Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Coffee Day Owner VG Siddhartha Life Story




Coffee Day Owner VG Siddhartha Life Story
కాఫీ డే యజమాని వి.జి సిద్ధార్థ జీవిత కథ
కొండల్లోని కాఫీ తోటల్ని నగరాల్లో ‘కాఫీ డే’లుగా మార్చిన వ్యాపార మాంత్రికుడు... అదును చూసి అవకాశాలపై గురిపెట్టి గెలిచిన అసాధ్యుడు వీజీ సిద్ధార్థ. అత‌డి జీవిత ప్ర‌స్థానం ప‌రిశీలిస్తే కర్ణాటకలోని చిక్‌మగ్‌ళూర్‌లో మూడొందల ఎకరాల కాఫీ తోటలకు వారసుడు సిద్ధార్థ. కష్టాలనేవి తెలీకుండా పెరిగాడు. అయితే లోకజ్ఞానం తెలుసుకునేందుకు బోర్డింగ్‌ స్కూల్‌లో చేర్పించారు తల్లిదండ్రులు. చ‌దువు అబ్బేది కాదు. చివ‌ర‌కు ఓ టీచ‌ర్ అత‌డి ప్ర‌వ‌ర్త‌నతో విసుగుచెంది "ఒరే, నీకు అర్థమయ్యేలా పాఠాలు చెప్పలేకపోతున్నానన్న సందేహం కలుగుతోంది. చదువుపై కాస్త శ్రద్ధ పెడితే నీ భవిష్యత్తుకే మంచిది". అంటూ కంటతడి పెట్టింది. ఆ టీచర్‌ ఒకవేళ బెత్తంతో కొట్టుంటే మొద్దుబారేవాడేమో? చెడామడా తిట్టుంటే దులిపేసుకుని వెళ్లేవాడేమో? లేదంటే తోటి విద్యార్థులతో పోల్చి అవమానించినట్లయితే మరింత మొండిగా తయారై, అసలు మారేవాడు కాదేమో! టీచర్‌ కన్నీళ్లు చూశాక కళ్లు తెరిచాడు సిద్ధార్థ.

చ‌దువు పూర్త‌య్యాక సైన్యంలోకి వెళ‌దామ‌నుకుని ప‌రీక్ష రాసినా పాస్ కాలేదు. మంగళూరుకు వెళ్లి అర్థశాస్త్రంలో పోస్టు గ్రాడ్యుయేషన్‌ చేశాడు. ఒక రోజు "నేను స్టాక్‌మార్కెట్‌పై శిక్షణ కోసం బొంబాయి వెళ్లాలనుకుంటున్నా" అని చెప్పాడు తల్లిదండ్రులతో... కాఫీ తోటలు చూసుకుంటాడనుకున్న కొడుకు ఇలా మాట్లాడటం ఆశ్చర్యం కలిగించింది. ఎంత చెప్పినా వినలేదు. ఆఖరికి తండ్రి సిద్ధార్థ చేతిలో కొంత డబ్బు పెట్టి సాగనంపాడు. చేతి నిండా కావాల్సినంత డ‌బ్బున్నా చిన్న లాడ్జిలోనే దిగాడు. చివ‌ర‌కు ఎంతో మందికి అపాయింట్‌మెంట్ ఇవ్వ‌ని మ‌హేష్ కంపానీని క‌లిశాడు. సిద్దార్థ సిద్ధార్థ అంకితభావాన్ని చూసి చిరునవ్వుతో ఒకే అన్నాడు మహేష్‌ కంపాని. బొంబాయి స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌కి ప్రెసిడెంట్‌, జేఎం క్యాపిటల్‌ అధినేత అయిన ఆయన దగ్గర ఎంతైనా నేర్చుకోవచ్చన్నది సిద్ధూ ఆలోచన.

