Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

UP Law Panel Proposes 'Two-Child' Population Policy – Check the Details

 

UP Law Panel Proposes 'Two-Child' Population Policy – Check the Details

యూపీలో త్వరలో ‘ఇద్దరు పిల్లల’ నిబంధన - జనాభా నియంత్రణ బిల్లు రూపొందించిన ఉత్తరాది రాష్ట్రం

జనాభా పరంగా దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌ జనాభాను నియంత్రించేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం ‘ఇద్దరు పిల్లల’ నిబంధనతో కొత్త చట్టం తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఇద్దరు కంటే ఎక్కువ సంతానం ఉన్నవారికి ప్రభుత్వ ఉద్యోగాలు, సంక్షేమ పథకాలు అందకుండా ఆంక్షలు ప్రతిపాదించింది. ఈ మేరకు ‘యూపీ జనాభా నియంత్రణ బిల్లు, 2021’ ముసాయిదాను ఆ రాష్ట్ర లా కమిషన్‌ తాజాగా విడుదల చేసింది. 

ఈ బిల్లు ఆమోదం పొంది చట్టంగా మారితే యూపీలో ఇద్దరు పిల్లల నిబంధన అమల్లోకి రానుంది. దీని ప్రకారం.. ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్నవారు స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలుండదు. ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా వారిని అనర్హులుగా పరిగణిస్తారు. ఒకవేళ ఇప్పటికే వారికి ప్రభుత్వ ఉద్యోగాలుంటే భవిష్యత్తులో ఎలాంటి ప్రమోషన్లు ఇవ్వరట. అంతేగాక, కుటుంబంలో ఎంతమంది ఉన్నా.. రేషన్‌ కార్డులో నలుగురు వ్యక్తులు మాత్రమే ఉండేలా ప్రతిపాదనలు చేశారు. ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలున్నవారికి ఎలాంటి ప్రభుత్వ సబ్సిడీ పథకాలు కూడా అందవని అధికారులు తెలిపారు. 

మరోవైపు ‘ఇద్దరు పిల్లల’ నిబంధన పాటించేవారికి ప్రోత్సహకాలు కూడా అందించనున్నారు. ఇద్దరు సంతానం పాటించే ప్రభుత్వ ఉద్యోగులకు సర్వీసు మొత్తంలో రెండు అదనపు ఇంక్రిమెంట్లు ఇవ్వనున్నారు. ఇల్లు లేదా ప్లాట్ కొనాలనుకుంటే వీరికి సబ్సిడీ అందించనున్నారు. ఇక, ఒక్కరే సంతానం ఉన్నవారికి మరిన్ని సదుపాయాలు లభించనున్నాయి. వీరికి సర్వీసులో నాలుగు అదనపు ఇంక్రిమెంట్లతో పాటు చిన్నారికి 20ఏళ్లు వచ్చేంతవరకు ఆరోగ్య సేవలు, విద్య ఉచితంగా అందించనున్నారు. 

ప్రస్తుతం ఈ ముసాయిదా బిల్లును యూపీ లా కమిషన్‌ అధికారిక వెబ్‌సైట్లో అప్‌లోడ్‌ చేశారు. దీనికి జులై 19 వరకు ప్రజల నుంచి అభిప్రాయాలను స్వీకరించనున్నారు. ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ అధికారికంగా దీన్ని విడుదల చేయనున్నారు. ఆగస్టు రెండో వారంలో ఈ బిల్లును రాష్ట్ర అసెంబ్లీ ముందు ప్రవేశ పెట్టనున్నట్లు తెలుస్తోంది.

Previous
Next Post »
0 Komentar

Google Tags