Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Telugu New Year - Ugadi


ఉగాది పండుగ విశేషాలు

ఉగస్య ఆది: ఉగాది: - "ఉగ" అనగా నక్షత్ర గమనము - జన్మ - ఆయుష్షు అని అర్థాలు.  వీటికి 'ఆది' 'ఉగాది'. అనగా ప్రపంచము యొక్క జన్మ ఆయుష్షులకు మొదటిరోజు కనుక ఉగాది అయినది. భారతీయ సంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి నాడే అనగా ఉగాది రోజున సృష్టి జరిగిందని పురాణైతికంగా చెప్పబడింది. 'యుగము' అనగా రెండు లేక జంట అని కూడా అర్ధము. ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే ఆయన ద్వయ సంయుతం 'యుగం' (సంవత్సరం) కాగా, ఆ యుగానికి ఆది యుగాది అయింది.  అదే సంవత్సరాది. మనతోడివారైన కన్నడులు నేడూ యుగాది అని యకారాదిగానే దీనిని వ్యవహరిస్తారు.యకారాది పదాలు తెలుగుభాష సంప్రదాయం కాదు గనుక ఉగాది అయి ఉంటుంది.

ఉగాది తెలుగువారికి ముఖ్యమైన పండగ.. దీనిని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. తెలుగు వారు చాంద్రమానాన్ని అనుసరిస్తారు. కాబట్టి ఇది చైత్ర మాస చైత్ర మాస శుద్ధ పాడ్యమి నాడు వస్తుంది. ఈరోజున పంచాంగ శ్రవణం, షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి ని తినడం ప్రశస్త్యమైంది. మహిళలు ఉగాది పచ్చడి తయారు చేసి దేవునికి నైవేద్యంగా పెడతారు. ఇంట్లోవారంతా స్నానం చేసి, కొత్త బట్టలు ధరించి పరగడుపున ఉగాది పచ్చడి తిని తర్వాత అల్పాహారం తీసుకుంటారు. ఆ రకంగా తమ జీవితాలు అన్ని అన్ని రుచుల మిశ్రమంగా ఉండాలని ఆకాంక్షిస్తారు.

పంచాంగ శ్రవణం తిథి వల్ల సంపద, వారం వల్ల ఆయుష్యం, నక్షత్రం వల్ల పాపపరిహారం, యోగం వల్ల వ్యాధి నివృత్తి, కరణం వల్ల కార్యానుకూలత కలుగుతాయని ఉగాది రోజున పంచాగం శ్రవణం చేసిన వారికి ”సూర్యుడు శౌర్యాన్ని, చంద్రుడు వైభవాన్ని ”కుజుడు శుభాన్ని, ”శని ఐశ్వర్యాన్ని, ”రాహువ్ఞ బాహుబలాన్ని, ”కేతువ్ఞ ఆధిక్యాన్ని కలుగజేస్తారని అంటారు. ఈనాటి పంచాంగ శ్రవణం గంగాస్నాన ఫలితాన్నిస్తుందట. ఈరోజున ఎలా గడిస్తే,సంవత్సరమంతా అలాగే గడుస్తుందని ఒక నమ్మకం.                         

హిందువులకు అత్యంత శ్రేష్ఠమైన ఈ ఉగాది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో విశేషంగా జరుపుకుంటారు. ఆంధ్ర, కర్ణాటకల్లో ఉగాదిగా పరిగణిస్తే మహారాష్ట్రలో 'గుడిపాడ్వా' పేరుతో పిలుస్తారు. తమిళులు "పుత్తాండు" అనే పేరుతో, మలయాళీలు "విషు" అనే పేరుతోను, సిక్కులు "వైశాఖీ" గానూ, బెంగాలీలు "పొయ్‌లా బైశాఖ్" గానూ జరుపుకుంటారు. అయితే పండుగను నిర్వహించడంలో పెద్దగా తేడాలు లేవనే చెప్పవచ్చును.

