Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited.

Sri Kalahasti temple

                                              శ్రీకాళహస్తి

          శ్రీకాళహస్తి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాలో స్వర్ణముఖి నదికి తూర్పు ఒడ్డున ఉంది. ఇది దక్షిణ భారతదేశంలోనే ప్రాచీనమైన మరియు పంచభూత లింగములలో నాల్గవ దైన వాయు లింగము గల గొప్ప శైవ పుణ్యక్షేత్రము. ఇక్కడ ఉండే కళ్ళు చెదిరే మూడు గోపురాలు ప్రాచీన భారతీయ వాస్తు కళకు నిదర్శనాలుగా, విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యుల యొక్క పనితనానికి కాణాచిగా నిలుస్తాయి. వీటిలో ఎత్తైన గాలి గోపురం శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించబడింది. బాగా పెద్దదిగా కనిపించే వెయ్యి కాళ్ళ మంటపం కూడా ప్రధాన ఆకర్షణే. కళంకారీ కళకు కాళహస్తి పుట్టినిల్లు. శ్రీకాళహస్తిని 'దక్షిణ కాశీ ' అని అంటారు.
            సువర్ణముఖీ నదీ తీరమున వెలసిన ఈ స్వామి శ్రీకాళహస్తీశ్వరుడు. స్వయంభువు లింగము, లింగమునకెదురుగా వున్న దీపము లింగము నుండి వచ్చు గాలికి రెపరెపలాడును. ఇక్కడి అమ్మవారు జ్ఞానప్రసూనాంబ, అంబాత్రయములలో ఒకరు. శివలింగము ఇక్కడ వర్తులాకారము వలె గాక చతురస్రముగ వుంటుంది. స్థల పురాణాల ప్రకారం ఇది బ్రహ్మకు జ్ఞానమును ప్రసాదించిన ప్రదేశం. వశిష్ఠుడు, సాలెపురుగు, పాము, ఏనుగు, బోయడు అయిన తిన్నడు (కన్నప్ప), వేశ్య కన్యలు, యాదవ రాజు, శ్రీ కాళహస్తీశ్వర మాహాత్మం వ్రాసిన దూర్జటి) వంటి వారి కథలు ఈ క్షేత్ర మహాత్మ్యంతో పెనవేసుకొని ఉన్నాయి.
క్షేత్ర పురాణము
కన్నప్ప అనే వేటగాడు నిత్యం స్వామిని కొలుస్తుండేవాడు. అతని భక్తిని పరీక్షించడానికి స్వామి ఒకరోజు తన కంటినుండి నెత్తురు కార్చేడట. వెంటనే కన్నప్ప తన కన్ను పీకి స్వామి కంటికి అమర్చాడట. అప్పుడు స్వామి రెండవకంటి నుండి కూడా నెత్తురు కారటం మొదలయింది. భక్తుడైన కన్నప్ప సందేహించకుండా తన రెండవకన్ను కూడా పీకి స్వామికి అమర్చాడు. స్వామి ప్రత్యక్షమై భక్తుడైన కన్నప్పని కరుణించి ముక్తి ప్రసాదించాడు.
ఆలయ విశేషాలు
ఈ దేవాలయము చాలా పెద్దది, పై కప్పుపై రంగులతో చిత్రించిన అనేకములయిన చిత్రములు ఉన్నాయి. "మణికుండేశ్వరాఖ్య" అనే మందిరమువున్నది. కాశీ క్షేత్రములో వలె ఇక్కడ చనిపొయే వారికి పరమశివుడు ఓంకార మంత్రమును, తారకమంత్రమును ఉపదేశించి మోక్షము ఇచ్చునని భక్తుల నమ్మకము. దేవాలయ ప్రాంతములోనే పాతాళ విఘ్నేశ్వరాలయము ఉంది. దేవాలయమునకు సమీపములోగల కొండపై భక్త కన్నప్పకి చిన్న ఆలయము నిర్మించారు. శ్రీకాళహస్తీశ్వరాలయము రాజగోపురము యొక్క సింహద్వారము దక్షిణాభిముఖము. స్వామి వారు ఉత్తరాభిముఖులై వుంటారు. ఆదిశంకరులు ఇక్కడ శ్రీ చక్రము స్థాపించారు. ఈ క్షేత్రమునకు గల ఇతర నామములు దక్షిణకైలాసమనియు, సత్య మహా భాస్కరక్షేత్రమనియు, సద్యోముక్తిక్షేత్రమనియు, శివానందైక నిలయమనియు పేర్కొనటం జరిగింది. మహా శివరాత్రినాడు ఇక్కడ బ్రహ్మాండమైన ఉత్సవం జరుగుతుంది.
