Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ITR: Know the Changes to ITR Rules 2021-22 Before Deadline

 

ITR: Know the Changes to ITR Rules 2021-22 Before Deadline

ఐటీ రిటర్న్స్‌ దాఖలు గడువు లోపు మీరు తప్పక తెలుసుకోవలసిన ITR నియమాలలో మార్పులు ఇవే

ఆదాయపు పన్ను రిటర్నులు(ఐటీఆర్‌) 2021-22 సమీక్షా సంవత్సరానికిగానూ దాఖలు చేయడానికి మరికొన్ని రోజులే గడువు మిగిలి ఉంది. ఇప్పటికే పలు దఫాలు వాయిదా వేసిన ప్రభుత్వం తాజాగా డిసెంబరు 31కి గడువు పొడిగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది వచ్చిన పలు మార్పులను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అవేంటో చూద్దాం.. 

కొత్త లేదా పాత పన్ను శ్లాబులు..

ఈ ఏడాది పన్ను చెల్లింపుదారులకు రెండు ఐచ్ఛికాలు ఉన్నాయి. పాత పన్ను శ్లాబులు లేదా కొత్త వాటి కింద ఐటీఆర్‌ దాఖలు చేయొచ్చు. పాత దాంట్లోనైతే రాయితీలు, మినహాయింపులు పొందవచ్చు. అదే కొత్త దాంట్లో పన్నురేటు తక్కువగా ఉంటుంది. కానీ, ఎలాంటి మినహాయింపులు ఉండవు. హెచ్‌ఆర్‌ఏ, ఎల్‌టీసీ, 80సీ, 80సీసీడీ, 80డీ, 80జీ.. వంటి వాటి కింద మినహాయింపులు పొందాలనుకునేవారు పాత పద్ధతిని ఎంచుకుంటే ఉత్తమమని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. అయితే, కొత్త పద్ధతికి వెళ్లేవారు ముందే ఫారం 10-ఐఈని సమర్పించాలి. దాని అక్నాలెడ్జ్‌మెంట్‌ సంఖ్యను ఐటీఆర్‌లో పొందుపరచాలి. 

డివిడెంట్లపై పన్ను..

గతంలో కంపెనీలు తాము ఇచ్చే డివిడెండ్లపై 15 శాతం పన్ను చెల్లించేవి. దీనికి సర్‌ఛార్జీ, సెస్సు అదనం. ఇలా  మొత్తంగా కలిపితే.. డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ట్యాక్స్‌ (డీడీటీ) సుమారుగా 20.56శాతం అయ్యేది. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్‌ 115 బీబీడీఏ ప్రకారం వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాల చేతికి వచ్చే డివిడెండ్‌ మొత్తం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10లక్షల వరకూ ఎలాంటి పన్ను ఉండదు. దీనికి మించి డివిడెండ్‌ను పొందినప్పుడు ఆ అధిక మొత్తంపై 10శాతం పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ఇక మ్యూచువల్‌ ఫండ్లు అందించే డివిడెండ్‌ మొత్తంపై ఎలాంటి పన్నూ లేదు. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్‌ 10(35) ప్రకారం దీనికి పూర్తిగా మినహాయింపు వర్తిస్తుంది. కానీ, కొత్త నిబంధనల ప్రకారం చూస్తే.. మదుపరులకు వచ్చిన డివిడెండ్‌ ప్రతి రూపాయీ.. వారి ఆదాయంలో కలిపి చూపించాలి. దాని ప్రకారం ఆదాయాన్ని గణించి, వర్తించే శ్లాబుల ప్రకారం పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఇదే కాకుండా కంపెనీలు చెల్లించే డివిడెండ్‌ మొత్తం రూ.5,000 దాటితే 10శాతం మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్‌) విధిస్తారు. 

సమాచారం ఏఐఎస్‌తో సరిపోలాలి..

