Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Shravana Masam Highlights


శ్రావణ మాసం విశిష్టతలు -  వ్రతాలు - పండగలు 

సృష్టి , స్థితి లయ కారకులైన త్రిమూర్తులలో స్థితికారుడు , దుష్టశిక్షకుడు , శిష్టరక్షకుడు అయిన శ్రీమహావిష్ణువుకు , ఆయన దేవేరి అయిన శ్రీమహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన , వివిధ వ్రతాలు , పూజలు ఆచరించడం వలన విశేష ఫలితాలు , సకల సౌభాగ్యాలను ప్రసాదించే దివ్యమైన మాసం “శ్రావణ మాసం”.

శ్రావణ మాసం విశిష్టతలు:

చాంద్రమానం ప్రకారం శ్రావణమాసం ఐదవ మాసం. ఈ మాసంలోని పూర్ణిమనాడు చంద్రుడు శ్రవణ నక్షత్రం సమీపంలో ఉంటాడు కనుక ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం “శ్రవణా నక్షత్రం” అటువంటి శ్రవణా నక్షత్రం పేరుతో ఏర్పడిన శ్రావణ మాసం శ్రీమహావిష్ణువు పూజకు ఉత్కృష్టమైన మాసం.

శ్రావణ మాసంలోని మూడువారాలు అత్యంత పుణ్యప్రదమైనవి. మంగళ , శుక్ర , శనివారాలు ఈ మాసంలో అత్యంత ప్రధానమైనవి , మహత్తును కలిగినవి. శ్రావణ మసంలోని మంగళవారాలు శ్రీ గౌరీ పూజకు , శుక్రవారాలు శ్రీలక్ష్మీ పూజకు , శనివారాలు శ్రీమహావిష్ణువు పూజకు ముఖ్యమైన దినాలు. వీటికితోడు శ్రావణమాసంలోని శుక్లపక్షంలోగల పదిహేను రోజులు ఎంతో విశేషమైన రోజులనీ , ఒక్కోరోజు ఒక్కో దేవుని పూజ చేయాలని శాస్త్ర వచనం.

పాడ్యమి – బ్రహ్మదేవుడు, విదియ – శ్రీయఃపతి, తదియ – పార్వతీదేవి, చవితి – వినాయకుడు, పంచమి – శశి, షష్టి – నాగదేవతలు, సప్తమి – సూర్యుడు, అష్టమి – దుర్గాదేవి, నవమి – మాతృదేవతలు, దశమి – ధర్మరాజు, ఏకాదశి – మహర్షులు, ద్వాదశి – శ్రీమహావిష్ణువు, త్రయోదశి – అనంగుడు, చతుర్దశి – పరమశివుడు, పూర్ణిమ – పితృదేవతలు.

మహిళలకు సౌభాగ్యానిచ్చే శ్రావణ మాస వ్రతాలు

శ్రావణమాసం మహిళలకు అత్యంత ముఖ్యమైనది. మహిళలు పాటించే వ్రతాల్లో అధికం ఈ మాసంలోనే ఉండడంవల్ల వ్రతాలమాసమని , సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసమని కూడా పేర్కొనబడింది.

మంగళగౌరీ వ్రతం

శ్రావణమాసంలో ఆచరించే వ్రతాల్లో ముఖ్యమైనది ఈ వ్రతం. ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్ళయిన ముత్తైదువలు చేయాలి. నెలలోని అన్ని మంగళవారాలు దీనిని చేయవలెను.

వరలక్ష్మీ వ్రతం

మహిళలకు అత్యంత ముఖ్యమైన శ్రావణమాసంలో ఆచరించే మరో ప్రధానమైన వ్రతం శ్రీ వరలక్ష్మీ వ్రతం. దీనిని పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం ఆచరింపవలెను.

శ్రావణమాసంలో వచ్చే పండగలు

శుక్ల ఏకాదశి - పుత్రదా ఏకాదశి

ఈ ఏకాదశికే లలితా ఏకాదశి అని కూడా పేరు. పుత్ర సంతానం కావాలనుకునేవారు ఈనాడు ఏకాదశీ వ్రతాన్ని ఆచరించడం మంచిది.

శ్రావణ పూర్ణిమ – రాఖీ పూర్ణిమ

సోదరుడి సుఖసంతోషాలు కోరుతూ అక్కాచెల్లెళ్ళు సోదరుడి చేతికి రాఖీ కడతారు నుదుట బొట్టు పెట్టి  అనంతరం మిఠాయిలను తినిపిస్తారు. సోదరుడు సోదరి ఆశీర్వాదం తీసుకుని కానుకలివ్వడం ఆనవాయితీ. అంతే గాక ఈ దినం పాత యజ్ఞోపవీతాన్ని విసర్జించి కొత్తది ధరించడం ఆచారం.

పూర్ణిమ – హయగ్రీవ జయంతి

వేదాలను రక్షించేందుకు శ్రీమహావిష్ణువు హయగ్రీవ రూపం ధరించినట్లు పురాణ కథనం. హయగ్రీవ జయంతి ఐన ఈ రోజు హయగ్రీవుడిని పూజించి శనగలు , ఉలవలతో గుగ్గిళ్ళు తయారుచేసి నైవేద్యం సమర్పిస్తారు.

కృష్ణ విదియ - శ్రీ రాఘవేంద్రస్వామి ఆరాధన 

క్రీ.శ.1671 వ సంవత్సరంలో విరోధికృత్ నామ సంవత్సరం శ్రావణ బహుళ విదియనాడు శ్రీ రాఘవేంద్రస్వామివారు సజీవంగా సమాధిలో ప్రవేశించారు.

కృష్ణపక్ష అష్టమి – శ్రీకృష్ణాష్టమి

శ్రీమహావిష్ణువు ధరించిన అవతారాల్లో ఎనిమిదో అవతారమైన శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన రోజు.  దీనినే కృష్ణాష్టమి లేదా జన్మాష్టమి అని పేర్లు. ఈ రోజు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం కృష్ణుడిని పూజించి నైవేద్యంగా పాలు , పెరుగు , మీగడ , వెన్నలను సమర్పించడం ఆచారం.

కృష్ణపక్ష ఏకాదశి – కామిక ఏకాదశి

ఈ దినం ఏకాదశీ వ్రతం , ఉపవాసాలను పాటించడంతో పాటు నవనీతమును దానం చేయడం మంచిది.  ఈ ఏకాదశీ వ్రతాన్ని పాటించడం వల్ల మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయని శాస్త్ర వచనం.

కృష్ణపక్ష అమావాస్య – పోలాల అమావాస్య

ఇది వృషభాలను పూజించే పండుగ. కాగా కాలక్రమేములో పోలేరమ్మ అనే గ్రామ దేవతలను ఆరాధించే పర్వదినంగా మార్పు చెందింది. ఇది ఆచరించడం వల్ల పిల్లలకు అకాల మృత్యు భయం తొలగిపోతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి.

Previous
Next Post »
0 Komentar