ఈ దేవాలయం దేశంలోని అతి పెద్ద దేవాలయాలలో ఒకటి. ఆలయం లోపల అమ్మవారి సన్నిధికి సమీపంలో ఒక ప్రదేశం నుంచి భక్తులు కొన్ని ప్రధాన గోపురాలను సందర్శించవచ్చు. ఇలాంటి సదుపాయం భారతదేశంలో కేవలం కొన్ని ఆలయాలకు మాత్రమే ఉంది. రాహు కేతు సర్ప దోష నివారణ పూజలు ఈ ఆలయంలో విశేషంగా జరుగుతాయి. దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు ఇక్కడ తమ దోష నివృత్తి కావించుకుంటారు. ఇంకా రుద్రాభిషేకం, పాలాభిషేకం, పచ్చ కర్పూరాభిషేకం మొదలైన పూజలు కూడా జరుగుతాయి. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానానికి అనుబంధంగా నెలకొన్న శ్రీకాళహస్తీశ్వరస్వామి సాంకేతిక కళాశాలను 1997లో స్థాపించారు.
నాలుగు దిక్కుల దేవుళ్ళు
శ్రీకాళహస్తీశ్వర ఆలయం నిర్మాణంలో ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ వినాయకుడు, శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు, దక్షిణామూర్తి ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కునకు అభిముఖులై ఉన్నారు. ఆలయ దర్శనం ద్వారా చతుర్విధ పురుషార్ధ సిద్ధి లభిస్తుందనడానికి ఇది సూచన అని భక్తుల విశ్వాసం. పాతాళ గణపతి ఉత్తరాభిముఖునిగాను, జ్ఞాన ప్రసూనాంబ తూర్పు ముఖంగాను, కాళ హస్తీశ్వరుడు పశ్చిమ ముఖంగాను దక్షిణామూర్తి దక్షిణ ముఖం (మహా ద్వారం ఎదురు) గాను ఉన్నారు. కాళహస్తిలోని శివలింగం పంచ లింగాలలో వాయులింగంగా ప్రసిద్ధి చెందింది. (కంచి ఏకాంబరేశ్వరుడు పృథ్వీలింగము, శ్రీరంగం వద్ద జంబుకేశ్వరుడు జలలింగము, అరుణాచలంలో తేజోలింగము, చిదంబరంలో ఆకాశలింగము). స్వామి వాయుతత్వరూపానికి నిదర్శనంగా గర్భగుడిలోని కుడివైపున ఉన్న రెండు దీపాలు ఎప్పుడూ చలిస్తూ ఉంటాయని చెబుతారు.
గోపురాలు
ఆలయానికి నాలుగు దిక్కులా నాలుగు గోపురాలు, మరియు 120 అడుగుల ఎత్తుగల రాజగోపురం (కృష్ణదేరాయలు కట్టించినది) ఉన్నాయి. స్వామి గ్రామోత్సవం ఈ గోపురంనుండే మొదలవుతుంది. ఆలయానికి చేరుకోవడానికి ముందుగా "తేరు వీధి"కి ఎదురుగా ఉన్న భిక్షాల గోపురం నుండి వస్తాడు. జంగమరూపుడైన శివుని సేవించి తరించిన దేవదాసి "బిచ్చాలు" దీనిని కట్టించిందట. ఈ గోపుర నిర్మాణం యాదవ నరసింహరాయల కాలంలో జరిగిందని అంటున్నారు. తూర్పు గోపురాన్ని "బాల జ్ఞానాంబి గోపురం" అని, ఉత్తరం గోపురాన్ని "శివయ్య గోపురం" అని, పశ్చిమ దిక్కు గోపురాన్ని "తిరుమంజన గోపురం" అని అంటారు. తిరుమంజన గోపురానికి కుడివైపున "సూర్య పుష్కరిణి", ఎడమవైపున "చంద్ర పుష్కరిణి" ఉన్నాయి. స్వామి అభిషేకానికి, వంటకు నీటిని సూర్యపుష్కరిణి నుండి తీసుకెళతారు. ఈ గోపురం నుండి సువర్ణముఖి నదికి వెళ్ళవచ్చును. దక్షిణం గోపురంనుండి భక్త కన్నప్ప గుడికి, బ్రహ్మ గుడికి వెళ్ళవచ్చును.
