని పేరు వచ్చింది. ఈయననే మేధా దక్షిణా మూర్తి అంటారు. దక్షిణా మూర్తి జ్ఞానప్రదాత. ఈ స్వామిని కొలిస్తే జ్ఞానం అభివృద్ది చెందుతుందని నమ్మకం. అంతేకాదు, స్వామి దర్శనం చేసుకున్న వారి జాతకాలలో గురుబలం పెరుగుతుందని నమ్మకం.
ఈ క్షేత్రం మొదటి కొండపై ముసలి కోటయ్యగారి గుడి ఉంది ప్రస్తుతం శిథిలావస్థలో ఉంది. రెండవ కొండ త్రికోటేశ్వరస్వామివారి దేవాలయము కలది. ఇక్కడ ఎర్రగా ఉండే కోతులు ఒక ప్రత్యేకత. గుడి పరిసరాలలో భక్తులు ఇచ్చే ప్రసాదాలను తీసుకొంటూ ఒక్కోసారి లాక్కుంటూ తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఒక పెద్దపుట్ట, నవగ్రహముల దేవాలయము, ద్యాన మందిరము, దేవాలయపు వెనుక బాగమున వసతి గదులు ఉన్నాయి. మూడవ భాగమైన కొండ క్రింద బొచ్చుకోటయ్యగారి మందిరము మరియు కళ్యాణ కట్ట, సిద్ధి వినాయక మందిరములు ఉన్నాయి.


సోపాన (మెట్ల) మార్గాలు:
చేదుకో కోటయ్య.. మమ్మాదుకోవయ్యా! అంటూ, యల్లమంద కోటయ్యగా ప్రజల పూజలందుకొనే త్రికోటేశ్వరస్వామివారి దేవాలయము ఎప్పుడూ నిర్జనంగా ప్రశాంతంగా ఉంటుంది. రోజువారీ భక్తులరాక పరిమితంగా ఉంటూ కేవలం మహాశివరాత్రి సమయంలో మాత్రం కాలు పెట్టే సందు కూడాలేనంతగా భక్తజనంతో నిండిపోతుంది. కొండ మీదకు పోవడానికి నిర్మించబడిన ఘాటు రోడ్డులో ప్రకృతి దృశ్యాలను ఆస్వాదిస్తూ ఆలయానికి చేరుకోవచ్చు. పాప వినాశన స్వామిగుడీ పడమరగా ఉన్న నిటారుగా ఉండే సోపాన (మెట్ల) దారిలో పైకి ఎక్కి యాత్రికులు ఆలయానికి చేరుకుంటారు. ఇదే ఏనుగుల బాట లేక ఎల్లమంద సోపానం. దీనిని శ్రీ మల్రాజు నరసింహరాయణి నిర్మింపజేశారు.
విశిష్ట సేవా విధానం:
శ్రీ త్రికూటేశ్వరాలయంలో ఎప్పుడూ అఖండ దీపారాధన, అభిషేకాలు పూజలు జరుగుతాయి. శివరాత్రి ఉత్సవానికి ఇక్కడికి కుల మత భాషా ప్రాంత భేదాలు లేకుండా అశేష జనం వస్తారు. మహా ఎత్తైన ప్రభలు కట్టుకొని రావటం ఇక్కడ ప్రత్యేకత. అందుకే ఏదైనా ఎత్తుగా ఉంటె ‘’కోటప్పకొండ ప్రభ‘’ అనటం అలవాటైంది. మాఘమాసంలో పశువులతో ప్రదక్షిణ చేసి స్వామిని సేవిస్తారు. తడి బట్టలతో చిన్న చిన్న ప్రభలను భుజాన పెట్టుకొని గరి నెక్కి ప్రదక్షిణ చేస్తారు. సంతాన హీనులు, భూతప్రేత పిశాచాదుల బారిన పడినవారు నేత్రదృష్టి కోల్పోయిన వారు కోటేశ్వరస్వామి ప్రదక్షిణ చేసి దర్శించి మనోభీస్టాన్ని నేరవేర్చుకొంటారు.
కోటి ప్రభల కోటేశ్వరుడు:
’’శివరాత్రి నాడు లింగోద్భవ సమయంలో కోటిన్నోక్క ప్రభలతో నా కొండకు వచ్చే భక్తుల కోసం నేను కొండ దిగి వచ్చి దర్శనం అనుగ్రహిస్తాను‘’ అని కోటేశ్వరుడు అభయమిచ్చినట్లు భక్తులు విశ్వసిస్తారు. శివుడికి ఇష్టమైన వెదురు గడలతో ప్రభలను నిర్మించి, అనేక చిత్ర విచిత్ర పటాలను అలంకరించి విద్యుద్దీపాలతో వెలుగులు వెలయింపజేస్తూ కోటప్పకొండ తిరునాళ్ళకు వస్తారు. ఎడ్ల పందాలు, చిత్రమైన ఆటలు కోలాటాలు, నృత్య గీతాలతో, రంగుల రాట్నాలతో ప్రాంగణం అంతా శోభాయమానంగా కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో మేడారం తరువాత రెండో అతిపెద్ద జన జాతర శివరాత్రి రోజున కోటప్పకొండలోనే జరుగుతుంది. విభజన తర్వాత కోటప్పకొండ తిరునాళ్లకు ఏపీ ప్రభుత్వం రాష్ట్ర పండుగ హోదాను కల్పించింది. ఈ తిరునాళ్లలో విద్యుత్ ప్రభలే ప్రధాన ఆకర్షణ.
సామూహిక అక్షరాభ్యాసం:
ప్రముఖ శైవక్షేత్రంమైన కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి సన్నిధిలో కొలువుతీరిన మేధా దక్షిణామూర్తి పాదాల చెంత ప్రతి సంవత్సరమూ వేలమంది చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాస మహోత్సవం జరుగుతుంది. పర్వదినాలు అక్షరాభ్యాసానికి అనువైనవి. ముఖ్యంగా విజయదశమీ, శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రం ఉన్న రోజు, శ్రీపంచమి వంటి పర్వదినాలలో ఈ కార్యక్రమం చేయటంవల్ల ఆ దేవతల ఆశీస్సులూ అనుగ్రహమూ లభించి, విద్యాభివృద్ధికి దోహదం కలిగిస్తుందని నమ్మకం.
ముద్దుల ఎద్దుల అలంకారం:
ప్రభల బండ్లకు కావలసిన ఎడ్లను ఎంతో ముద్దుగా పెంచుతారు. అందుకోసం వాటికి మంచి తిండి పెట్టి కన్న బిడ్డలను సాకినట్లు సాకుతారు. వాటికి మెడలో మువ్వల పట్టెడలు, గంటల పట్టెడలు, మూతికి అందమైన శిఖమార్లు, నడుంకు తోలు బెల్టులు, ముఖానికి వ్రేలాడే కుచ్చులు, కొమ్ములకు రంగులు, కాళ్ళకు గజ్జెలు, వీపుమీద రంగు రంగుల గుడ్డలు అలంకరిస్తారు. ప్రభలు బయలుదేరి వస్తూ వుంటే ఎడ్ల సౌందర్యాన్ని చూడడానికి జనం మూగుతారు.
వసతి సౌకర్యాలు:
కొండపై తిరుమల దేవస్థానమువారి సత్రము, గవర్నమెంటువారి రెస్ట్ హౌస్ లు ఉన్నాయి. కొండ దిగువ భాగంలో సైతం కొన్ని సత్రాలు, బసవ మందిరము సేవలందిస్తూ అందుబాటులో ఉన్నాయి.
రవాణా సౌకర్యాలు
కోటప్పకొండకు దగ్గరలో కల నరసరావుపేట పాత బస్ స్టాండు, కొత్త బస్ స్టాండుల నుండి ప్రతి అరగంటకు ఇక్కడకు బస్సు ఉంది. విజయవాడ, గుంటూరు వైపు నుంచి వచ్చే యాత్రికులు చిలకలూరిపేట మీదుగా, నరసరావుపేట మీదుగా కూడా కోటప్పకొండకు చేరుకోవచ్చు. వినుకొండ మీదుగా నరసరావుపేట వచ్చే మార్గంలో పెట్లూరివారిపాలెం మీదుగా కోటప్పకొండకు చేరవచ్చు.
కాకులు అస్సలు కనిపించవు:
ఈ కోటప్పకొండ క్షేత్రానికి వున్న మరో విశిష్టత ఏమిటంటే, ఈ క్షేత్రం వున్న కొండ మీద కాకులు అస్సలు కనిపించవు. మిగతా పక్షులన్నీ కనిపిస్తాయిగానీ, ఎంత వెతికినా ఒక్క కాకి కూడా కనిపించదు. ఇదొక వింత. ఓ సందర్భంలో కాకి ఈ కొండమీదకి రాకుండా శాపం విధించారనే స్థల పురాణం ప్రచారంలో వుంది. 
పర్యాటక ఆకర్షణలు:
కొండమీద ఒక చిన్న సరసును నిర్మించి దాని మద్యలో కాళీయమర్ధన శిల్పాన్ని నిరించి ప్రత్యేక కాంతి ప్రసారం చేస్తుంటారు. కృత్రిమ జురాసిక్ పార్క్ మరొక పర్యాటక ఆకర్షణగా ఉంది. ఇక్కడ పెద్ద జురాసిక్‌లను ఏర్పాటు చేసారు. ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసిన నెమళ్ళు, పావురాళ్ళు, ఈమోలు మరియు చిలుకలు కూడా ఉన్నాయి. యాత్రీక ఆకర్షణలలో మరొకటి ధ్యానమందిరం. ఇక్కడ హోమాలు నిర్వహించబడతాయి. ఇవికాకుండా కొండ కింద అన్ని సామాజిక వర్గాలకు అన్నదాన సత్రాలు ఉన్నాయి. గతంలో అయితే పండుగల సమయంలోనే ఉచిత భోజనం ఉంది. ఇప్పుడు భక్తులు ముందుగా వచ్చి చెబితే నిత్యం భోజన ఏర్పాట్లు చేస్తున్నారు.


దగ్గరలోని సందర్శనీయ ప్రదేశాలు
గుత్తికొండ గుహలు
గుత్తికొండ గుహలు గుంటూరు జిల్లా నరసరావుపేటకు 38 కి.మీల దూరంలో ఉన్న కారెంపూడి అనే ప్రదేశంలో ఉన్నాయి. ఈ గుహల్లోనే ముచుకుంద మహా ముని తపస్సు ఆచరించారని చెపుతారు. 108 గుహలు ఉన్నాయని చరిత్ర చెపుతుంది, కానీ వాటిలో మనిషి 5 లేక 6 మాత్రమే చూడగలడు. ఈ గుహల్లో అనేక దేవతల దేవాలయాలు మరియు అనేక శివ లింగాలు కూడా ఉన్నాయి.
Click here to download above information in PDF format
Previous
Next Post »
0 Komentar