Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Buddha - A Great Teacher



The Best Teacher
ఉత్తమ బోధకుడు
 వ్యక్తి వికాసానికీ, సమాజ వికాసానికే కాదు... ప్రతి దేశ ప్రగతికీ, మొత్తం ప్రపంచ పురోగతికీ యువత అవసరం. యువత అంటేనే భవిష్యత్తు. ‘నేటి బాలలే రేపటి పౌరులు’ అనేది అందుకే! మానవ జీవితంలో బాల్య, కౌమార దశలు (1-24 సంవత్సరాలు) భవిష్యత్తుకూ, యౌవనం నుంచి వార్థక్యం వరకూ (24-60 సంవత్సరాలు) వర్తమానానికీ, వార్ధక్య దశ (60 సంవత్సరాల తరువాత) గతానికీ ప్రతీకలు. సామాజిక ప్రగతి భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుంది. అందుకే సమాజం బాల్య, కౌమార దశల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఇవి విద్యను అభ్యసించే దశలు. కాబట్టే ‘దేశ భవిష్యత్తు నిర్మాణం తరగతి గదుల్లో జరుగుతుంది’ అంటారు.
ఒక్క మాటలో చెప్పాలంటే తరగతి గదులను తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే. కనుక దేశ భవిష్యత్తు గురువుల చేతుల్లో ఉంటుంది. అందుకే వారిది గురుతర బాధ్యత. ప్రతి పిల్లవాణ్ణీ తీర్చిదిద్దాల్సిన కర్తవ్యం గురువులది. తల్లితండ్రుల తరువాత ప్రతి వ్యక్తీ గౌరవంగా వ్యవహరించేదీ, వినమ్రంగా ప్రవర్తించేదీ గురువుల దగ్గరే. అలాంటి గౌరవం పొందలేని గురువు మంచి గురువు కాదు.
విద్యార్థికి అర్థం అయ్యేలా చెప్పడం ఒక గొప్ప కళ. ఒక విషయం పిల్లాడికి అర్థం కాకపోతే అది ఆ పిల్లవాడి తప్పు అనుకుంటారు బాధ్యతలేని ఉపాధ్యాయులు. ‘కాదు... అర్థం అయ్యేలా చెప్పలేకపోయాను. అది నా తప్పే!’ అనుకుంటాడు ఉత్తమ ఉపాధ్యాయుడు. అటువంటివారు తమ బోధనా పద్ధతులను మార్చుకుంటారు. తమను తాము సంస్కరించుకుంటారు. అర్థం కాలేదంటే చెప్పడంలో తప్పు ఉంది కానీ, వినడంలో కాదు. కాబట్టి అందంగా చెప్పడం, ఆకర్షణీయంగా చెప్పడం, పిల్లల మానసిక, సామాజిక స్థాయిలను బట్టి చెప్పడం ఉత్తమ గురువులు ఆచరించే విధానం.
ఇలా చూస్తే... బుద్ధుడంతటి ఉత్తమ గురువు కనిపించడం చాలా అరుదు. బుద్ధుణ్ణి ‘సత్తా దేవ మనుస్సానం’ అంటారు. ‘సత్తా’ అంటే ‘శాస్త’... గురువు, ప్రబోధకుడు అని అర్థం. ‘దేవ’ అంటే దివ్యులైనవారు.. అంటే జ్ఞానవంతులు, పండితులు. ‘మనుస్సా’ అంటే సాధారణమైన మానవులు. బుద్ధుడు అతి సాధారణమైన వ్యక్తులకూ, అసాధారణమైన ప్రజ్ఞ కలిగినవారికీ... ఎవరికైనా వారి వారి స్థాయిని బట్టి బోధించగల నేర్పరి.
బౌద్ధారామాల్లో కొత్తగా వచ్చిన శ్రమణులకు శాస్త్రాల్ని బోధించే ఉపాధ్యాయులు కొందరు ఉండేవారు. వారిలో సారిపుత్రుడు ఒకరు. ఆయన దగ్గర ఎందరో శిష్యులు ఉండేవారు. వారిలో తీర్థకుడు ఒకడు.