ఇతర శివలింగాలు, పరివార దేవతలు
ఇక్కడ అనేక శివలింగాలు మహర్షులు లేదా దేవతలచే ప్రతిష్ఠింపబడినవిగా భావిస్తారు. భృగు మహర్షి - అర్ధ నారీశ్వర లింగము; అగస్త్యుడు - నీలకంఠేశ్వర లింగము; ఆత్రేయుడు - మణి కంఠేశ్వర లింగము; ఇంకా వ్యాసుడు, మార్కండేయుడు (మృత్యంజయేశ్వర లింగము), రాముడు, పరశురాముడు, ఇంద్రాది దేవతలు, సప్తర్షులు, యమధర్మరాజు, చిత్రగుప్తుడు, ధర్మరాజు ప్రతిష్ఠించినవనే లింగాలున్నాయి. వర్షాల కోసం మృత్యుంజయేశ్వరునికి సహస్రలింగాభిషేకం చేస్తారు. కాశీ విశ్వేశ్వరుడు కూడా మూర్తి స్వరూపుడై యున్నాడు.
ఇక్కడ క్షేత్ర పాలకుడు కాలభైరవుడు. వివిధ గణపతి మూర్తులు, సుబ్రహ్మణ్య స్వామి, సూర్య, శని గ్రహ మూర్తులు ఉన్నారు. వేంకటేశ్వర స్వామి, వరదరాజ స్వామి, వీరరాఘవ స్వామి మూర్తులు ఉన్నారు. నిలువెత్తు కన్నప్ప విగ్రహం ఉంది. శంకరాచార్యుల స్ఫటిక లింగము, 64 నాయనార్ల లోహ విగ్రహాలున్నాయి.
మంటపములు
ఆలయంలో శిల్పకళతో శోభించే స్తంభాలు, మంటపాలు ప్రత్యేకంగా చూపరులను ఆకర్షిస్తాయి. ఇంకా అనేక వర్ణ చిత్రాలు కూడా ఉన్నాయి. నగరేశ్వర మంటపము, గుర్రపుసాని మంటపము, నూరుకాళ్ళ మంటపము (రాయల మంటపము), పదునారు కాళ్ళ మంటపము, కోట మంటపము వాటిలో కొన్ని. నూరుకాళ్ళ మంటపం చక్కని శిల్పాలకు నిలయం. పదహారు కాళ్ళ మంటపంలో 1529లో అచ్యుత దేవరాయలు (కృష్ణదేవరాయలు సోదరుడు) పట్టాభిషేకం జరిగింది. అమ్మవారి ఆలయం ఎదురుగా అష్టోత్తర లింగ ముఖద్వారం పైకప్పులో చక్కని చిత్రాలున్నాయి.
రాహు కేతు క్షేత్రము
ఇది రాహు కేతు క్షేత్రమని ప్రసిద్ధి పొందింది. పుత్ర శోకానికి గరైన వశిష్ట మహర్షికి పరమేశ్వరుడు పంచముఖ నాగలింగేశ్వరునిగా దర్శనమిచ్చాడట. ఈ నాగరూపమునే బ్రహ్మదేవుడు కూడా అర్చించాడట. ఈ నాగరూపం కారణంగా ఈ క్షేత్రానికి "రాహు కేతు క్షేత్రము" అని పేరు వచ్చింది. సర్ప దోషము, రాహు కేతు గ్రహ దోషాలనుండి నివారణ కోసం ఈ స్వామిని పూజిస్తారు. స్వామి కవచము నవగ్రహ కవచమునకు అలంకారములు చేస్తారు.
