Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited.

Srisailam temple

శ్రీశైలం


          గంగా నదిలో రెండు వేల సార్లు మునిగినా, లేదా కాశీ క్షేత్రంలో లక్షలాది సంవత్సరాలు నివసిస్తే లభించేంత పుణ్యం 'శ్రీశైలం క్షేత్రాన్ని' దర్శిస్తే లభిస్తుందని ధార్మికుల విశ్వాసం. కోరిన కోర్కెలు తీర్చుతూ భక్తులపాలిట కొంగు బంగారమై శ్రీశైలముపై భ్రమరాంబా సమేతుడై కొలువై ఉన్నాడు మల్లికార్జున స్వామి. అందుకే, శ్రీశైలం భ్రమరాంబ మల్లిఖార్జున స్వామిక్షేత్రంగా పేరొందింది.
          శ్రీశైలానికే సిరిగిరి, శ్రీగిరి, శ్రీపర్వతము, శ్రీకైలాసం మొదలైన పేర్లున్నాయి. 'శ్రీ' అనగా సంపద, 'శైలమం'టే పర్వతం కనుక శ్రీశైలమంటే సంపద్వంతమైన పర్వతమని అర్ధం. ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఈ ప్రాచీన పుణ్యక్షేత్రం కర్నూలు జిల్లాలోని నల్లమలలోని దట్టమైన అటవీ ప్రాంతములో కృష్ణానది తీరములో సముద్రమట్టానికి 1500 అడుగుల ఎత్తులో ఉంది. మరో ముఖ్య విశేషమేమిటంటే ఇక్కడ నివసించే కొండజాతి వారు మల్లన్నను తమ అల్లుడిగా భ్రమరాంబిక అమ్మవారిని తమ కూతురిగా భావిస్తారు.
ఆలయ విశిష్టత
        శ్రీశైలంలో దేవాలయాలలో భ్రమరాంబ మల్లికార్జునస్వామి దేవాలయం ప్రసిద్ధి చెందినది. దీనిలో శివ పార్వతుల విగ్రహాలు వుంటాయి. ఇక్కడ మల్లికార్జున స్వామిని శివుడుగా మరియు, మాత పార్వతి దేవిని భ్రమరాంబగా పూజిస్తారు. శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవది, అష్టాదశ శక్తి పీఠములలో ఆరవది, మరియు దశ భాస్కర క్షేత్రములలో శ్రీశైలం ఆరవది. ఈ క్షేత్రాన్ని దక్షిణకాశీ అని పిలుస్తారు. హిందువులు ఈ దేవాలయానికి చాల ప్రాముఖ్యతనిచ్చి దర్శనం చేసుకొంటారు. శ్రీరాముడు, పాండవులు లాంటి పురాణ పురుషులు పూజలు చేసిన శ్రీమల్లికార్జునుని పవిత్రధామం. ఇక్ష్వాకులు, శాతవాహనులు, విష్ణుకుండినులు, పల్లవులు, విజయనగర సామ్రాజ్యాధీశులు, కాకతీయులు, రాష్ట్రకూటులు, చాళుక్యులు, రెడ్డిరాజులు ఈ ఆలయాన్ని దర్శించి, ఆలయ ప్రాకారాలు నిర్మించారు. నాలుగు వైపులా నాలుగు పెద్ద ద్వారములు, సుదూర ప్రాంతం నుండి సైతం కానవచ్చే బ్రహ్మాండమైన నాలుగు గోపురాలు, అత్యద్భుతమైన కట్టడాలుగా దేవాలయాలు నిర్మించారు. ఇక్కడ కల మల్లెల తీర్థం అనే జలపాతాలలో స్నానాలు ఆచరిస్తారు. ఈ నీటిలో స్నానాలు ఆచరిస్తే పాపాలు పోతాయని మోక్షం వస్తుందని భావిస్తారు.