ఉగాది ప్రాముఖ్యం / ఉగాది పుట్టుపూర్వోత్తరాలు

చైత్ర శుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని నిర్మించడం ప్రారంభించారని నమ్ముతారు. మత్స్యావతారము ధరించిన విష్ణువు సోమకుని సంహరించి వేదాలను బ్రహ్మకప్పగించిన సందర్భంగా ‘ఉగాది’ ఆచరణలోకి వచ్చెనని పురాణప్రతీతి. బ్రహ్మదేవుడు ఈ జగత్తును చైత్ర మాస శుక్లపక్ష ప్రథమ దినాన సూర్యోదయ వేళ సమగ్రంగా సృష్టించాడంటారు. అంటే కాలగణాన్ని గ్రహ, నక్షత్ర, రుతు, మాస, వర్ష, వర్షాధికులను బ్రహ్మదేవుడు ఈనాడు ప్రవర్తింప చేసాడన్నది పెద్దల భావన. అంతే కాదు వసంత ఋతువు కూడా అప్పుడే మొదలవుతుంది. అందుకే కొత్త జీవితానికి నాందికి గుర్తుగా ఉగాది పండుగను జరుపుకుంటారు. శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన దినం కారణంగా ఈ పండుగ ప్రాశస్త్యంలోకి వచ్చిందని మరొక గాథ.”ఉగాది”, మరియు “యుగాది” అనే రెండు పదాలు వాడుకలో ఉన్నాయి. “ఉగ” అనగా నక్షత్ర గమనం. నక్షత్రగమనానికి ‘ఆది’ ‘ఉగాది’.అంటే సృష్టి ఆరంభమైనదినమే “ఉగాది”. ‘యుగము’ అనగా ద్వయము లేక జంట అని కూడా అర్ధము. ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే ఆయన ద్వయ సంయుతం ‘యుగం’ (సంవత్సరం) కాగా, ఆ యుగానికి ఆది (సంవత్సరాది) యుగాది అయింది. యుగాది శబ్దానికి ప్రతిరూపమైన ఉగాదిగా వ్యవహృతమైనది. ఏది ఏమైనా జడప్రాయమైన జగత్తులో చైతన్యాన్ని రగుల్కొల్పి మానవాళిలో నూతనాశయాలను అంకురింపచేసే శుభదినం 'ఉగాది'.

ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించుట పరిపాటి. ఆ రోజున ప్రాతః కాలమున లేచి ఇళ్లు, వాకిళ్లు, శుభ్ర పరచుకుంటారు. ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు.తలంటి స్నానం చేసి, కొత్త బట్టలు ధరించి, ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు. ఉగాది సంప్రదాయాను సారంగా రైతులను గౌరవించే వేడుకగా చెప్పడం జరిగింది.రైతులతో పాటుగా తెలుగు వారు ప్రతిఒక్కరు కూడా తమదిగా భావించే పండుగ మన ఉగాది-పర్వదినం.


కాలమానంలోని అంశాలన్నింటిని పూర్తిగా ఖగోల శాస్త్రరీత్యా పురాతన భారతీయులు నిర్ణయించారు. కాలమాన అంశాలైన రోజు, వారం, పక్షం, కార్తె మాసం, రుతువు, అయనం, సంవత్సరం, పుష్కరం, శకం, యుగం, కల్పకం మొదలైన అన్నింటినీ ఖగోళ శాస్త్ర ఆధారంగానే ఏర్పాటు చేసుకున్నారు. ఖగోళపరమైన కాలమానాన్ని పురాణకాలం నుంచి ఆచరించడం భారతీయుల ఘనత. ఇది మన భారతజాతి కాలమాన పరిజ్ఞానానికి ఉన్న అవగాహనను తెలిజేస్తుంది. అంతేకాదు మన సంస్కృతి, సంప్రదాయాలకు నిలువుటద్దంగా ఉంది ఉగాది.

