Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

UGC releases guidelines for phased reopening of higher education institutions

 


UGC releases guidelines for phased reopening of higher education institutions

వర్సిటీల ప్రారంభానికి యూ‌జి‌సి మార్గదర్శకాలు  

దేశవ్యాప్తంగా కళాశాలలు, విశ్వవిద్యాలయాల పునఃప్రారంభానికి సంబంధించి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. కంటైన్మెంట్ జోన్ల వెలుపల ఉన్న కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు మాత్రమే ఈ నిబంధనలు వర్తిస్తాయని.. దశల వారీగా విద్యా కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని యూజీసీ స్పష్టం చేసింది. భౌతిక తరగతుల ప్రారంభానికి సంబంధించి సాధ్యమయ్యే విషయాలను పరిశీలించాలని సూచించింది. పూర్తిగా సిద్ధం అనుకున్న తర్వాతే కార్యకలాపాలను మొదలు పెట్టాలని స్పష్టం చేసింది. కేంద్రం నిధులతో నడిచే ఉన్నత విద్యాసంస్థల్లో తరగతుల పునఃప్రారంభానికి సంబంధించి ఆ విద్యాసంస్థల ప్రధాన అధికారులు సంతృప్తి చెందితేనే కార్యకలపాలు మొదలుపెట్టాలని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో తరగతుల నిర్వహణ పూర్తిగా ఆయా ప్రభుత్వాల నిబంధనల ప్రకారమే ఉంటుందని స్పష్టం చేసింది. విశ్వవిద్యాలయాలు, కళాశాలల క్యాంపస్లను దశలవారీగా తెరవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవచ్చని.. వీటిల్లో సామాజిక దూరం, ఫేస్ మాస్క్ ల వాడకం, ఇతర రక్షణ చర్యలకు కట్టుబడి ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించింది. వర్సిటీలు, కళాశాలల పరిపాలనా కార్యాలయాలు, పరిశోధనా ప్రయోగశాలలు, గ్రంథాలయాలకు కూడా అనుమతి ఇవ్వవచ్చని పేర్కొంది. అన్ని పరిశోధనా కార్యక్రమాల విద్యార్థులు, సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రోగ్రామ్ పీజీ విద్యార్థులు తమ తమ విద్యాలయాల్లో తిరిగి చేరవచ్చని తెలిపింది.

యూజీసీ విడుదల చేసిన మరికొన్ని మార్గదర్శకాలు..

* ఆయా సంస్థల ప్రధాన అధికారుల నిర్ణయం మేరకు చివరి సంవత్సరం విద్యార్థులను విద్యా, నియామక ప్రయోజనాల కోసం చేరేందుకు అనుమతించవచ్చు.

* మొత్తం విద్యార్థులలో 50 శాతం కంటే ఎక్కువ మంది ఏ సమయంలోనైనా హాజరుకాకుండా చూసుకోవాలి.

* కొవిడ్-19 వ్యాప్తిని నివారణకు అవసరమైన మార్గదర్శకాలు, ప్రొటోకాల్స్ తప్పనిసరిగా పాటించేలా చర్యలు చేపట్టాలి.

* ఆన్లైన్ తరగతులు ఇష్టపడే విద్యార్థుల కోసం బోధనా విధానం కొనసాగుతుంది. అందుకోసం సంస్థలు ఆన్లైన్ స్టడీ మెటీరియల్‌ను అందుబాటులోకి తీసుకురావాలి.

* అవసరమైతే తప్ప విద్యార్థులు అధ్యాపకులతో ఎలాంటి సంప్రదింపులు చేయరాదు. ముందస్తు అనుమతి తీసుకున్న తర్వాతే అధ్యాపకులతో సంప్రదింపులు జరపాలి.

* అంతర్జాతీయ ప్రయాణ ఆంక్షలు, వీసా సంబంధిత సమస్యల కారణంగా తిరిగి విద్యాలయాల్లో చేరలేని అంతర్జాతీయ విద్యార్థుల కోసం విద్యాసంస్థలు ప్రణాళిక రూపొందించాలి. వారికి ఆన్ లైన్ ద్వారా బోధన సాగించే విధంగా ఏర్పాట్లు చేయాలి.

* భద్రత, ఆరోగ్య నివారణ చర్యలను కచ్చితంగా పాటిస్తూ అవసరమైన సందర్భాల్లో మాత్రమే హాస్టళ్లు తెరవాలి. కొవిడ్ లక్షణాలు ఉన్న విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ హాస్టళ్లలో ఉండటానికి అనుమతించకూడదు.

* ఏదైనా క్యాంపస్ తిరిగి తెరిచే ముందు విద్యా సంస్థలు ఉన్న ప్రాంతాన్ని ఆయా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సురక్షిత ప్రాంతంగా ప్రకటించాలి.

* కొవిడ్-19 దృష్ట్యా భద్రత, ఆరోగ్యానికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఆదేశాలు, సూచనలు, మార్గదర్శకాలు, ఉత్తర్వులను ఉన్నత విద్యాసంస్థలు తప్పక పాటించాలి.

Previous
Next Post »
0 Komentar

Google Tags