Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Tennis: World No.1 Ashleigh Barty Announces Retirement

 

Tennis: World No.1 Ashleigh Barty Announces Retirement

25 ఏళ్ల వయస్సులోనే రిటైర్‌మెంట్ ప్రకటించిన నెం.1 టెన్నిస్‌ ప్లేయర్‌ యాష్లే బార్టీ - గతంలో బిగ్ బాష్ క్రికెట్ లీగ్ ఆడిన ఆష్లే

నెంబర్‌ వన్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ యాష్లే బార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రొఫెషనల్‌ టెన్నిస్‌ నుంచి రిటైర్‌ అవుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా బుధవారం తన నిర్ణయాన్ని వెల్లడించింది. ఇందుకు సంబంధించి ఓ వీడియోను షేర్‌ చేసింది.

‘‘ఈ రోజు నేను తీసుకున్న కఠిన నిర్ణయం వల్ల నా మనసు భావోద్వేగాలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. టెన్నిస్‌కు వీడ్కోలు పలుకుతున్నా. నిజానికి ఈ విషయం మీతో ఎలా పంచుకోవాలో నాకు అర్థంకాలేదు. అందుకే నా ఫ్రెండ్‌ సాయం తీసుకున్నాను. నాకు అన్ని రకాల సంతోషాలు అందించిన ఆటకు సదా రుణపడి ఉంటా. అదే విధంగా నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెబుతున్నా. 

ఈ ప్రయాణంలో మీరు నాకు అందించిన మధుర జ్ఞాపకాలు జీవితాంతం గుర్తుపెట్టుకుంటా. ఓ వ్యక్తిగా నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. ఇక ఆటకు గుడ్‌ బై చెప్పడానికి ఇదే సరైన సమయం. నాకున్న మిగతా కలల్ని కూడా నెరవేర్చుకోవాలి’’ అని బార్టీ ఉద్వేగపూరితంగా మాట్లాడింది. కాగా 25 ఏళ్ల వయస్సులోనే, కెరీర్‌లో అత్యుత్తమ స్థితిలో ఉన్న సమయంలో బార్టీ రిటైర్‌మెంట్‌ ప్రకటన అభిమానులను షాక్‌కు గురి చేసింది. 

ఇక యాష్లే బార్టీ కెరీర్‌ విషయానికొస్తే.. 2019లో ఫ్రెంచ్‌ ఓపెన్‌, 2021లో వింబుల్డన్‌ విజేతగా నిలిచింది.ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ను గెలిచిన బార్టీ తద్వారా కెరీర్‌లో మూడో గ్రాండ్‌స్లామ్‌  సాధించింది. అంతేగాక.. ఈ విజయంతో 44 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ సాధించిన రెండో మహిళా ప్లేయర్‌(ఆస్ట్రేలియన్‌)గా బార్టీ రికార్డు సృష్టించింది. యాష్లే బార్టీకి క్రికెట్‌పై మక్కువ. ఈ క్రమంలో 2015లో కొన్ని రోజులు ఆమె బిగ్‌బాష్‌ లీగ్‌లో క్రికెట్‌ ఆడింది.

ప్రపంచ టెన్నిస్‌ సంఘం స్పందిస్తూ.. ‘ప్రతి యువ టెన్నిస్‌ క్రీడాకారిణికి స్ఫూర్తిగా నిలుస్తావు. ఆట పట్ల నీకున్న ప్రేమ అమోఘం. ఆన్‌-కోర్టు, ఆఫ్‌-కోర్టులో నీదైన మార్క్‌ను ప్రదర్శించావు’’ అని పోస్టు చేసింది.

మహిళల విభాగంలో నంబర్‌ వన్‌గా అత్యధిక ఎక్కువ రోజులు ఉన్న నాలుగో ప్లేయర్‌గా బార్టీ రికార్డు అందుకుంది. ప్రస్తుతం 121 వారాల నుంచి ఆమె టాప్‌ ర్యాంక్‌లో కొనసాగుతోంది. స్టెఫీ గ్రాఫ్ (186 వారాలు), సెరెనా విలియమ్స్ (186 వారాలు), మార్టినా నవత్రిలోవా (156 వారాలు) ముందు వరుసలో ఉన్నారు. బార్టీ రిటైర్‌మెంట్ ప్రకటించడంపై క్రీడా ప్రపంచం స్పందించింది. తమతో ఆడిన సందర్భాలను మహిళా ప్లేయర్లు గుర్తుకు తెచ్చుకున్నారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. భవిష్యత్తులో అన్నీ శుభాలే జరగాలని ఆకాంక్షించారు.

CRICKET PROFILE

TENNIS PROFILE

Previous
Next Post »
0 Komentar

Google Tags