స్థల పురాణం
         పూర్వం అరుణాసురడు అనే రాక్షసుడు ఈ ప్రపంచాన్ని పరిపాలించేవాడు. అతను చాలా కాలం పాటు గాయత్రీ మత్రం జపిస్తూ బ్రహ్మ కోసం తపస్సు చేసి ద్విపదాలచే మరియు చతుష్పదాలచే మరణం లేకుండా వరం పొందాడు. వరం ప్రభావంతో భయపడిన దేవతలు ఆదిశక్తిని ప్రార్థించారు. అమ్మవారు ప్రత్యక్షమయి అరుణాసురుడు తన భక్తుడని గాయత్రీ మంత్రం జపిస్తున్నంతవరకు అతనిని ఎవరూ ఏమీ చేయలేరని చెపుతుంది. తర్వాత దేవతలు పధకం ప్రకారం దేవతల గురువు అయిన బృహస్పతిని అరుణాసురని దగ్గరికి పంపిస్తారు. అరుణాసురడు దేవ గురువు బృహస్పతి రాక గురించి ఆశ్చర్యం వ్యక్త పరుచగా, బృహస్పతి అందుకు నమాధానంగా ఇద్దరం ఒకే అమ్మవారిని గాయత్రీ మంత్రంతో పూజ చేస్తున్నమని, కాబట్టి ఈరాకలో వింత ఏమి లేదని చెపుతాడు. అందుకు అరుణాసురుడు దేవతలు పూజ చేసే అమ్మవారిని నేను ఎందుకు పూజ చేయాలని అహంకరించి గాయత్రి మంత్రం జపాన్ని మానేస్తాడు. దానికి కోపించిన ఆదిశక్తి భ్రమర రూపం ధరించి అసంసాఖ్యకంగా భ్రమరాలని సృష్టిస్తుంది. ఆ భ్రమరాలు అరుణాసురుడిని అతని సైన్యాన్ని సంహరిస్తాయి.
ఆలయ చరిత్ర
         పురాతన కాలంనాటి హిందూ మత, సాంస్కృతిక మరియు సాంఘిక చరిత్రలో శ్రీశైల క్షేత్రం ప్రధాన పాత్ర పోషిస్తుంది. పూర్వ చారిత్రాత్మక అధ్యయనాల ప్రకారం శ్రీశైలం సుమారు 30,000-40,000 సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్నది. శాతవాహనులతో శ్రీశైలం యొక్క చరిత్ర మొదలయ్యిందని శిలాశాసనాలు వెల్లడిస్తున్నాయి. ఈ ప్రాంతమును శాతవాహనులకు చెందిన మల్ల శతకరని పరిపాలించేవాడు అందుకే అతడిని పవిత్ర దేవుడైన మల్లన్నగా పిలిచేవారు. శ్రీశైలం నుండి 50 కిలోమీటర్ల దూరంలో, విజయపురిని వారి రాజధాని చేసుకొని ఇక్ష్వాకులు పాలించారు. అందుచే ఈ క్షేత్రమును వారి సామ్రాజ్యానికి సంరక్షతముగా భావించేవారు.
           శ్రీశైల మల్లిఖార్జున స్వామికి విష్ణుకుండియులు అపర భక్తులు. కదంబ శాంతివర్మ యొక్క తెలగుండా శాసనం ద్వారా శ్రీశైలం ప్రాంతం వాస్తవానికి పల్లవ రాజ్యంలో చేర్చబడి, తరువాత కధాంబీయుల యొక్క మొదటి స్వతంత్ర రాజ్యంగా ఏర్పడింది. రెడ్డి రాజుల కాలం శ్రీశైలం యొక్క స్వర్ణ యుగం, ఈ రాజవంశం యొక్క దాదాపు అందరు పాలకులు ఆలయం కోసం సేవలను జరుపుకున్నారు. ప్రోలయ వేమారెడ్డి శ్రీశైలం మరియు పాతాళగంగకు మెట్లమార్గం నిర్మించారు. అనవేమారెడ్డి వీరశిరో మండపంను నిర్మించారు.
           ఉమమహేశ్వరం నుండి శ్రీశైలం వరకు జఠరరేవు మీదుగా వెలమ వంశస్థులు మెట్ల మార్గమును నిర్మించారు. విజయనగర సామ్రాజ్యం యొక్క రెండవ హరిహరరాయ మల్లికార్జున ఆలయం యొక్క ముఖమండపం మరియు దేవాలయ సముదాయానికి దక్షిణాన ఒక గోపురాన్ని నిర్మించారు. శ్రీ కృష్ణదేవరాయలు వీధికి రెండు వైపులా సాలమండపములను నిర్మించారు.