ఉగాది పచ్చడి ప్రత్యేకత

ఆనందం, విచారం, కోపం, భయం, ఆశ్చర్యం, ద్వేషం, సుఖం, దుఃఖం కలగలిసిన భావమిశ్రమం జీవితం. ఉగాది పచ్చడి కూడా జీవితంలోని చేదు, తీపి సంఘటనలకు ప్రతీకగా చెప్పవచ్చు. వేపపువ్ఞ్వ వగరు, బెల్లం తీపి, ఉప్పు, చింతపండు మామిడిముక్కలలోని పులుపు ఇలా అన్నింటినీ కలిపి తియ్యతియ్యని, పుల్లపుల్లని ఉగాదిపచ్చడి లాగే మన జీవితం కూడా తీపి చేదు అనుభవాల మిశ్రమం అని చెప్పేందుకే.        

"ఉగాది పచ్చడి" ఈ పండుగకు ప్రత్యేకమైంది. షడ్రుచుల సమ్మేళనం - తీపి (మధురం), పులుపు (ఆమ్లం), ఉప్పు (లవణం), కారం (కటు), చేదు (తిక్త), వగరు (కషాయం) అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది.. ఈ పచ్చడి కొరకు చెరకు, అరటి పళ్ళు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలగునవి వాడుతుంటారు.

ఉగాది పచ్చడి చేసే విధానం

దీనికి కావలసిన పదార్డాలు: వేప పువ్వు-1కప్పు, బెల్లంపొడి-1కప్పు, కొబ్బరికోరు-1కప్పు, బాగాముగ్గిన అరటి పండ్లు-6, మామిడికాయ-1, కొత్తకారము-చిటెకెడు, ఉప్పు-అరస్పూను, శనగ పుట్నాల పప్పు పొడి-1కప్పు, చింతపండు-నిమ్మకాయంత, కొద్దిగా చెరుకుముక్కలు, వేయించిన వేరుశనగపప్పు-అరకప్పు చింతపండులో నీళ్లు పోసి పులుసు తీయాలి. అరటిపండు తొక్కలు తీసి చిన్నముక్కలుగా తరగాలి. మామిడికాయ తొక్కతీసి చిన్నముక్కలుగా తరగాలి. చింతపండు పులుసులో బెల్లం వేసి కరిగేవరకు కలపాలి. వేపపువ్వు తప్పించి మిగిలిన పదార్ధాలన్నీ వేసి బాగా కలపాలి. ఆఖరున వేపపువ్వు కలపాలి.

ఉగాది పచ్చడి - ఔషధగుణం

మన పూర్వీకులు అందించిన ఆచారాల వెనుక వైద్య రహస్యం అంతర్లీనంగా దాగి ఉంటుంది. ఈ పచ్చడిలో ప్రధానంగా వాడే వేపపువ్వులో ఉన్న చేదు మంచి క్రిమిసంహారిణిగా ఉపయోగపడుతుంది. కఫ,వాత పైత్యాలను హరించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బెల్లం కలపడంలో ఉద్దేశం ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు బెల్లం పానకం తాగడం వల్ల శరీరంలో వేడి తగ్గి చల్లదనం ఏర్పడుతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. మామిడికాయలో ఎక్కువ ఔషధగుణాలున్నాయి. ఇది గుండెకు బలాన్ని వస్తుంది. జీర్ణవ్యవస్థకు, కాలేయానికి శక్తినిస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది. మలబద్ధకానికి శరీరంలో ఉన్న అధిక నీరును తొలగించడానికి రోగనిరోధకారిగా పనిచేస్తుంది. చింతపండు వాతరోగాన్ని హరిస్తుంది. మూత్రపిండాలలోని రాళ్లను కరిగిస్తుంది. చింతపండు వాతరోగాన్ని హరిస్తుంది. ఎముకలకు బలాన్నిస్తుంది. పచ్చిమిరపలో వాతాన్ని పోగొట్టే గుణం ఉంది. ఉప్పు అజీర్ణాన్ని పొగొడుతుంది. ఉగాది పచ్చడిలో చెరకు ముక్కలు కూడా వేస్తారు. చెరకు రసం తాగడం వల్ల మూత్రపిండాలకు చాలా మంచిది. అధిక మూత్రాన్ని అరికడుతుంది. శరీరంలో వాతాన్ని తగ్గిస్తుంది.