మహేష్‌ కంపానీ కార్యాలయంలో సామాన్యుడిలా క‌ష్ట‌ప‌డి స్టాక్ మార్కెట్ కార్య‌క‌లాపాలు ఔపోస‌న ప‌ట్టాడు. సిద్ధార్థ ఉత్సుకతకు, పట్టుదలకు ముగ్ధుడయ్యాడు కంపానీ. అప్పుడు ఆయ‌న షేర్లలో వచ్చిన లాభాల్లో సగం సొమ్మును రియల్‌ఎస్టేట్‌కు మళ్లిస్తుండాలి. అప్పుడే పైకొస్తాం అని చెప్పాడు. బెంగ‌ళూరులో స్టాక్ బ్రోక‌ర్ బిజినెస్ చేద్దామ‌నుకున్నాడు. త‌ల్లిదండ్రుల‌కు ఇష్టంలేదు. ఏడున్నర లక్షలు చేతికిచ్చి "ఒకవేళ వ్యాపారంలో నష్టపోతే, తిరిగొచ్చి కాఫీ తోటలు చూసుకో" అని చెప్పి పంపించారు.

ఐదు లక్షలు పెట్టి బెంగళూరులో స్థలం కొన్నాడు. స్టాక్‌మార్కెట్‌లో న‌ష్ట‌పోయినా స్థ‌లంపై పెట్టిన పెట్టుబ‌డికి న‌ష్టంరాద‌న్న ధీమా. శివన్‌ సెక్యూరిటీస్‌ అనే స్టాక్‌ బ్రోకింగ్‌ కంపెనీని ప్రారంభించాడు. శివన్‌ సెక్యూరిటీస్‌ ‘వే 2 వెల్త్‌’గా మారింది. 1985 నుంచి 1993 వరకు సుమారు మూడువేల ఎకరాల కాఫీ తోటల్ని కొనడం సిద్ధార్థ సాధించిన పెద్ద విజయం. ఆ టైంలో బాబ్రీమసీదు కూల్చివేత, బొంబాయిలో బాంబుపేలుళ్లు... తదితర పరిణామాలతో స్టాక్‌మార్కెట్‌ కుప్పకూలింది. ఇన్ఫోసిస్‌ పబ్లిక్‌ ఇష్యూకు వచ్చింది. సిద్ధార్థ్ ముందు చూపుతో అరవై వేల షేర్లను కొన్నాడు. ఆ తరువాత ఐదింతల లాభానికి అమ్మేశాడు. అప్పుడు అమ్మకుండా, ఇప్పుడు విక్రయించి ఉంటే ₹1500 కోట్ల లాభం వచ్చుండేది. ఆ తప్పు మళ్లీ చేయకుండా మైండ్‌ ట్రీలో ₹435 కోట్లకు మూడున్నర కోట్ల షేర్లను కొని ₹3000 కోట్ల లాభానికి అమ్మేశాడు.

కాఫీ బాధ‌ల‌పై ప్ర‌ధానికే విన్న‌పం:
ఇప్పుడు సిద్ధార్థ చూపు కాఫీ వ్యాపారంపై పడింది. ఆ రంగాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించే నాథుడే లేడు. ఆ సమయంలో పీవీ నరసింహారావు ప్రధాని. పీవీని క‌లిసి "సార్‌, అంతర్జాతీయ మార్కెట్‌లో కాఫీ గింజల ధర కిలో రూ.30 పలికితే... రైతులకు కాఫీ బోర్డు చెల్లించే ధర కేవలం పదిరూపాయలే. రైతులే నేరుగా ఎగుమతులు చేయడానికి ప్రభుత్వ నిబంధనలు ఒప్పుకోవు. దేశంలో కాఫీ రైతులకు మేలు కలిగే చట్టాలు చేయండి" అని విన్నవించాడు. కాఫీ ధరల సమస్యను అప్పటి ఆర్థిక మంత్రి మన్మోహన్‌ సింగ్‌ కూడా ప్రధాని దృష్టికి తీసుకెళ్లడంతో ఫలితం దక్కింది. ఆర్నెల్లలోనే కాఫీ బోర్డు గుత్తాధిపత్యాన్ని తగ్గిస్తూ... రైతులే నేరుగా ఎగుమతి చేసుకునే వెసులుబాటు కల్పించింది కేంద్రం.