సబ్బే సంఖారా అనిచ్ఛ’ అనే ఒక గాథ (శ్లోకం) ఉంది. అది నాలుగు పంక్తుల గాథ. ‘సర్వ సంస్కారాలూ అనిత్యమే’ అని దాని అర్థం. ఈ ప్రపంచం నిరంతరం మారుతూ ఉంటుంది. ప్రతీదీ, ప్రతి క్షణం మార్పునకు లోనవుతూ ఉంటుంది. మారకుండా ఉండేదీ, శాశ్వతంగా ఉండేదీ ఏదీ ఉండదు. ఏదైనా ఒకటి ఉందంటే అది మార్పు చెందుతూ ఉండాల్సిందే. ‘మార్పు మాత్రమే మారని సత్యం అనేది ఆ గాథ చెప్పే సందేశం. బౌద్ధంలో దీన్ని ‘ప్రతీత్య సముత్పాదం’ అంటారు. బుద్ధుడు జ్ఞానోదయం పొంది  ఆవిష్కరించిన సిద్ధాంతం ఇదే! ఈ గంభీరమైన, జటిలమైన విషయాన్ని సారిపుత్రుడు చెబుతూనే ఉన్నాడు. తీర్థకుడు వింటూనే ఉన్నాడు. బుర్ర ఊపుతూనే ఉన్నాడు. కానీ ఆ గాథను తిరిగి అప్పజెప్పలేడు. అర్థాన్ని విప్పి చెప్పనూ లేడు. చెప్పి, చెప్పి సారిపుత్రుడికి విసుగు వచ్చింది. ఆ మొద్దు శిష్యుణ్ణి తీసుకొని ఒక రోజు బుద్ధుడి దగ్గరకు వచ్చాడు సారిపుత్రుడు. విషయం ఆయనకు వివరించాడు.
‘‘సరే సారిపుత్రా! అతణ్ణి నా దగ్గరే ఉంచి వెళ్ళు’’ అన్నాడు బుద్ధుడు.
ఆ తరువాత బుద్ధుడు ఆ పిల్లవాణ్ణి ఒక సరస్సు ఒడ్డుకు తీసుకువెళ్ళాడు. అక్కడ ఉన్న ఒక చెట్టు కింద కూర్చోబెట్టాడు. ఆ సరస్సులోని ఒక తామర పూవు మొగ్గను చూపించి - ‘‘తీర్థా! నీవు ఆ మొగ్గనే చూస్తూ ఉండు. నేను తర్వాత వస్తాను’’ అని చెప్పి వెళ్ళిపోయాడు.
ఆ పిల్లవాడు దాన్ని అలా చూస్తూనే ఉండిపోయాడు. అది క్రమేపీ విచ్చుకుంది. ఆ రేకులు అందమైన రంగులతో తళతళలాడాయి. పరిమళాలను వెదజల్లాయి. పూవు పూర్తిగా విచ్చుకున్నాక... దాని రేకులు నెమ్మదిగా వాడిపోయాయి. చివరకు ఒక్కొక్కటీ రాలిపోయాయి. మోడువారిన కాడ మాత్రమే మిగిలింది.
అప్పుడు బుద్ధుడు వచ్చి, ‘‘తీర్థా! ఏదీ ఆ మొగ్గ?’’ అని అడిగాడు.
‘‘భగవాన్‌! మొగ్గ విచ్చుకుంది. విరిసింది. రంగులు అద్దుకుంది. పరిమళాలు వెదజల్లింది. వాడింది. రాలింది. మోడై మిగిలింది’’ అని ఒక్కో దశ మార్పునూ పూసగుచ్చినట్టు చెప్పాడు తీర్థకుడు.
‘‘మొగ్గ పువ్వులా ఎప్పుడు మారింది? పువ్వు ఎప్పుడు పరిమళించింది? ఎప్పుడు వాడింది? ఎప్పుడు మోడయింది?’’ అని అడిగాడు బుద్ధుడు.
‘‘భగవాన్‌! అదెలా చెప్పగలం? ఆ మార్పు ఆగి ఆగి జరగలేదు. ఎప్పుడూ జరుగుతూనే ఉంది. నిరంతరం జరిగే మార్పును ఎలా గుర్తించగలం? ఎలా చెప్పగలం’’  అన్నాడు తీర్థకుడు.
‘‘అంటే... ఇందులో ఏది సత్యం?’’ అని ప్రశ్నించాడు బుద్ధుడు.
‘‘భగవాన్‌! మార్పు మాత్రమే సత్యం. మిగిలిన దశలు ఏవీ ఇప్పుడు లేవు. ఈ కాడ కూడా ఉండదు. అంటే... సర్వ సంస్కారాలూ అనిత్యమే భగవాన్‌!’’ అన్నాడు తీర్థకుడు చిరునవ్వుతో.
ఎంతో జటిలమైన విషయాన్ని ఒక ప్రత్యక్ష ప్రమాణాన్ని చూపించి తేలికగా అర్థమయ్యేలా చేశాడు బుద్ధుడు.
ఏ విషయాన్ని ఎలా చెప్పాలో ఉపాధ్యాయులు అర్థం చేసుకోవాలి. చెప్పే రీతిలో చెబితే అర్థం కాని విషయం ఏదీ ఉండదని ఈ ఉదంతం ద్వారా ప్రపంచానికి చాటాడు బుద్ధుడు. అందుకే బుద్ధుడు అత్యుత్తమ బోధకుడు! మహా గురువు!
బుద్ధుణ్ణి ‘సత్తా దేవ మనుస్సానం’ అంటారు. ‘బుద్ధుడు అతి సాధారణమైన వ్యక్తులకూ, అసాధారణమైన ప్రజ్ఞ కలిగినవారికీ... ఎవరికైనా వారి వారి స్థాయిని బట్టి బోధించగల నేర్పరి.
విద్యార్థికి అర్థం అయ్యేలా చెప్పడం ఒక గొప్ప కళ. ఒక విషయం పిల్లాడికి అర్థం కాకపోతే అది ఆ పిల్లవాడి తప్పు అనుకుంటారు బాధ్యతలేని ఉపాధ్యాయులు. ‘కాదు... అర్థం అయ్యేలా చెప్పలేకపోయాను. అది నా తప్పే!’ అనుకుంటాడు ఉత్తమ ఉపాధ్యాయుడు.

Previous
Next Post »
0 Komentar

Google Tags