కొత్త ఆశలతో ఉగాది

వసంత బుతువు ఆగమనంతో ప్రకృతి శోభ ద్విగుణీకృతం అవుతుంది. కోయిలలు కుహుకుహుగానాలు మృదుమధురంగా చెవులకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. పంట చేల పచ్చదనాల పరవళ్లు, చెట్లు చేమలు అన్నీ లేలేత ఆకులతో చివుళ్లు వేస్తుంటే మేమేమన్నా తక్కువా అని పూవనాలు రంగురంగుల పూలతో సువాసనాభరిత వర్ణాలను చిందిస్తాయి. మామిడిపూత కాయలు పిందెలుగా రూపాంతరం చెంది నిండుగా చెట్లకు విరగకాస్తాయి. వేపచెట్లకు వేపపూత నిండుగా చేరి శోభాయమానంగా కనిపిస్తాయి. ఎటు చూసినా పచ్చదనమే. సుమ సౌరభమే. అదే వసంత రుతువు ప్రత్యేకత. అప్పటివరకు మొగ్గవేయని చెట్లు కూడా మొగ్గతొడిగి, గుబురుగా పూలతో విరబూస్తాయి. అందుకే వసంత రుతువును రుతురాజుగా అభివర్ణించారు కవులు. ఒక మాటలో చెప్పాలంటే ప్రకృతి శోభ మన మనసుల్ని గిలిగింతలు పెట్టి ఆహ్లాదాన్ని అందిస్తుంది.

ఈ పండగలు స్తబ్దుగా, ఒకే మూసలో పోసినట్టు రొటీన్‌గా సాగే జీవితంలో పునరుత్తేజానికి, జీవితంలో కొత్త ఆశలు చిగురించేందుకు, మానసిక ఆనందాభివృద్ధికి, సృజనాత్మ కతకు దోహదం చేస్తాయి. పరస్పరం పండుగల సందర్భంగా ఇరుగు పొరుగువారితో, బంధువులతో, స్నేహితులతో కలిసిమెలిసి గడపటం వలన స్నేహబాంధవ్యాలు బలపడతాయి. మనిషి సంఘజీవి. మనం ఒకరికి సహాయంచేస్తే మనకూ ఎవరైనా సహకరిస్తారు. హద్దుదాటని వైఖరితో స్నేహసంబంధాల వలన మన జీవితాల్లో సహాయ సహకారాలకు కొదవ ఉండదు. ఈ పండుగల వలన మన పరిచయాలు, స్నేహాలు మరింత పటిష్టపడి మనలో ఆత్మస్థయిర్యం పెరుగుతుంది. ఉగాదిపండగ చాంద్రమాన, సౌరమాన, బార్హ స్పత్యమానముల ప్రకారం నిర్ణయించబడుతుంది. అందుకే అందరికీ ఒకేసారి ఉగాదిరాదు.

ఏ ప్రాంతంలో ఏనాడు జరుపుకున్నా ఉగాది వసంతాగమన సూచిక. మానవ జీవనగమనంలో నూతన శుభారంభానికి జీవనోల్లాసానికి సంకేతం. అందుకే ఈ ఉగాదిని మనందరం దిగ్విజయంగా జరుపుకుని ఆనందోత్సాహాలతో జీవన గమ్యాన్ని సుగమం చేసుకుందాం.

CLICK FOR UGADI DETAILS PDF COPY

Previous
Next Post »
0 Komentar

Google Tags