Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Russia-Ukraine Crisis: రష్యా- ఉక్రెయిన్‌ల మధ్య వార్‌ - యుద్ధం చేసేంత అవసరం ఏమిటి? అసలు ఈ యుద్ధం ఎందుకు?

 

Russia-Ukraine Crisis: రష్యా- ఉక్రెయిన్‌ల మధ్య వార్‌ - యుద్ధం చేసేంత అవసరం ఏమిటి? అసలు ఈ యుద్ధం ఎందుకు?

ఉక్రెయిన్‌ (Ukraine) పై పొరుగు దేశం రష్యా (Russia) అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) మిలిటరీ ఆపరేషన్ (Military Operations) ప్రారంభించినట్టు ప్రకటించారు. అనంతరం ఉక్రెయిన్‌కు చెందిన ఆర్మీ, వైమానిక, సైనిక స్థావరాలను ధ్వంసం చేసినట్టు రష్యా రక్షణ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ చర్య మొత్తం ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. రష్యా కచ్చితంగా ఉక్రెయిన్‌పై దాడి చేస్తుందని అమెరికా సహా పశ్చిమ దేశాలు కొన్ని రోజులుగా చెబుతూ వస్తున్నాయి. కానీ, వాటిని రష్యా కొట్టివేస్తూ వచ్చింది. అగ్రరాజ్యం అమెరికా, అభివృద్ధిలో ఆమడం దూరం ముందే ఉండే ఐరోపా దేశాలూ సైనిక చర్యలకు పాల్పడవద్దని రష్యాను పలుమార్లు హెచ్చరించాయి. లేదంటే కఠిన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చాయి. అయితే, ఇన్ని హెచ్చరికలు, ఆర్థిక ఆంక్షలనూ లక్ష్య పెట్టకుండా రష్యా.. ఉక్రెయిన్‌పై ఎందుకు దాడి చేయడానికి పూనుకున్నది.

రష్యా ఉక్రెయిన్‌ల మధ్య పరిస్థితులు తీవ్ర రూపం దాల్చినప్పటికీ యుద్ధం వరకు అడుగులు పడవని అందరూ అనుకున్నారు. అయితే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఉక్రెయిన్‌ విషయంలో తాము వెనకడుగు వేసేది లేదంటూ ఏకంగా ఆ దేశంపై మిలిటరీ ఆపరేషన్‌ చేస్తున్నట్లు ప్రకటించడంతో పాటు ప్రపంచ దేశాలు ఇందులో జోక్యం అనవసరమంటూ గట్టి సంకేతాలే పంపారు. మొన్నటి వరకు చర్చలకు సిద్ధమన్న రష్యా అకస్మాత్తుగా మిలిటరీ ఆపరేషన్‌కి చేపట్టింది. అసలు ఈ పరిణామాలకు కారణాలేమంటే!

యుద్ధం ఎందుకు?

ఉక్రెయిన్‌ను, మాజీ సోవియట్‌ దేశాలను నాటోలో చేర్చుకోవద్దని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ ప్రధాన డిమాండ్‌. అయితే ఈ డిమాండ్‌ని అగ్రరాజ్యం అమెరికా, నాటో మాత్రం అంగీకరించలేదు. గతంలో ఉక్రెయిన్‌ రష్యా నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉక్రెయిన్‌ నాటోలో చేర్చుకుని పశ్చిమ దేశాలు రష్యాను చుట్టుముట్టేందుకు ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయని రష్యా వాదిస్తోంది. ఉక్రెయిన్‌ని నాటోలో చేర్చడం వల్ల రష్యా భద్రతకు పెద్ద ముప్పు వాటిల్లే ప్రమాదముందని పుతిన్‌ వాదన.

ఉక్రెయి‌న్‌కు రష్యా ఇచ్చే ప్రాధాన్యత లేదా.. ఉక్రెయిన్‌ను రష్యా ఎలా చూస్తున్నదని తెలుసుకోవాలంటే జులై 2021లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రాసిన ఓ వ్యాసాన్ని పరికిస్తే అర్థం అవుతుంది. రష్యన్లు, ఉక్రెనియన్లది ఒకే దేశం అని పుతిన్ పేర్కొన్నారు. 1991 డిసెంబర్‌లో సోవియట్ యూనియన్(యూఎస్ఎస్ఆర్) కూలిపోవడాన్ని చారిత్రక రష్యా ముక్కలవ్వడంగా అభిప్రాయపడ్డారు. అంతేకాదు, ప్రస్తుత ఉక్రెయిన్ పాలకులు రష్యా వ్యతిరేక ప్రాజెక్ట్ నడుపుతున్నారని ఆరోపించారు. ఉక్రెయిన్‌ను రష్యా తలకు మకుటంగా పేర్కొన్నారు. 


రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచం రెండు శిబిరాలుగా చీలిపోయింది. అమెరికా, సోవియట్ యూనియన్ రెండు సూపర్ పవర్లుగా వాటికి నేతృత్వ స్థానంలో ఉన్నాయి. కానీ, 1991 డిసెంబర్ 25న సోవియట్ యూనియన్ కుప్పకూలింది. దీంతో ఆ యూనియన్ 15 దేశాలుగా అర్మేనియా, అజర్‌బైజన్, బెలారస్, ఎస్టోనియా, జార్జియా, కజఖ్‌స్తాన్, కిర్గిజిస్తాన్, లాట్వియా, లిథువేనియా, మోల్డోవా, రష్యా, తజకిస్తాన్, తుర్క్‌మెనిస్తాన్, ఉక్రెయిన్, ఉజ్బెకిస్తాన్‌లుగా విడిపోయాయి. సోవియట్ యూనియన్ కుప్పకూలిన తర్వాత అమెరికా మాత్రమే ప్రపంచంలో సూపర్ పవర్‌గా మిగిలింది. అమెరికా సారథ్యంలో నాటో వేగంగా విస్తరించింది. సోవియట్ యూనియన్ శిబిరంలో గతంలో ఉన్న దేశాలు కూడా మెల్లగా నాటోలో చేరడం మొదలయ్యాయి. ఎస్టోనియా, లాట్వియా, లిథువేనియాలూ 2004లో నాటో కూటమిలో చేరాయి. జార్జియా, ఉక్రెయిన్‌లకూ నాటో సభ్యత్వ ఆఫర్ 2008లో వచ్చింది. కానీ, అవి ఇంకా చేరలేదు. 

నాటో విస్తరణను పుతిన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అమెరికా ఇప్పుడు మా ఇంటి ముందు క్షిపణులతో నిలబడి ఉన్నదని ఆయన 2021 డిసెంబర్‌లో పేర్కొన్నారు. ఒక వేళ కెనడా, మెక్సికో సరిహద్దుల్లో తాము క్షిపణులతో మోహరించి ఉంటే అమెరికాకు ఎలా అనిపిస్తుంది? అంటూ సూటి ప్రశ్న వేశారు. ఒక వేళ ఉక్రెయిన్ కూడా నాటో కూటమిలో చేరితే.. రష్యా దేశాన్ని నాటో కూటమి చుట్టేసినట్టుగానే ఉంటుంది. ముఖ్యంగా పశ్చిమ యూరప్‌తో అనుసంధానంలో ఉన్న కీలక దేశాలు ఇవి. అందుకే ఉక్రెయిన్‌ నాటో కూటమిలో చేరడాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 

రష్యన్ సామ్రాజాన్ని నిర్మించాలని పుతిన్ అనుకుంటున్నారని పశ్చిమ దేశాలకు చెందిన నిపుణులు చెప్పారు. అందులో ఉక్రెయిన్ మాత్రం రష్యా నుంచి దూరంగా పశ్చిమ దేశాల వైపు వెళ్తున్నది. ఇది పుతిన్‌కు మింగుడు పడటం లేదు. ఉక్రెయిన్‌ రష్యాకు అనుబంధంగా.. లేదా మిత్రపక్షంగా ఉండాలని పుతిన్ బలంగా కోరుకుంటున్నారు.

రష్యా ప్రభుత్వ అధినేతగా వ్లాదిమిర్ పుతిన్ కొనసాగుతున్నంత కాలం నాటో విస్తరణను వ్యతిరేకిస్తూ వచ్చారు. ముఖ్యంగా అమెరికా ప్రభావం అధికంగా గల నాటో కూటమి వైపు, ఐరోపా దేశాల సమాఖ్య(యూరోపియన్ యూనియన్)వైపు ఉక్రెయిన్ అడుగులను ఆయన సహించలేదు. పుతిన్ ప్రధాన ఆరోపణ ఏమంటే.. నాటో కూటమి ఉక్రెయిన్ దేశాన్ని దాని గుప్పిట్లోకి తెచ్చుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నదని అభిప్రాయపడుతున్నారు. అందుకే.. ఆయన పశ్చిమ దేశాల నుంచి ఉక్రెయిన్.. నాటో కూటమిలో చేరబోదనే స్పష్టమైన హామీని డిమాండ్ చేశారు. కానీ, పశ్చిమ దేశాలు ఈ డిమాండ్‌ను తోసిపుచ్చినట్టు అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, 1997 మిలిటరీ స్టేటస్‌ను మాత్రమే నాటో గుర్తించుకోవాలని పుతిన్ కోరారు. అంటే.. ఆ తర్వాత నాటో నిర్మించుకున్న మిలిటరీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను రద్దు చేసుకోవాలని. కానీ, ఈ డిమాండ్‌ను సహజంగానే ఆ దేశాలు తిరస్కరిస్తాయి. ఈ నేపథ్యంలోనే రష్యా ఎలాగైనా తన పొరుగు దేశం.. సోవియట్ యూనియన్‌లో సభ్య దేశంగా ఉన్న ఉక్రెయిన్‌ను తన నుంచి దూరం కావాలని కోరుకోలేదు. అందులోనూ తన వైరి వర్గంలో కలవడం తమ దేశానికే ముప్పు అని భావించారు. అందుకే ఈ దాడులు మొదలైనట్టుగా చర్చలు జరుగుతున్నాయి. 

రెండో ప్రపంచ యుద్ధ అనంతరం సుమారు 45 సంవత్సరాలు ఈ నాటోకు రష్యాకు మధ్య జరిగిన కోల్డ్ వార్ జరిగింది. అయితే.. ఆ తర్వాత ఈ ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిపోయిందనే అందరూ భావిస్తాు. కానీ, తాజాగా ఉక్రెయిన్‌పై రష్యా దాడులు ఆ కోల్డ్ వార్ ఇంకా ముగియలేదనే వెల్లడిస్తున్నాయి.

Previous
Next Post »
0 Komentar

Google Tags