Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

History and Prominence of Sri Rama Navami


History and Prominence of Sri Rama Navami

శ్రీరామ నవమి చరిత్ర మరియు ప్రాముఖ్యత

========================

'రామా' అనే రెండక్షరాల రమ్యమైన పదం, పలుకని జిహ్వ జిహ్వే కాదు. శ్రీరామనవమి హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగ. ప్రజలు ఈ పండగను అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు. వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి నాడు జరుపుకునే ఈ పండుగకు చాలా విశిష్టత ఉంది. త్రేతాయుగంలో ఇదే ముహుర్తానికి విష్ణుమూర్తి యొక్క 7 వ అవతారంగా శ్రీ రాముడు జన్మించాడు. ఆ మహనీయుని జన్మదినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది. శ్రీరామచంద్రుడిని తెలుగువారు ప్రతి ఇంటా ఇంటి ఇలవేలుపుగా కొలుస్తారు. ఈ చైత్ర శుద్ధ నవమి నాడు తెలంగాణాలో గల భద్రాచలమందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు.

చరిత్ర

రామాయణంలో అయోధ్యకు రాజైన దశరథుడికి ముగ్గురు భార్యలు; కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఆయనకు ఉన్న బాధ అంతా సంతానం గురించే. సంతానం లేక పోతే రాజ్యానికి వారసులు ఉండరని. అప్పుడు వశిష్ట మహాముని రాజుకు పుత్ర కామేష్టి యాగం చేయమని సలహా ఇచ్చాడు. రుష్య శృంగ మహామునికి యజ్ఞాన్ని నిర్వహించే బాధ్యతను అప్పజెప్పమన్నాడు. వెంటనే దశరథుడు ఆయన ఆశ్రమానికి వెళ్ళి ఆయనను తన వెంట అయోధ్యకు తీసుకుని వచ్చాడు. ఆ యజ్ఞానికి తృప్తి చెందిన అగ్ని దేవుడు పాయసంతో నిండిన ఒక పాత్రను దశరథుడికిచ్చి భార్యలకు ఇవ్వమన్నాడు. దశరథుడు అందులో సగ భాగం మొదటి భార్య కౌసల్యకూ, రెండో సగ భాగం చిన్న భార్య యైన కైకేయికి ఇచ్చాడు. వారిద్దరూ వారి వాటాల్లో సగం మిగిల్చి రెండో భార్యయైన సుమిత్రకు ఇచ్చారు. కొద్దికాలానికే వారు ముగ్గురూ గర్భం దాల్చారు. చైత్ర మాసం తొమ్మిదవ రోజైన నవమి నాడు, మధ్యాహ్నం కౌసల్య రామునికి జన్మనిచ్చింది. అలాగే కైకేయి భరతుడికీ, సుమిత్ర లక్ష్మణ శతృఘ్నూలకు జన్మనిచ్చారు. శ్రీరాముడు ధర్మ సంస్థాపనార్థం అవతరించిన శ్రీ మహా విష్ణువు యొక్క ఏడవ అవతారం. రావణుని అంతమొందించడానికి అవతరించిన వాడు.

ఉత్సవం

ఈ పండగ సందర్భంగా హిందువులు సాధారణంగా తమ ఇళ్ళలో సీతారాముల విగ్రహాలకు కల్యాణోత్సవం నిర్వహిస్తుంటారు. శ్రీ రామ నవమి సంధర్భంగా అన్ని ఆలయాలలోను చలువ పందిళ్ళు వేసి సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా చేస్తారు. దేవాలయాలను అందంగా విద్యుద్దీపపు కాంతులతో అలంకరిస్తారు. సీతారాముల కళ్యాణాన్ని వీక్షించడానికి విచ్చేసిన భక్తులకు మిరియాలు వేసిన పానకము, వడ పప్పు ప్రసాదంగా ఇస్తారు అంతే కాకుండా సీతారాముల కళ్యాణం లో వాడిన తలంబ్రాలని భక్తులకు పంచుతారు. ఆ తలంబ్రాలను తమ పూజ గదిలో పెట్టుకుంటే మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం. పురాణాల ప్రకారం కోదండ రాముని వివాహానికి సామాన్య ప్రజలే కాదు దేవతలు కూడా దివి నుంచి భువికి దిగివస్తారని ఉవాచ. చివరగా విగ్రహాలను వీధుల్లో ఊరేగిస్తారు.


