Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Red Cross


Red Cross
రెడ్‌క్రాస్
అంతర్జాతీయ రెడ్‌క్రాస్ మరియు రెడ్‌క్రెసెంట్ ఉద్యమం (The International Red Cross and Red Crescent Movement) ఒక అంతర్జాతీయ మానవతావాద ఉద్యమం. ఈ సంస్థలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 9.7 కోట్ల మంది సభ్యులు (కార్యకర్తలు) ఉన్నారు. వీరు మానవతావాదాన్ని, మానవుల జీవితాలను, ఆరోగ్యాన్ని కాపాడడానికి అనునిత్యం శ్రమిస్తూ వుంటారు. జాతి, మత, కుల, వర్గ, వర్ణ మరియు వయో భేదాలు లేకుండా సత్సంకల్పంతో పనిచేస్తూ వుంటారు.
తొలి రోజుల్లో యుద్ధాల్లో గాయపడిన సైనికులకు సేవ చేయడానికి మాత్రమే ఇది పరిమితమై ఉండేది. ఇంచుమించు ప్రపంచంలోని అన్ని దేశాలలోను రెడ్ క్రాస్ శాఖలు, యుద్ధ సమయాలలోను, శాంతి కాలంలోను నిర్విరామంగా పనిచేస్తునే ఉంటాయి. జాతి, కుల, మత విచక్షణా భేదం లేకుండా నిస్సహాయులకు ఇది సేవ చేస్తుంది. శాంతికాలంలో దీని కార్యకలాపాలేవంటే - ప్రథమ చికిత్స, ప్రమాదాలు జరగకుండా చూడడం, త్రాగే నీటిని పరిశుభ్రంగా ఉంచటం, నర్సులకు శిక్షణ నివ్వడం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నడపటానికి మంత్రసానులకు శిక్షణ, వైద్య శాలలను స్థాపించడం, రక్త నిధులు (Blood Banks) సేకరించడం, మొదలైన పనులు చేస్తుంటుంది.
రెడ్ క్రాస్ ను స్థాపించినది జీన్ హెన్రీ డ్యూనంట్ (Jean Henry Dunant). ఆయన జూన్ 24, 1859న వ్యాపారం నిమిత్తమై లావర్డి (Lavardi) నగరానికి వెళ్ళాడు. ఆ సమయంలో ఫ్రాన్స్ ఆస్ట్రియాల మధ్యన జరుగుతున్న యుద్ధం వల్ల గాయపడిన వేలాది స్త్రీ పురుషులు ప్రథమ చికిత్స లేక మరణించడం అతను చూశాడు. హృదయ విదారకమైన ఈ దృశ్యం అతని మనస్సులో చెరగని ముద్ర వేసింది. తన స్వంత పని మరచిపోయి ఆపదలోనున్న వారందరికీ సహాయం చేశాడు.
యుద్ధం ముగిసాక అతను ప్రజలందరికీ ఇలా విజ్ఞప్తి చేశాడు. "యుద్ధాలలో గాయపడిన వారందరికి, తక్కిన వారందరూ సహాయం చేయాలి. ఇది మానవ ధర్మం." ఈ విజ్ఞప్తి ప్రజలందరినీ ఆకట్టుకుంది. 1864లో జెనీవాలో అంతర్జాతీయ సమావేశం జరిగింది. రెడ్ క్రాస్ సంస్థాపనకు 14 దేశాలు తమ అంగీకారాన్ని తెలిపాయి.
ఇదో ప్రైవేటు సంస్థ. దీనిలో ముఖ్యంగా క్రింది అనుబంధ సంస్థలు పనిచేస్తున్నాయి:
1. అంతర్జాతీయ రెడ్‌క్రాస్ కమిటీ (ICRC), దీనిని 1863 లో స్థాపించారు. ప్రధాన కేంద్రం స్విట్జర్లాండ్ లోని జెనీవా నగరంలో ఉంది.
2. అంతర్జాతీయ రెడ్‌క్రాస్ మరియు రెడ్‌క్రెసెంట్ సంఘాల సమాఖ్య (IFRC), ఇది 1919 లో స్థాపింపబడినది, దీని ప్రధాన కేంద్రమూ జెనీవాలోనే ఉంది.
కార్యకలాపాలు
ఈ అంతర్జాతీయ సమాఖ్య మరియు జాతీయ సంఘాలలో దాదాపు 9.7 కోట్ల వాలంటీర్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. మరియు 3 లక్షల మంది పూర్తికాలపు ఉద్యోగస్తులు గల సంస్థ.
1965 వియన్నాలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో, ఏడు ప్రాథమిక సూత్రాలు ఆమోదింపబడినవి, ఈ సూత్రాలను ఉద్యమం మొత్తంలో అమలుపరచాలని తీర్మానించడమైనది, మరియు 1986 లో జరిగిన సదస్సులోనూ మార్పులు చేర్పులు జరిగాయి.
ఏడు సూత్రాలు
1. మానవత
2. నిష్పాక్షికత
3. సమతౌల్యత
4. స్వతంత్రం
5. వాలంటరీ సేవ
6. ఐక్యత
7. విశ్వజనీయత
ఉద్యమాలు - చిహ్నాలు
రెడ్ క్రాస్
రెడ్ క్రాస్ చిహ్నం
రెడ్ క్రాస్ చిహ్నం 1864 జెనీవా సదస్సు నుండి ఉపయోగించసాగారు. ఇది స్విట్జర్లాండ్ దేశపు జెండాను పోలివుంటుంది, కాని వ్యతిరేక వర్ణంలో వుంటుంది. ఈ సంస్థ స్థాపకుడైన హెన్రీ డ్యురాంట్ గౌరవార్థం, అతడు స్విస్ దేశానికి చెందినవాడు గావడం మూలంగా రెడ్‌క్రాస్ చిహ్నం స్విస్ దేశపు జెండాను నమూనాగా తీసుకున్నారు. స్విట్జర్లాండ్ లో అధికారిక మతము క్రైస్తవం కావున, ఆదేశపు జెండాలో మతపరమైన గుర్తు "క్రాస్" వుంటుంది.
రెడ్ క్రెసెంట్
రెడ్ క్రెసెంట్ చిహ్నం
1876 నుండి 1878 వరకూ జరిగిన రష్యా-టర్కీ యుద్ధం లో ఉస్మానియా సామ్రాజ్యం రెడ్‌క్రాస్ కు బదులుగా రెడ్‌క్రెసెంట్ ఉపయోగించింది, క్రాస్ గుర్తు క్రైస్తవమతానికి చెందినదని, దీని ఉపయోగం వలన, తమ సైనికుల నైతికబలం దెబ్బతింటుందని టర్కీ ప్రతిపాదించింది. రష్యా ఈ విషయాన్ని సంపూర్ణ గౌరవాన్ని ప్రకటిస్తూ తన అంగీకారాన్ని ప్రకటించింది. రెడ్‌క్రాస్ ఈ డీ-ఫాక్టో ఆమోదంతో 1929 జెనీవాలో జరిగిన సదస్సులో 19వ అధికరణ ప్రకారం రెడ్‌క్రెసెంట్ ను అధికారికంగా ప్రకటించింది. ప్రాథమికంగా రెడ్‌క్రెసెంట్ ను టర్కీ మరియు ఈజిప్టులు ఉపయోగించేవి. కాని ముస్లింలు గల అనేక దేశాలలో రానురాను దీని ఉపయోగం సాధారణమయినది. మరియు అధికారికంగా ఈ రెడ్‌క్రాస్ స్థానంలో రెడ్‌క్రెసెంట్ వాడుక వాడుకలోకి వచ్చింది.

Previous
Next Post »
0 Komentar

Google Tags