          తరువాత మొఘల్ చక్రవర్తులు ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని తరువాత కర్నూలు నవాబులకు జగీర్ గా ఇవ్వబడింది. మొఘల్ చక్రవర్తుల పతనం తరువాత ఈ ప్రాంతం హైదరాబాద్ నిజాం యొక్క నియంత్రణలో వచ్చింది. నిజాం 1870లో కర్నూలు జిల్లాను బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి అప్పగించినప్పుడు మేజర్ మన్రో జిల్లా కోర్టు అధికారుల నిర్వహణకు అప్పగించారు. 1929లో ఆలయ నిర్వహణ కోసం ఒక కమిటీని బ్రిటీష్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 1949లో ఈ ఆలయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ నియంత్రణలోకి వచ్చింది. 1956లో రోడ్డు మార్గం ప్రారంభించిన తరువాత దాని పూర్వ వైభవము సాధించింది.
శ్రీశైల దేవాలయ ప్రాంతము:
            ప్రధాన ఆలయాలు అయినా మల్లికార్జున మరియు భ్రమరాంభ వేరువేరుగా నిర్మించబడి మరియు ప్రత్యేక ఆలయాలు, స్థంభాలతో కూడిన అనేక ఉప పుణ్యక్షేత్రాలు, మండపాలు మొదలైనవి ఉన్నాయి. ఈ మొత్తం దేవాలయం చుట్టూ క్లిష్టమైన భారీ రాళ్ళతో అత్యంత ఆకర్షణీయంగా ప్రాకారమును నిర్మించారు. ప్రాకారమునకు ముఖ్యంగా నాలుగు వైపులా నాలుగు ద్వారములు ఉన్నాయి తూర్పు వైపు ఉన్న ద్వారము "మహద్వారము".
         అంతర్గత ఆలయ ఆవరణలో నందిమండపం, వీరశిరోమండపం, మల్లిఖార్జున ఆలయం మరియు భ్రమరాంభ ఆలయం అన్ని తూర్పు నుండి పడమరకు వరుసగా ఉన్నాయి. వృద్ధ మల్లిఖార్జున, సహస్రనామ లింగేశ్వర, అర్ధనారీశ్వర, వీరభద్ర, ఉమా మహేశ్వర దేవాలయం మరియు పాండవ ప్రతిష్ట దేవాలయాలు అనే ఐదు ఆలయాల సమూహం మరియు నవబ్రహ్మ దేవాలయాలు అనే తొమ్మిది ఆలయాలు మరి కొన్ని చిన్న చిన్న ఆలయాలు కూడా ఉన్నాయి.
        ఇక్కడ శివరాత్రి సందర్భంగా నిర్వహించే రధోత్సవములో వీరే రథాన్ని లాగుతారు. స్వామివారి ఆలయాన్ని శాతవాహనులు, పల్లవులు, ఇక్ష్వాకులు, కాకతీయులు, విజయనగరాధీశులు ఇలా ఎంతో మంది చేస్తూ వచ్చారు. ఈ ఆలయం గురించి పురాణాల్లో ప్రస్తావన ఉంది. స్వామి వారిని త్రేతాయుగములో శ్రీరామచంద్రుడు వనవాస సమయములో సీతా సమేతుడై వచ్చి దర్శించుకున్నాడట. అలాగే ద్వాపరయుగములో పాండవులు కూడా స్వామి వారిని దర్శించి స్వామి వారి కృపకు పాత్రులయ్యారట. ఎంతోమంది ఋషులు స్వామి వారి ఆలయ ఉన్న ప్రాంతములో తపమొనరించి ముక్తిమార్గం పొందారు.శ్రీశైలం-దర్శనీయ ప్రదేశాలు
శ్రీశైలం చుట్టు ప్రక్కల దాదాపు అయిదు వందల వరకూ శివలింగాలు ఉంటాయంటారు. పరిసర ప్రాంతాలలో చూడదగిన ప్రదేశాలు, దేవాలయాలు,మఠాలు, మండపాలు, చారిత్రక స్థలాలు అనేకాలు ఉన్నాయి.