శ్రీరాముడు సత్యపాలకుడు ధర్మాచరణం తప్పనివాడు, ఏకపత్నీ వ్రతుడు, పితృ, మాతృ, భాతృ, సదాచారం, నిగ్రహం, సర్వ సద్గుణాలు మూర్త్భీవించిన దయార్ద హృదయుడు. శ్రీరామనవమి రోజున సీతారాముని, లక్ష్మణ, భరత, శతృఘ్న, ఆంజనేయ సమేతముగా ఆరాధించి, వడ పప్పు, పానకము నైవేద్యముగా సమర్పించుకుంటారు. చైత్ర నవరాత్రి (మహారాష్ట్రలో), లేదా వసంతోత్సవం (ఆంధ్రప్రదేశ్ లో) తో తొమ్మిది రోజులు పాటు సాగే ఈ ఉత్సవాలను ముగిస్తారు.

తెలుగు రాష్ట్రాలలోని అధికారిక కార్యక్రమాలు

శ్రీరామచంద్రుని క్షేత్రాలలో అత్యంత వైశిష్ట్య ప్రాధాన్యత ప్రాశస్త్యముగల క్షేత్రం తెలంగాణలోని భద్రాచలం దివ్యక్షేత్రం. శ్రీరామచంద్రుడు తన వనవాస జీవితం ఇక్కడే గడపడమే ఈ పుణ్య క్షేత్రం యొక్క వైశిష్ట్యం. ప్రభుత్వం తరఫున, ముఖ్యమంత్రి తన తలమీద సీతారామ కళ్యాణ సందర్భంగా తలంబ్రాలకు వాడే ముత్యాలను తీసుకుని వస్తారు. భద్రాచలంలో జరిగే శ్రీ సీతారామ కళ్యాణము చూసి తరించిన వారి జన్మ సార్థకం చెందుతందనేది భక్తుల విశ్వాసం.

ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ విడివడి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటంతో ఒంటిమిట్టలోని కోదండ రామాలయం ఆంధ్రా భద్రాచలంగా పేరుగాంచింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీరామనవమి రోజున ఈ ఆలయంలోనే అధికారికంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

రామరాజ్యం

దేశంలోని ప్రజలంతా సిరిసంపదలతో, సుఖ సంతోషాలతో ఉంటే అది రామరాజ్యమని హిందువుల విశ్వాసం. మహాత్మా గాంధీ కూడా స్వాతంత్ర్యానంతరం భారతదేశం రామరాజ్యంగా విలసిల్లాలని భావించాడు. సాధారణంగా ఈ పండుగ మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో వస్తుంది. ఉదయాన్నే సూర్యభగవానునికి ప్రార్థన చేయడంతో ఉత్సవం ఆరంభమౌతుంది. శ్రీరాముడు జన్మించినట్లుగా చెప్పబడుతున్న సమయం మధ్యాహ్నం కావున ఈ సమయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రత్యేకించి ఉత్తర భారతదేశంలో భక్తులను విశేషంగా ఆకర్షించేది ఊరేగింపు ఉత్సవం. ఈ ఉత్సవంలో ప్రధాన ఆకర్షణ అందంగా అలంకరించిన రథం, అందులో రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమంతుల వేషాలు ధరించిన నలుగురు వ్యక్తులు. ఈ రథంతో పాటుగా పురాతన వేషధారణతో రాముని సైనికుల్లా కొద్దిమంది అనుసరిస్తారు. ఊరేగింపులో పాల్గొనేవారు చేసే రామరాజ్యాన్ని గురించిన పొగడ్తలు, నినాదాలతో యాత్ర సాగిపోతుంది .

శ్రీరామనవమి వేసవి కాలం ప్రారంభంలో వస్తుంది. వేసవిలో సూర్యుడు ఉత్తరార్థ గోళానికి చేరువగా వస్తాడు. సూర్యుడు, రాముడు జన్మించిన సూర్యవంశానికి ఆరాధ్యుడిగా చెబుతారు. ఈ వంశానికి చెందిన ప్రముఖ రాజులు దిలీపుడు, రఘు మొదలైనవారు. వీరిలో రఘు కచ్చితంగా మాట మీద నిలబడే వాడిగా ప్రసిద్ధి గాంచాడు. శ్రీరాముడు కూడా ఆయన అడుగుజాడల్లోనే నడచి తండ్రి తన పినతల్లి కైకకు ఇచ్చిన మాటకోసం పదునాల్గేళ్ళు వనవాసం చేశాడు. దీనివల్లనే రాముని రఘురాముడు, రఘునాథుడు, రఘుపతి, రాఘవేంద్రుడు మొదలైన పేర్లతో పిలవబడుతుంటాడు.

========================

CLICK FOR HISTORY AND PROMINENCE OF SRIRAMA NAVAMI IN PDF FORM

========================

Previous
Next Post »
0 Komentar

Google Tags