Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Guru Purnima: History and Significance of Guru Purnima

 

Guru Purnima: History and Significance of Guru Purnima

గురుపూర్ణిమ: ఆదిగురువు ఆవిర్భవించిన తొలి రోజు – తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే

=========================

జ్ఞానానికి పుట్టుక ఉంది. జ్ఞానం పుట్టినరోజే గురువు పుట్టినరోజు. గురువంటే వెలుగు. వెలుగు జ్ఞానానికి ప్రతీక. ఆ జ్ఞానం జన్మదినోత్సవం జరుపుకొనే రోజే గురుపూర్ణిమ. శిష్యులు ఆనందోత్సాహాల్లో ఓలలాడే రోజు. గురుచంద్రుడు ఆధ్యాత్మిక ఆకాశంలో హాయిగా విహరిస్తూ జ్ఞానమనే వెలుగును వెదజల్లుతుంటాడు... ఈ దృశ్యం శాశ్వత ఆధ్యాత్మిక వారసత్వ సంపదగా వస్తోంది. దీన్ని అనాదిగా అందిస్తున్నవాడు వ్యాసభగవానుడు. ఆయనే గురుపరంపరకు ఆద్యుడు. ఆయన పుట్టినరోజే ఆషాఢపూర్ణిమ. అదే వ్యాసపూర్ణిమ లేదా గురుపూర్ణిమ. 

గురువులని పూజించడం కోసం నిర్ణయించిన తిథి గురు పౌర్ణిమ‌. 'గు' అంటే అంధ‌కారం లేదా అజ్ఞానం, 'రువు' అంటే నిరోధించుట లేక నశింప చేయుట లేదా పారద్రోలుట అని అర్థం. అంటే గురువు అనే ప‌దానికి అజ్ఞానాన్నినశింప చేయువారు అని అర్థం స్ఫురిస్తుంది. అజ్ఞానం అనే చీకట్లు తొలగించి మనలో జ్ఞానం జ్యోతిని వెలిగించే మహోన్నత వ్యక్తి. 'గురు బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః, గురుర్ సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవేనమః'అంటూ భారతీయ సంస్కృతి గురువును త్రిమూర్తులతో పోల్చింది. 

గురువూ, భగవంతుడూ ఒకేసారి దర్శనమిస్తే ముందు ఎవరికి నమస్కరించాలి? అనే ప్రశ్న ఉత్పన్నమైతే భగవంతుణ్ణి చూపించినవాడు గురువు, అందుకే ఆయన పాదాలకే ముందు ప్రణమిళ్లాలని చెబుతోంది. మన సంస్కృతిలో గురువుకి చాలా ఉన్నత స్ధానం ఇచ్చింది. కేవలం తమ గురువునే కాదు, గురు పరంపరని అంటే తన గురువుని (స్వ గురువు), గురువుగారి గురువుని (పరమ గురువు), వారి గురువును (పరమేష్ఠి గురువు) కూడా ఆరాధిస్తారు. సాధారణంగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవారిని గురువు అంటారు. ఆ జ్ఞానాన్ని ఆకాంక్షించేవారు తమ గురువులతో జీవితాంతం అనుబంధం కొనసాగిస్తారు. కొన్ని చోట్ల ఈ బంధం తరతరాల వరకూ కొనసాగుతుంది. 

వేదవ్యాసుడిని భారతీయులు తమ ఆది గురువుగా కొలుస్తారు. దీనికి ఆయన మనకు అందించిన ఆధ్యాత్మిక వారసత్వమే కారణం. సత్యవతి, పరాశుర మహర్షి కుమారుడైన వ్యాసుడు అసలు పేరు వైశంపాయనుడు. వేదాలను నాలుగు భాగాలుగా విభజించాడు గనుక వేద వ్యాసుడయ్యాడు. పంచమ వేదంగా పేర్కొనబడే మహా భారతాన్ని రచించాడు. నాలుగు వేదాలను నలుగురు శిష్యుల ద్వారా ప్రచారం చేశాడు. భగవద్గీతను బోధించిన శ్రీ కృష్ణుడు ప్రపంచానికి గురువైతే, శక్తివంతమైన సంస్కృతి, దానికి అవసరమైన వాజ్ఞ్మయాన్నీ ప్రపంచానికి అందజేసిన వ్యాసుడూ గురువే. వేదవ్యాసుడిని శ్రీమహా విష్ణువు అవతారంగా పరిగణిస్తారు. అందుకే వ్యాసుని గురువులందరికీ గురువుగా, ఆది గురువుగా భావించి, ఆయన పుట్టిన రోజైన ఆషాఢ పౌర్ణమిని గురు పౌర్ణమిగా, వ్యాస పౌర్ణమిగా గుర్తించి, ఆయననీ, తమ గురువులను పూజించి, వారి ఆశీస్సులు తీసుకుంటారు. 

ఆషాఢ మాసం నుంచి వర్ష ఋతువు ప్రారంభమవుతుంది. సన్యాసాశ్రమం స్వీకరించినవారు ఆశ్రమ ధర్మంగా ఎక్కడా ఒక చోట ఎక్కువ కాలం గడపరు. కానీ వర్షాకాలంలో వానల వల్ల ఇబ్బందులు, ఆ సమయంలో అనేక రకాల వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ. అందుకే సాధారణంగా వీరు ఆషాఢ పౌర్ణమి నుంచి నాలుగు నెలల చాతుర్మాసం పాటిస్తారు. అంటే తాత్కాలికంగా ఎక్కడో ఒక చోటే ఉంటారు. ఆ సమయంలో శిష్యులు వీరి దగ్గర జ్ఞాన సముపార్జన చేయడానికి వచ్చేవారు. ఆ సందర్భంగా మొదటి రోజైన ఆషాఢ పౌర్ణమినాడు గురు పూజ చేసేవారు. ఆ ఆచారం ప్రకారం ఈ పౌర్ణమిని గురు పౌర్ణమి అంటారు అని కొందరి అభిప్రాయం..

=========================

🙏గురు పూర్ణిమ శుభాకాంక్షలు🙏

=========================

Previous
Next Post »
0 Komentar

Google Tags