ప‌న్ను ప‌రిధిలోకి వ‌చ్చే ఆదాయం, మూలం వ‌ద్ద ప‌న్ను (టీడీఎస్‌) సంబంధిత స‌మాచారాన్ని అందించేందుకు ఆదాయ‌పు ప‌న్ను శాఖ ఇప్పటి వరకు ఫారం-26 ఏఎస్‌ను జారీ చేస్తోంది. అయితే దీని స్థానంలో వార్షిక స‌మాచార నివేదిక‌ (యాన్యువ‌ల్ ఇన్ఫర్మేషన్‌ స్టేట్‌మెంట్‌- ఏఐఎస్‌)ను తీసుకొచ్చింది. ఫారం 26 ఏఎస్‌తో పోలిస్తే ఇందులో మ‌రింత స‌మాచారం అందుబాటులో ఉంటుంది. ఒక ఆర్థిక సంవ‌త్సరంలో పొదుపు ఖాతాకు జ‌మైన వ‌డ్డీ, అమ్మిన, కొనుగోలు చేసిన షేర్ల విలువ‌తో స‌హా మ్యూచువ‌ల్ ఫండ్ల లావాదేవీలు, స్టాక్స్‌, బీమా, క్రెడిట్ కార్డులు, ఆస్తుల కొనుగోలు, జీతం లేదా వ్యాపారం నుంచి వ‌చ్చే ఆదాయం, డివిడెండ్లు, బ్యాంకు పొదుపు ఖాతా డిపాజిట్లపై వ‌డ్డీ ఇలా ఈ కొత్త వార్షిక స‌మాచార‌ స్టేట్‌మెంట్‌లో ప‌న్ను చెల్లింపుదారుల‌కు స‌ంబంధించి స‌మ‌గ్ర స‌మాచారం అందుబాటులో ఉంటుంది. స్థిరాస్తుల అమ్మకం, కొనుగోలు, విదేశీ చెల్లింపులు వాటికి సంబంధించిన అదనపు సమాచారం కూడా ఉంటుంది. నివేదించిన‌ సమాచారం నుంచి నకిలీ సమాచారాన్ని తొల‌గించిన తర్వాత సమాచారం ఏఐఎస్‌లో పొందుప‌రుస్తారు. ప‌న్ను చెల్లింపుదారులు ఈ సమాచారాన్ని డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. ఒకేచోట పూర్తి స‌మాచారాన్ని అందించ‌డం వ‌ల్ల ఏఐఎస్‌తో ప‌న్ను రిట‌ర్నులు దాఖ‌లు చేయ‌డం సుల‌భమవుతుంది. 

ఐటీఆర్‌-1 దాఖలులో మార్పులు..

ప‌న్నులు చెల్లించ‌డంలో వ‌చ్చిన మార్పుల‌కు అనుగుణంగా ప్రతి సంవ‌త్సరం కొత్త ఐటీ ఫారాలను రూపొందిస్తుంది ఆదాయ‌పు ప‌న్ను శాఖ‌. స‌రైన ఫారాన్ని ఎంచుకునేందుకు ఈ మార్పుల‌ను తెలుసుకోవ‌డం అవ‌స‌రం. ఈ సంవ‌త్సరం కూడా ఐటీఆర్‌-1 అర్హత ప్రమాణాల‌లో కొన్ని మార్పులు చేశారు. దీనిని సాధార‌ణంగా జీతం ద్వారా ఆదాయం పొందుతున్న ప‌న్ను చెల్లింపుదారులు ఉప‌యోగిస్తారు. సెక్షన్ 194ఎన్ కింద న‌గ‌దు విత్‌డ్రా కోసం టీడీఎస్ డిడ‌క్ట్ చేసిన వ్యక్తులు లేదా య‌జ‌మాని నుంచి ఎంప్లాయిస్ స్టాక్ ఆప్షన్‌(ఈఎస్ఓపీ)పై డిఫర్డ్ ట్యాక్స్ పొందిన వారు ఇకపై ఐటీఆర్-1 ను దాఖ‌లు చేయొద్దు. అలాగే డిడక్ట్‌ అయిన సంవత్సరంలో మాత్రమే టీడీఎస్‌ను క్లెయిం చేసుకోవాలి. దీన్ని తర్వాత ఏడాదికి క్యారీఫార్వర్డ్‌ చేసుకునే వెసులుబాటు ఇకపై ఉండదు. ఈ మార్పుల‌ను దృష్టిలో ఉంచుకుని ఫారాలను ఎంచుకోవాలి. 

నిపుణుల సాయం లేకుండానే..

ఐటీఆర్‌ దాఖలును మరింత సరళీకృతం చేయడమే లక్ష్యంగా కేంద్రం పలు చర్యలు చేపట్టింది. మీరు తగ్గింపులు, మినహాయింపుల గ‌ణాంకాలు చేయాల్సిన అవ‌స‌రం లేదు. కొత్త ఆదాయపు పన్ను శ్లాబురేట్లను ఎంచుకునే వారికి ముందుగా నింపిన ఐటీఆర్ ఫారం ఐటీ పోర్టల్‌లోనే లభిస్తుంది. అవసరమైతే దీంట్లో మార్పులు కూడా చేసుకోవచ్చు. అందువల్ల పన్నును లెక్కించడం, ఐటీఆర్ ఫారాన్ని నింపాల్సిన అవసరం లేదు. నిపుణుల సహాయం లేకుండానే రిటర్నులు దాఖలు చేయవచ్చు.

NEW ITR WEBSITE

ఎస్‌బీఐ యోనో యాప్ ద్వారా ఉచితంగా ఐటీఆర్ దాఖ‌లుకి అవకాశం

Previous
Next Post »
0 Komentar

Google Tags