Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Credit, Debit card Payments: Auto-debit rule from Oct 1 as mandated by RBI

 

Credit, Debit card Payments: Auto-debit rule from Oct 1 as mandated by RBI

ఆటో-డెబిట్ లావాదేవీలపై అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలు

ఆటో డెబిట్‌ ద్వారా బిల్లులు, ఇతర చెల్లింపులు చేస్తున్నారా? అయితే ఇది మీ కోసమే. ఎందుకంటే వచ్చే నెల 1వ తేదీ నుంచి ఇందుకు సంబంధించిన నిబంధనల్లో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మార్పులు చేపట్టనుంది.

 

చాలా మంది క్రెడిట్‌, డెబిట్‌ కార్డు వినియోగదార్లు తమ విద్యుత్‌, గ్యాస్‌, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు (నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌ తదితరాలు), బీమా చెల్లింపులు.. ఇలా పలు సేవలకు ఆటో-పేమెంట్‌ సూచనలను ఏర్పాటు చేసుకుని ఉండొచ్చు. అయితే ఇవన్నీ ఇక జరగబోవు. ఇప్పటికే ఆ మేరకు బ్యాంకులు తమ వినియోగదార్లకు సమాచారాన్ని అందించడం మొదలుపెట్టాయి కూడా. ‘ఆర్‌బీఐ 20.09.21న జారీ చేసిన రికరింగ్‌ పేమెంట్‌ మార్గదర్శకాల ప్రకారం..మీ యాక్సిస్‌ కార్డులపై ప్రామాణిక సూచనల(స్టాండింగ్‌ ఇన్‌స్ట్రక్షన్స్‌) ద్వారా చేస్తున్న లావాదేవీలు ఇక నిర్వహించలేం. మీరు నేరుగా మర్చంట్‌కే మీ కార్డు ద్వారా చెల్లింపులు చేయగలరు’ అని యాక్సిస్‌ బ్యాంక్‌ తన వినియోగదార్లకు సమాచారం అందిస్తోంది.

 

రెండు సార్లు వాయిదా – మరో వాయిదా లేదు

ఆగస్టు 2019లోనే ఆర్‌బీఐ ఈ కొత్త నిబంధనలను ప్రకటించింది. డిసెంబరు 2020లోగా వాటిని అమలు చేయాలని తెలిపింది. అయితే మరింత సమయాన్ని ఇస్తూ మార్చి 31, 2021కి ఆ గడువును పెంచింది. ఆ తర్వాత బ్యాంకుల సంఘం(ఐబీఏ) విజ్ఞప్తి మేరకు ఏప్రిల్‌లో దానిని అక్టోబరు 1, 2021కి పొడిగించింది. ఇకపై ఆలస్యం చేస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని ఆర్‌బీఐ తెలిపింది.

 

ఏం మార్పులు రానున్నాయంటే..

కొత్త నిబంధనల కింద అన్ని రికవరింగ్‌ లావాదేవీలకు అదనపు అనుమతి అవసరం అవుతుంది. రూ.5000కు మించిన చెల్లింపులకు ప్రతి సారీ వన్‌ టైం పాస్‌వర్డ్‌(ఓటీపీ)తో వినియోగదారు దానిని ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఇది అన్ని క్రెడిట్‌ కార్డులు, డెబిట్‌ కార్డుల (దేశీయ, అంతర్జాతీయ)పై వర్తిస్తుంది.

 

వినియోగదార్లు ఏం చేయాలి?

ఒక వేళ వినియోగదారుకు చెందిన బ్యాంకు ఖాతాలో ఏవైనా బిల్లు చెల్లింపులకు స్టాండింగ్‌ ఇన్‌స్ట్రక్షన్స్‌ (ఎస్‌ఐ) నమోదై ఉంటే వాటిపై ఎటువంటి ప్రభావం ఉండదు. అంటే బ్యాంకు ఖాతా ద్వారా చేసే మ్యూచువల్‌ ఫండ్‌ సిప్‌లు, నెలవారీ వాయిదాలు (ఈఎమ్‌ఐ)లకు ఎటువంటి ఇబ్బందీ ఉండదు. 


* ఈ కొత్త నిబంధనలు కేవలం డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారా చేసిన ఎస్‌ఐలపైనే వర్తిస్తాయి. వీటిపై ఉండే ఎస్‌ఐలను ప్రాసెస్‌ చేయబోరు. అందువల్ల తప్పనిసరిగా అదనపు ధ్రువీకరణ అవసరం అవుతుంది.

* తప్పనిసరి నమోదు, సవరణ, తొలగింపులకు అదనపు ధ్రువీకరణ (ఏఎఫ్‌ఏ) అవసరం.

* డెబిట్‌ కావడానికి 24 గంటల ముందే వినియోగదారుకు ప్రీ-డెబిట్‌ నోటిఫికేషన్‌ (ఎస్‌ఎమ్‌ఎస్‌/ఇ మెయిల్‌) వస్తుంది. ఇందులో ఉండే లింక్‌ ద్వారా లావాదేవీని చేయొచ్చు.

* వినియోగదారు తమ కార్డుపై ఉన్న స్టాండింగ్‌ ఇన్‌స్ట్రక్షన్‌ (ఎస్‌ఐ)ను వీక్షించడం/మార్చడం/రద్దు చేయడం చేయొచ్చు. ప్రతీ ఎస్‌ఐకి గరిష్ఠ మొత్తాన్ని నిర్ణయించుకోవచ్చు. ఒక వేళ లావాదేవీ మొత్తం దీని కంటే ఎక్కువగా ఉంటే ప్రీ-డెబిట్‌ నోటిఫికేషన్‌ వస్తుంది. మీ అనుమతి లేకుండా ఆ లావాదేవీ జరగదు. 

Previous
Next Post »
0 Komentar

Google Tags