Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Govt Approves ‘New India Literacy Programme’ - Adult Education Renamed 'Education for All'

 

Govt Approves ‘New India Literacy Programme’ - Adult Education Renamed 'Education for All'

వయోజన విద్య కాదు.. సార్వత్రిక విద్య - నవభారత సాక్షరత కార్యక్రమంగా పేరు

 

ఐదేళ్లలో 5 కోట్ల మందికి అక్షరాస్యత

వయోజన విద్య పేరుతో ఇప్పటివరకూ అమలుచేసిన సాక్షరత కార్యక్రమాన్ని ఇక నుంచి సార్వత్రిక విద్య పేరుతో కొత్త రూపంలో అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. నవ భారత్‌ సాక్షరత కార్యక్రమం పేరుతో దీన్ని 2022-27 మధ్య అమలు చేయడానికి ఆమోదముద్ర వేసింది. ఈ కార్యక్రమం ద్వారా వయోజనులకు అక్షరాలు, అంకెలను నేర్పడమే కాకుండా 21వ శతాబ్దంలో అవసరమైన జీవన నైపుణ్యాలను నేర్పిస్తారు. ఆర్థిక, డిజిటల్‌ అక్షరాస్యత, వ్యాపార నైపుణ్యాలు, ఆరోగ్య అవగాహన, పిల్లల సంరక్షణ, చదువులు, కుటుంబ సంక్షేమం గురించి చెబుతారు. స్థానికంగానే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందేలా వృత్తివిద్య శిక్షణ ఇస్తారు.

ప్రాథమిక, మాధ్యమిక, మాధ్యమికోన్నత చదువులకు సమానమైన విద్య చెబుతారు. పథకాన్ని స్వచ్ఛంద సేవకుల ద్వారా ఆన్‌లైన్‌ విధానంలో అమలు చేస్తారు. అన్ని రకాల పరికరాలు, వనరులను డిజిటల్‌ రూపంలో సమకూరుస్తారు. 15 ఏళ్లు పైబడిన నిరక్షరాస్యులకు ఈ పథకాన్ని వర్తింపజేస్తారు. ఐదేళ్లలో 5 కోట్ల మందిని అక్షరాస్యులను చేయాలన్నది లక్ష్యం. ఏటా కోటిమందికి ఆన్‌లైన్‌లో చదువు చెప్పి, వారి అభ్యాస సామర్థ్యాన్ని అంచనా వేస్తారు. పేరు, పుట్టిన తేదీ, లింగం, ఆధార్‌ సంఖ్య, మొబైల్‌ నంబర్లతో అభ్యాసకులు పేర్లు నమోదు చేసుకోవచ్చు. పథకానికి కేంద్రం వాటా రూ.700 కోట్లు కాగా, రాష్ట్రాలు రూ.337.90 కోట్లు సమకూర్చాల్సి ఉంటుంది.

పాఠశాల ఒక యూనిట్‌

పథకం అమలుకు పాఠశాలను ఒక యూనిట్‌గా తీసుకుంటారు. లబ్ధిదారులు, స్వచ్ఛంద ఉపాధ్యాయుల ఎంపిక కోసం పాఠశాలలను ఉపయోగించుకుంటారు. స్థానిక అవసరాలకు తగ్గట్టు వినూత్న కార్యక్రమాలు చేపట్టే స్వేచ్ఛను రాష్ట్రాలకు ఇస్తారు.

* ఈ పథకం అమలు తీరును అంచనా వేయడానికి రాష్ట్రాలు, జిల్లాలకు ర్యాంకులు కేటాయిస్తారు.

* కార్యక్రమం అమలుకు విరాళాలు, కార్పొరేట్‌ సామాజిక బాధ్యత నిధులు ఉపయోగించుకోవచ్చు. ఈ నిధులతో ఆర్థికంగా వెనుకబడిన వారికి సెల్‌ఫోన్లు అందించవచ్చు.

* తొలుత 15-35 ఏళ్ల వయసు వారికి ప్రాధాన్యం ఇస్తారు. ఆ తర్వాత 35 ఏళ్ల పైబడిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఇందులోనూ బాలికలు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీలు, దివ్యాంగులు, అట్టడుగు వర్గాలు, సంచార జాతులు, నిర్మాణరంగ కార్మికులకు ప్రాధాన్యం ఇస్తారు. 

ఆకాంక్షిత జిల్లాలకు ప్రాధాన్యం

నీతి ఆయోగ్‌ ఎంపిక చేసిన ఆకాంక్షిత జిల్లాలపై తొలుత ప్రత్యేక దృష్టి సారిస్తారు. జాతీయ, రాష్ట్ర సగటు కంటే తక్కువ అక్షరాస్యత ఉన్న జిల్లాలు; మహిళల అక్షరాస్యత 60% కంటే తక్కువ ఉన్న జిల్లాలు; ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ జనాభా అధికంగా ఉన్న జిల్లాలు, బ్లాకులు; విద్యాపరంగా వెనుకబడిన ప్రాంతాలు; వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాలకూ ప్రాధాన్యం ఇస్తారు.

* 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 15 ఏళ్లు పైబడిన వారిలో నిరక్షరాస్యులు 25.76 కోట్లమంది. అందులో మహిళలు 16.68 కోట్లు. 2009-10 నుంచి 2017-18 మధ్య సాక్షర భారత్‌ ద్వారా 7.64 కోట్లమంది అక్షరాస్యులుగా మారారన్నది అంచనా. ఇప్పటికీ దేశంలో 18.12 కోట్ల మంది నిరక్షరాస్యులున్నట్లు లెక్క.

OFFICIAL PRESS NOTE

Previous
Next Post »
0 Komentar

Google Tags