Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ఇంటి నుంచి పనిపై సైబర్‌ నేరగాళ్ల దాడి - వ్యక్తిగత సమాచారాన్నీ తస్కరిస్తున్నారు - సైబర్‌ సెక్యూరిటీ ఉద్యోగుల కొరత

 

ఇంటి నుంచి పనిపై సైబర్‌ నేరగాళ్ల దాడి - వ్యక్తిగత సమాచారాన్నీ తస్కరిస్తున్నారు - సైబర్‌ సెక్యూరిటీ ఉద్యోగుల కొరత 

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఇల్లు కదలకుండా చేస్తోంది. గతేడాది కొవిడ్‌ వ్యాపించిన దగ్గర నుంచి వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ఐటీ కంపెనీలతో పాటు.. అనేక ఇతర సంస్థలూ తమ ఉద్యోగులు కార్యాలయాలకు రావద్దని సూచిస్తూ, ఎక్కడినుంచైనా పని చేసే వెసులుబాటు కల్పించాయి. పరిస్థితులు కాస్త అదుపులోకి వచ్చాయని భావించి.. హైబ్రిడ్‌ పద్ధతిలో పనిచేయాలని నిర్ణయించాయి. అంటే కొంతమంది కార్యాలయాల్లో, మరికొందరు ఇళ్లలో ఉండి పనిచేస్తుంటారు. కానీ.. కొవిడ్‌ వైరస్‌ రెండో దశ మరింతగా తన ప్రభావాన్ని చూపించడం ప్రారంభించింది. దీంతో మళ్లీ ఇంటి నుంచి పని తప్పనిసరి అయ్యింది. ఇదే అదనుగా సైబర్‌ నేరస్థులు కీలక సమాచారాన్ని తస్కరించి, కోట్ల రూపాయలు ఆర్జించేందుకు పన్నాగాలు పన్నుతున్నారు. ఒక నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 2020లోనే లక్ష కోట్ల డాలర్ల సైబర్‌ నేరాలు జరిగాయని అంచనా.

ఈ ఏడాదిలోనూ 5000కు పైగా కేసులు

ఈ ఏడాదీ సైబర్‌ నేరాల సంఖ్య తక్కువేమీ కాదు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా గత నాలుగున్నర నెలల్లో దాదాపు 5,258 సమాచార తస్కరణ కేసులు నమోదయ్యాయి. అమెరికాకు చెందిన వెరిజాన్‌ బిజినెస్‌ విడుదల చేసిన డేటా బ్రీచ్‌ ఇన్వెస్టిగేషన్‌ రిపోర్ట్‌ 2021 ఈ సమాచారాన్ని వెల్లడించింది. 88 దేశాల్లో మొత్తం 29,207 కేసులను పరిశీలించి, ఈ నివేదికను విడుదల చేసింది.

* గత ఏడాదితో పోలిస్తే, ఫిషింగ్‌ కేసులు 11%, రామ్‌సన్‌వేర్‌ కేసులు 6 శాతం పెరిగినట్లు నివేదిక వెల్లడించింది.

* రహస్య సమాచారాన్ని తస్కరించడమూ ఇటీవల ఎక్కువయ్యింది. గతంతో పోలిస్తే ఇది దాదాపు 61శాతం పెరిగింది.

* చాలా సంస్థలు తమ వెబ్‌సైట్లలో తప్పుడు సమాచారంతో చొరబడేందుకు ప్రయత్నిస్తున్న వారి సంఖ్య పెరిగిందని ఫిర్యాదు చేశాయి.

యాప్‌లతో జాగ్రత్త

ఇప్పుడు అంతా డిజిటల్‌గా మారడంతో ప్రజలు ఎన్నో యాప్‌లను యధేచ్ఛగా వాడుతున్నారు. ప్రతి యాప్‌ వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తుంటుంది. ముఖ్యంగా ఫోన్‌ నెంబర్లు, ఇ-మెయిల్‌ ఐడీలు, పుట్టిన తేదీ వివరాల్లాంటివి కచ్చితంగా అడుగుతుంటాయి. వీటి ఆధారంగా మనకు ఫోన్లు రావడం, ఫిషింగ్‌ మెయిల్స్‌ను పంపిస్తూ సైబర్‌ నేరగాళ్లు మాయమాటలతో ప్రజల దగ్గర్నుంచి డబ్బు కొల్లగొడుతున్నారు. ముఖ్యంగా ఎలాంటి గుర్తింపు లేని ఫిన్‌టెక్‌ సంస్థల్లాంటివి ప్రజల బ్యాంకింగ్‌, క్రెడిట్‌ కార్డుల సమాచారాన్ని తెలివిగా తెలుసుకుని, రూ.కోట్లలో కాజేస్తున్నాయి. ఈ విషయంలో ఎవరికి వారు స్వీయ జాగ్రత్తలు పాటించక తప్పదని బ్యాంకింగ్‌ ఐటీ నిపుణులు పేర్కొన్నారు.

సైబర్‌ సెక్యూరిటీ ఉద్యోగుల కొరత

కార్యాలయంలో ఉండి పనిచేస్తున్నప్పుడు, అంతా లోకల్‌ సర్వర్‌ నియంత్రణలో ఉంటుంది. కాబట్టి, పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ, ఉద్యోగులు వేర్వేరు చోట నుంచి పనిచేస్తున్న నేపథ్యంలో ప్రతి సంస్థకూ ఇప్పుడు చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ ఆఫీసర్ల అవసరం పెరిగింది. అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ నిపుణుల కొరత అధికంగా ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. కొన్ని పెద్ద కంపెనీలకు ఈ ఇబ్బంది లేకపోయినా.. మధ్య, చిన్న కంపెనీలు తప్పనిసరిగా ఈ సేవల కోసం థర్డ్‌పార్టీ సేవలను వినియోగించుకోవాల్సి వస్తోంది. సైబర్‌ సెక్యూరిటీకి ఎప్పుడూ గిరాకీ ఉంటుందని, ఈ నేపథ్యంలో ఇప్పుడిప్పుడే చాలామంది ఈ కొత్త నైపుణ్యాలను నేర్చుకునేందుకు మొగ్గు చూపిస్తున్నారని పరిశ్రమ నిపుణులు పేర్కొంటున్నారు.

చాలామంది తాము వాడే ఇంటర్నెట్‌ ఎంత మేరకు సురక్షితం అనేది గమనించరు. దీనివల్లే ఎక్కువశాతం సైబర్‌ అటాక్‌లు జరుగుతున్నాయని సైబర్‌ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు చాలా కంపెనీలు తమ సమాచారాన్ని మొత్తం క్లౌడ్‌లోకి మార్చాయి. సాంకేతికంగా కాస్త ఏమరుపాటు, చిన్న బగ్‌ ఉంటే ఉంటే చాలు.. సైబర్‌ నేరగాళ్లు ఆయా సంస్థల్లోకి చొచ్చుకెళ్తున్నారు. దీన్ని సంస్థలు సమర్థంగా ఎదుర్కొనకపోతే.. ఇబ్బందులు పడాల్సి వస్తోంది. 

Previous
Next Post »
0 Komentar

Google Tags