Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Nata Kiriti Rajendra Prasad Biography


గద్దె రాజేంద్ర ప్రసాద్

రాజేంద్రప్రసాద్ తెలుగు సినిమా నటుడు, నిర్మాత, సంగీత దర్శకుడు. తెలుగు సినిమాల్లో హీరోలు వేరు... కమెడియన్లు వేరు! కానీ రాజేంద్ర ప్రసాద్ ఆగమనంతో వీరిద్దరూ ఒక్కరే అయిపోయారు. భారతీయ చిత్ర పరిశ్రమలో హాస్యం గురించి మాట్లాడుకొంటే రాజేంద్రప్రసాద్‌కి ముందు, తర్వాత అని వేరు చేసి చూడాల్సిందే. హీరోనే కామెడీ పండించడం ఓ ఎత్తు అయితే సినిమా అంతా వినోదమే పరుచుకోవడం మరో ఎత్తు అయ్యింది. హాస్యాన్ని హీరోయిజం స్థాయికి తీసుకెళ్లి తెలుగు సినిమాల్లో కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేసాడు నటకిరీటి రాజేంద్ర ప్రసాద్. ఆయన నటన, ఆయన ఎంచుకొన్న కథలు కథానాయకులకు ఓ కొత్త దారిని చూపించాయి. తరాలు మారుతున్నా ఆయన నవ్విస్తూనే ఉన్నారు.
బాల్యం, విద్యాభ్యాసం
రాజేంద్రప్రసాద్ క్రిష్ణా జిల్లాకు చెందిన గుడివాడకు దగ్గర్లోని దొండపాడు గ్రామంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో 1956 జూలై 19 న జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు గద్దె వెంకట నారాయణ, మాణిక్యాంబ. అతను బాల్యం, యవ్వనంలో అప్పుడప్పుడూ ఎన్. టి. ఆర్ స్వస్థలమైన నిమ్మకూరులోని ఇంటికి తరచుగా వెళ్ళి వస్తుండేవాడు. అలా చిన్నప్పటి నుంచే అతనికి ఎన్. టి. ఆర్ ప్రభావం పడింది. సినీ పరిశ్రమలో ప్రవేశించక మునుపు సిరామిక్ ఇంజనీరింగ్ లో డిప్లోమా పూర్తి చేశాడు. తండ్రి గద్దె వెంకట నారాయణగారు ఒక ఉపాధ్యాయుడు.  తొలి సినిమా ఉపాధ్యాయ దినోత్సవం రోజున విడుదలైంది. రాజేంద్రప్రసాద్ గారి పెళ్లి రోజు కూడా సెప్టెంబరు 5.
నటన
ఎన్టీఆర్ తో చిన్నప్పటి నుంచి ఉన్న పరిచయంతో నటనపై రాజేంద్రప్రసాద్ ఆసక్తిని గమనించి ఆయనే చెన్నైలోని ఓ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ లో చేర్పించాడు. ఎన్టీయార్ సలహాతోనే 1977లో సినిమాల్లో ప్రవేశించాడు. నటుడిగా రాజేంద్రప్రసాద్ తొలిచిత్రం బాపు దర్శకత్వంలో స్నేహం అనే సినిమా 1977 సెప్టెంబరు 5 న విడుదలైంది. ఆ తర్వాత 'మంచుపల్లకి, ఈ చరిత్ర ఏ సిరాతో, పెళ్ళి చూపులు, రామరాజ్యంలో భీమరాజు' వంటి సినిమాలలో వైవిధ్యమైన పాత్రలు పోషించి నలుగురితో భేష్ అనిపించుకున్నాడు రాజేంద్ర ప్రసాద్. సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో దర్శకుడు వంశీ ద్వారా 'లేడీస్ టైలర్' రూపంలో అదృష్టం తలుపు తట్టింది. ఆ తర్వాత అదే కాంబినేషన్ లో వచ్చిన 'ప్రేమించి చూడు...', 'ఏప్రిల్ ఒకటి విడుదల' చిత్రాలతో ఇక నవ్వుల తుఫాన్ కు తెరతీసినట్టు అయ్యింది. తెలుగు చిత్రసీమలో ఎనిమిదో దశకం వరకూ హీరోలు నడిచిన తీరు వేరు. కానీ రాజేంద్ర ప్రసాద్ ఆ ట్రాక్ లోకి వచ్చాక, దాని రూట్ ను మార్చాడు. కామెడీ హీరో అనే కొత్త ట్రాక్ లోకి హీరోయిజాన్ని నడిపించాడు. వంశీ, జంధ్యాల, రేలంగి నరసింహరావు, విజయ బాపినీడు, ఇవీవీ, ఎస్వీ కృష్ణారెడ్డి వంటి దర్శకుల సహకారంతో కామెడీ హీరో నుండి స్టార్ కామెడీ హీరో స్థాయికి చేరుకున్నాడు. ఆయన నటించిన సినిమాలలో అహ నా పెళ్లంట, లేడీస్ టైలర్, అప్పుల అప్పారావు, ఏప్రిల్ 1 విడుదల, మాయలోడు మంచిపేరు తెచ్చిపెట్టాయి. 
స్టార్ కమెడియన్ గా రాణిస్తున్న సమయంలోనే 'ఎర్రమందారం' చిత్రంలో అద్భుత నటన ప్రదర్శించి... ఉత్తమ నటుడిగా నంది అవార్డును అందుకున్నారు. అయితే... ఆ తర్వాత తన వయసుకు తగ్గ పాత్రలను పోషించాలనే తలంపుతో కామెడీనే కాకుండా సెంటిమెంట్ నూ పండించే ప్రయత్నం చేశారు. 'ఆ నలుగురు', 'మీ శ్రేయోభిలాషి' వంటి చిత్రాలు చూసినప్పుడు రాజేంద్ర ప్రసాద్ ను తప్పితే మరొకరిని ఈ పాత్రల్లో ఊహించుకోలేం. సోలో ప్రొడ్యూసర్ గా 'రాంబంటు', 'మేడమ్' వంటి చిత్రాలను ప్రొడ్యూస్ చేసిన రాజేంద్ర ప్రసాద్ నిర్మాతగానూ తన అభిరుచిని చాటుకున్నారు.
తెలుగు సినీ పరిశ్రమలోనే కాకుండా క్విక్ గన్ మురుగన్ అనే సినిమాతో హాలీవుడ్లో కూడా నటించాడు. నటుడిగా, నిర్మాతగా, సంగీత దర్శకునిగా సత్తా చాటాడు. మేడమ్ సినిమాలో ప్రయోగాత్మకంగా మహిళ పాత్ర పోషించి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. 

పురస్కారాలు
ఎర్రమందారం సినిమాలో ఉత్తమ నటుడిగా నంది పురస్కారం - 1991
మేడమ్ సినిమాలో నటనకు గాను నంది స్పెషల్ జ్యూరీ అవార్డు - 1994
ఆ నలుగురు సినిమాకు ఉత్తమ నటుడిగా నంది అవార్డు - 2004
Previous
Next Post »
0 Komentar

Google Tags