యువతరం అడ్డా కెన్ కాఫీ డే:
ఆ త‌ర్వాత సిద్ధార్ధ బ్రెజిల్‌లో క‌రువు వ‌చ్చి కాఫీ పంట దిగుమ‌తి త‌గ్గిపోయింది. సిద్ధూ వెంట‌నే ప్రపంచదేశాలకు నాణ్యమైన కాఫీ గింజల్ని ఎగుమతి చేశాడు. రెండేళ్లు తిరక్కుండానే అతి పెద్ద కాఫీ ఎగుమతి సంస్థగా మార్చాడు. సింగ‌పూర్‌లో బీర్ కేపులు చూసి మ‌న‌దేశంలో కాఫీ కేఫేలు పెట్టాడు. ఈ కాఫీడేలు యువతరానికి అడ్డాలుగా మారాయిప్పుడు. వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ వెన్యూలు, పెళ్లిచూపుల వేదికలు, స్టార్టప్‌ ఐడియాలకు మీటింగ్‌ హాళ్లు, సినిమా చర్చలకు కలిసొచ్చే ప్రదేశాలు... వ్యాపార ఒప్పందాలు జరిగే బోర్డ్‌ రూమ్‌లు... ఒకటేమిటి... ‘ఎలాట్‌ క్యాన్‌ హ్యాపెన్‌ ఓవర్‌ ఎ కాఫీ’ అనిపించుకున్నాయి.

రెండువేల కాఫీడేలు...
ఇంటర్‌నెట్‌ అంటే ఏమిటో తెలియని 1996లో బెంగళూరులోని బ్రిగేడ్‌ రోడ్‌లో తొలి ఇంటర్‌నెట్‌ కేఫ్‌ను ప్రారంభించారు సిద్ధార్థ, భార్య మాళవిక. తమ కేఫ్‌లోకి ఎవరు అడుగుపెడతారాని పడిగాపులుకాచేవారు. పదిహేను అంతర్జాతీయ నగరాల్లో కాఫీడే విస్తరించింది. కర్ణాటకలోనే కాదు, దేశవ్యాప్తంగా అతనో సెలబ్రిటీగా మారాడు. మాజీ సీఎం ఎస్‌ఎం కృష్ణ కూతురితో పెళ్లయింది. ‘‘ప్రతి ఉదయం నా పుస్తకాల అల్మరాను తెరచిచూస్తే కానీ, ఆ రోజు మొదలవ్వదు. బలమే జీవితం... బలహీనతే మరణం అనే వివేకానంద స్వామి సూక్తి నాకెంతో శక్తినిస్తుంది". అంటున్న వీజీ సిద్ధార్థ తాజా కాఫీలాంటి వాడు. అతని ప్రయాణం ఆస్వాదించేకొద్దీ మధురం.

అయితే ఈ ప్రపంచంలో తమకిక ఎవరూ లేరనే భావనతోనేనా? తాను కూర్చున్న శిఖరం మీది నుంచి కిందపడితే అందరూ నవ్వుతారనేనా? ఈ లోకాన్ని మనం ఎలా చూస్తున్నామనేదే కదా ముఖ్యం. ఈలోకం మనల్ని ఎలా చూసినా ఒకటే… ఇప్పుడు ప్రతివాడూ ఇంకొకడి గురించి కామెంట్స్ చేసే కాలమిది. పాపం, ఎవరో ఏదో అనుకుంటారని కేఫ్ కాఫీ డే సిద్ధార్థ ఆత్మహత్య చేసుకున్నారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags