Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Bhogi Festival

Bhogi Festival



భోగి పండుగ
ఆంధ్రులు పెద్ద పండుగగా జరుపుకునే మూడు రోజుల సంక్రాంతి పండుగలో మొదటిరోజును భోగి అంటారు. భోగి పండుగ సాధారణంగా జనవరి 13 లేదా జనవరి 14 తేదిలలో వస్తుంది. దక్షిణాయనంలో సూర్యుడు రోజు రోజుకి భూమికి దక్షిణం వైపుగా కొద్ది కొద్దిగా దూరమవుతూ దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరం అవుట వలన భూమిపై బాగా చలి పెరుగుతుంది. ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం భగ భగ మండే చలి మంటలు వేసుకునేవారు, ఉత్తరాయణం ముందురోజుకి చలి విపరీతంగా పెరగడం ఈ చలిని తట్టుకునేందుకు భగ భగ మండే మంటలు అందరు వేయటం వలన ఈ రోజుకు భోగి అనే పేరు వచ్చింది.
విశేషాలు
సంక్రమణ మహాపర్వానికి ముందు రోజుకి ఒక ప్రాధాన్యం ఉంది. దీనికి భోగిపర్వం అని పేరు. అయితే భోగము అనే మాటకు అర్థం ఏమిటంటే అనుభవము అని. ఆనందంగా దేనిని అనుభవిస్తామో లేదా దేనిని అనుభవించడం వల్ల ఆనందం పొండుతామో దానిని భోగము అనాలి. అలాంటి భోగములు అనుభవించవలసిన రోజుని భోగి అంటారు. నిజమైన ఆనందాన్ని అనుభవించడమే నిజమైన భోగం. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఆనందం. సామాన్యుల ఆనందాలు వేరు. వాళ్ళకి లౌకిక విషయాలు దొరికితే అది భోగం. ఆ విషయంతో విసుగు కలిగితే మరో విషయం లభించాలని. కానీ ఏది లభిస్తే మరి ఇంకేదీ కావాలని అనిపించదో, ఏది పరిపూర్ణమైన ఆనందమో అదే నిజమైన భోగం. అలాంటి భోగం యోగం వల్లనే లభ్యం అవుతుంది. అందుకే యోగులే భోగులు కాగలరు. అలాంటి దివ్య భోగం ఈరోజున అమ్మ గోదాదేవి ఆండాళ్ళమ్మ పొందినది. అదేమిటంటే పరమాత్మ ప్రాప్తి. రంగనాథుని చేపట్టినది. రంగనాథుని అనుగ్రహాన్ని పొందినది. రంగనాథుని సాంగత్యం అనబడేటటువంటి ఆ కైవల్యానందం అనే భోగాన్ని అమ్మ పొందినది కనుక ఈరోజు భోగి అనే పేరు భక్తి సాంప్రదాయం పరంగా నిర్వచించేవారు చెబుతారు. సరిగ్గా ఈ రోజుతో ధనుర్మాసం పూర్తి అవుతున్నది. తర్వాతు రీహ్య్ నుంచి మకర మాసం వస్తున్నది సౌరమానం ప్రకారంగా. ఈ ధనుర్మాస వ్రతమంతా ఈరోజు పూర్తీ జరిగి దాని ఫలితంగా అమ్మవారు స్వామియొక్క అనుగ్రహాన్ని పొందినది.
భోగి మంటలు
చలికాలంలో అత్యంత చలిగా ఉండే రోజు భోగి. ఈ రోజున ఆంధ్రులు మంటలు వేసి చలికాచుకుంటారు, ఈ మంటలనే భోగి మంటలు అంటారు. ఆవు పేడతో తయారైన పిడకలు, మామిడి, రావి, మేడి చెట్ల అవశేషాలు, తాటాకులు లాంటివి భోగి మంటల్లో వేస్తారు. అంతేకాదు ఇంట్లోని పాత వస్తువులను కూడా భోగి మంటల్లో వేస్తుంటారు. అంటే పనికిరాని చెత్త ఆలోచనలకు స్వస్తి పలికి.. కొత్తమార్గంలోకి పయనించాలని దీని అర్థం. దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం ప్రారంభం కానుండటంతో.. కాలంతో వచ్చే మార్పులను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండాలని బోధించేదే భోగి పండుగ.
కొత్త బట్టలు
ఈ పండుగనాడు ఆంధ్రులు కొత్తబట్టలు ధరించడం ఒక సంప్రదాయంగా ఉంది. తెల్లవారుజామున భోగిమంటల వద్ద చలికాచుకున్న చిన్నా పెద్దలు భోగిమంటల సెగతో కాచుకున్న వేడినీటితో లేదా మామూలు నీటితో తలస్నానం చేసి కొత్తబట్టలు ధరిస్తారు.
ముగ్గులు
పండుగ నెలలో ముగ్గులు ప్రతిరోజు వేస్తారు, కాని భోగి రోజు ముగ్గు ఒక ప్రత్యేకత, ముగ్గువేసే వారికి ఇష్టం కూడిన మరింత కష్టం, సాధారణంగా ముగ్గు వేసే చోటనే భోగి మంటలు వేస్తారు, భోగి మంటల వలన చాలా కసువు తయారవుతుంది. ఆ కసువు అంతా పారబోసి కడిగి ముగ్గువేయడం కొంచెం కష్టంతో కూడుకొన్నప్పటికి ఇష్టమైన పనులు కాబట్టి చాలా ఆనందంగా చేస్తారు, రోజు వేసే ముగ్గుల కన్నా ఈ రోజు మరింత అందంగా రంగు రంగుల రంగవల్లికలేస్తారు.
భోగి పళ్ళు
భోగి పండుగ రోజు పిల్లలపై రేగు పండ్లు పోసి ఆశీర్వదిస్తారు, అందుచేత ఈ పళ్ళను భోగి పళ్ళు అంటారు, భోగి పళ్ళ ఆశీర్వాదాన్నీ శ్రీమన్నారాయణుడి ఆశీస్సులుగా భావిస్తారు.
భోగి పులక
కొన్ని ప్రాంతాలలో భోగి రోజున రైతులు తమ సాగుభూమికి ఆనవాయితీగా కొంతమేర సాగునీరు పారించి తడి చేస్తారు, ఒక పంట పూర్తయిన తదుపరి మళ్ళీ పంట కొరకు సాగుభూమిలో నీరు పారించడాన్ని పులకేయడం అంటారు, ఆనవాయితీగా భోగి రోజున పులకేయడాన్ని భోగి పులక అంటారు.
కోడి పందాలు
గోదావరి జిల్లాల్లో ప్రాంతాల్లో భోగి రోజున కోడి పందాలు వేయడం ఒక ఆనవాయితీగా వస్తుంది, పౌరుషానికి ప్రతీకగా ఉండే కోళ్లు పోటీలో ప్రాణాలను పణ్ణంగా పెట్టి పోరాడుతాయి, ఈ పోటీలను చూసేందుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తారు. పోటీలో పాల్గొనే కోళ్లపై పందాలు కాస్తారు. తాహత్తుకు మించి మితిమీరిన పందాలు కాయడం వలన కలిగే అనర్ధాల వలన పందాలు కాయడంపై నిషేధాంక్షలు ఉన్నాయి.
గాలిపటాలు
భోగి రోజున పిల్లలు చాలా ఆనందంగా గాలిపటాలు ఎగురవేస్తారు, వివిధ రకాల గాలిపటాలు తయారు చేసి లేదా కొనుక్కొని ఎగరవేయడంలో పోటీపడతారు.
Previous
Next Post »
0 Komentar

Google Tags