సాక్షి గణపతి ఆలయము
ఇది ముఖ్యాలయానికి 3 కి.మీ. దూరములో ఉంటుంది. ఈ గణపతి ఆలయము ప్రత్యేకత ఏమిటంటే మనము శ్రీశైలములో శివుడిని దర్శించినట్లు సాక్షి గణపతే సాక్ష్యము. కాబట్టి ఇతనిని 'సాక్షి గణపతి' అంటారు.
హటకేశ్వరం
ఈ సుందరమైన ప్రదేశం శ్రీశైల దేవాలయానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పరిసరాలలోనే శ్రీ ఆది శంకరాచార్యులవారు నివసించారు. పరమశివుడు అటిక (కుండ పెంకు) లో వెలియడంతో ఈ ఆలయంలోని ఈశ్వరుని అటికేశ్వరుడు అనేవారు, రానురాను అదేమెల్లగా హటికేశ్వరస్వామిగా మారిపోయింది.
శిఖరం
శిఖరం ప్రధాన దేవాలయానికి 8 కిలోమీటర్ల దూరంలో మరియు సముద్ర మట్టానికి 2830 అడుగుల ఎత్తులో ఉంది. శ్రీశైలములో శిఖరదర్శనము చేసుకొంటే పునర్జన్మ ఉండదు అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి.
ఫాలధార, పంచధారలు
ఫలధార, పంచధార ప్రధాన దేవాలయానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. పురాణాల ప్రకారం శ్రీ ఆదిశంకరాచార్యులు ఈ ప్రదేశంలోనే తపమాచరించినారని ప్రతీది మరియు ఈ ప్రదేశములోనే ఆదిశంకరాచార్యులు ప్రసిద్ధ "శివానందలహరి"ని రచించారు. కొండపగులులనుండి పంచదార (ఐదుధార) లతో వచ్చే జలాలు చల్లగా ఏ కాలంలోనైనా ఒకే మాదిరిగా ప్రవహిస్తూ ఒక్కొక్కధార ఒక్కొక్క రుచితో ఉండుట ఇక్కడి ప్రత్యేకత. ఒకధార నుండి జలము సేవించి ప్రక్కమరొక దాని నుండి సేవిస్తే మార్పు తెలుస్తుంది.
పాతాళ గంగ
శ్రీశైలం నుండి చాలా మెట్లు దిగి కృష్ణానదిలో స్నానం చెయ్యాలి. ఆ మెట్లు అన్నీ దిగి కృష్ణలో మునిగి తిరిగి ఎక్కినపుడు పాతాళగంగ అనునది ఎంత సార్థక నామధేయమో తెలుస్తుంది. పాతాళ గంగ వద్ద నీరు నీలంగా కాక పచ్చగా ఉంటుంది. 2004లో పాతాళగంగకు వెళ్ళుటకు రోప్ వే ఏర్పాటు చేయబడింది.
శ్రీశైలం ప్రాజెక్టు
శ్రీశైలం పుణ్యక్షేత్రంలోని పాతాళగంగ స్నానఘట్టానికి 0.8 కి.మీ. దిగువన డ్యాము నిర్మించబడింది. కేవలం జలవిద్యుత్తు ప్రాజెక్టుగానే ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు, తరువాతి కాలంలో నీటిపారుదల అవసరాలను కూడా చేర్చడంతో బహుళార్థసాధక ప్రాజెక్టుగా మారింది.
భీముని కొలను
భీముని కొలను దక్షిణ మరియు పశ్చిమ వైపుల నుండి శ్రీశైలం దేవస్థానికి వెళ్ళుటకు అతి పురాతన మార్గము దృడమైన రాతి పలకలతో అద్భుతంగా నిర్మింపబడి ఉంది. ఈ మార్గం దట్టమైన అడవిలో నాగలూటి నుంచి మొదలయి శ్రీశైలం వరకు నిర్మింపబడి ఉంది. పాండవుల వనవాస సమయములో ద్రౌపది దాహంతో ఉండగా సమీపంలో ఎక్కడ నీరు లేకపోవడముతో కోపోద్రిక్తుడైన భీముడు తన గదతో కొండను బద్దలు కొడతాడు ఫలితంగా, కొండ రెండు భాగాలుగా విడిపోయి నీరు వాటి మధ్యలో నుండి వస్తాయి దాని వల్ల ఇది "భీముని కొలను" గా పేరు వచ్చిందని పురాణాల ద్వారా తెలుస్తుంది.
భైరవసేల
ఈ ప్రదేశం శ్రీశైలం నుండి 13 కి. మీ దూరములో శ్రీశైలం-దోర్నల రహదారిపై శిఖరంకు దగ్గరలో ఉంటుంది. ఈ ప్రదేశములో ఒక గుహ మరియు అందమైన నీటి జలపాతాలతో ఉంటుంది. గుహలో ఎరుపు రంగులో ఉన్న రాతి శిల పై బైరవుడు చెక్కబడి, జలపాతాల మధ్యలో విగ్రహం ఉంటుంది. ఈ ప్రదేశములో ఉన్న స్థానిక గిరిజన చెంచు జాతి వారు అదే గుహ వద్ద తమ దేవుడైన బయన్న పూజలు చేస్తారు కాబట్టి దీనిని స్థానికంగా బయన్నసెలా అంటారు.
     ఇవే కాక పంచమఠాలు, ఇష్టకామేశ్వరి ఆలయం, నాగలూటి, కడలివనం, భ్రమరాంబ చెరువు, మల్లెల తీర్థం, శైలేశ్వరం, గుప్త మల్లిఖార్జునం, సిద్ధ రామప్ప కొలను, హేమారెడ్డి మల్లమ్మ మందిరం, శివాజీ సాంస్కృతిక,స్మారక భవనము వంటివి శ్రీశైలం కు సమీపంలో గల దర్శనీయ ప్రదేశాలు.
వసతి సదుపాయములు


శ్రీ శైలంలో వసతిగా దేవస్థానమువారి సత్రములు, అతి పెద్ద కాటేజీలు, హొటల్స్ ఉన్నాయి. ఆంధ్రదేశములో ఎక్కడా లేని విధంగా కులప్రాతిపదికగా ఎవరికి వారుగా ప్రతి కులపువారికీ ఒక సత్రం నిర్వహింపబడుతున్నది. శివరాత్రి పర్వదినములు, కార్తీకమాసమునందు తప్ప మిగిలిన రోజులలో ఏసత్రములోనైనా ఎవరికైనా వసతి లభించును. మరికొన్ని ప్రైవేటువారి సత్రములతోనూ శ్రీశైలం భక్తజనులతో కళకళలాడుతుంటుంది.
శ్రీశైలం-రవాణా సౌకర్యాలు
రోడ్డు మార్గములు:
1. గుంటూరు నుండి శ్రీశైలం 225 కి.మీ. దూరంలో ఉంది. గుంటూరు నుండి నరసరావుపేట, వినుకొండ మీదుగా వచ్చే ఈ మార్గం దోర్నాల వద్ద కర్నూలు రోడ్డుతో కలుస్తుంది. అక్కడి నుండి శ్రీశైలంకు కొండ మార్గంలో ప్రయాణం (53 కి.మీ.) కొండల మధ్యగా చాలా బాగుంటుంది.
2. హైదరాబాదు నుండి శ్రీశైలం 212 కి.మీ. దూరంలో ఉంది. ఈ రోడ్డు అటవీ ప్రాంతం గుండా పోతుంది. అటవీశాఖ వారు రాత్రి వేళల్లో ఈ ప్రాంతం గుండా ప్రయాణించటానికి అనుమతించరు కనుక పగటి వేళ మాత్రమే ప్రయాణించాలి.
రైలు మార్గములు: భారతదేశములో ఏవైపునుండి అయినా గుంటూరు మీదుగా నరసరావుపేట / మార్కాపురం వరకూ రైలు సౌకర్యములు కలవు.
Click here to download above same information in PDF format in Telugu 
Previous
Next Post »
0 Komentar