దక్షిణామూర్తి
దక్షిణాభిముఖంగా ఉన్న ఆలయ ప్రవేశ ద్వారంనుండి లోనికి ప్రవేశించగానే ఉత్తరముఖంగా కొలువైయున్న దక్షిణామూర్తిని దర్శించవచ్చును. దక్షిణామూర్తి పూజలందుకొనడం కారణంగా ఇది జ్ఞాన ప్రధానమైన క్షేత్రం అయ్యింది. ఈ విధమైన దక్షిణామూర్తి విగ్రహం వేరెక్కడా కనుపించదు. ఇక్కడ వైదిక సంప్రదాయానికి ప్రముఖస్థానం ఉంది.
సేవలు
ఆలయంలో జరిగే కొన్ని సేవలు - కర్పూర హారతి, అష్టోత్తర అర్చన, సహస్ర నామార్చన, త్రిశతి అర్చన, పాలాభిషేకము, పచ్చ కర్పూరాభిషేకము, కాశీ గంగాభిషేకము, రుద్రాభిషేకము, నిత్యదిట్ట అభిషేకము, శ్రీ శనేశ్వరస్వామి అభిషేకము, శుక్రవారం అమ్మవారి ఊంజలి సేవ, వివాహ కట్నం, పంచామృతాభిషేకము, అఖండ దీపారాధన కట్నం, నిత్యోత్సవం (ఉదయం), ప్రదోష నంది సేవ, ఏకాంత సేవ, వాహన పూజ, సుప్రభాత సేవ, శని నివారణ జ్యోతిదీప కట్నం, తళిగ కట్నం, సర్పదోష (రాహు కేతు) పూజ, పౌర్ణమినాడు ఊంజల్ సేవ, నంది సేవ, పెద్ద వెండి సింహ వాహనము
తీర్ధాలు
ఆలయం పరిసరాలలో 36 తీర్ధాలున్నాయి. సహస్ర లింగాల తీర్ధము, హరిహర తీర్ధము, భరద్వాజ తీర్ధము, మార్కండేయ తీర్ధము, మూక తీర్ధము, సూర్య చంద్ర పుష్కరిణులు వాటిలో ముఖ్యమైనవి. దేవాలయంలోని "పాతాళ గంగ" లేదా "మూక తీర్థము"లోని తీర్థాన్ని సేవిస్తే నత్తి, మూగ లోపాలు పోయి వాక్చాతుర్యం కలుగుతుందటారు.
ఇతర విశేషాలు
ధర్మ కర్తల మండలి పరిపాలనలో, దేవాదాయ శాఖ అధ్వర్యంలో ఆలయ నిర్వహణ జరుగుతుంది. యాత్రికుల కొరకు శ్రీకాళహస్తీశ్వరస్వామి వసతి గృహం, జ్ఞానప్రసూనాంబ వసతి గృహం, బాలజ్ఞానాంబ సత్రము, శంకరముని వసతిగృహము, త్రినేత్రనటరాజ వసతిగృహము, తిరుమల తిరుపతి దేవస్థానం వసతిగృహము ఉన్నాయి. పట్టణంలో ప్రైవేటు వసతిగృహాలున్నాయి.
దగ్గరలోని సందర్శించవలసిన ప్రదేశాలు
వెయ్యి లింగాల లోయ:
రాళ్లతో సహజ సిద్ధంగా ఏర్పడిన లింగాలు ఇక్కడ చాలా ఉన్నాయి. ఇది శ్రీ కాళహస్తి నుండి 8 కి.మీ దూ రంలో కలదు, పురాణాల ప్రకారం జలపాతంలో నీటికి ఎన్నో చర్మ రోగాల నివారించే ఔషధ గుణాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడి అద్బుతమైన ప్రకృతి అందాలు, దేశ విదేశాల సందర్శకులని ఆకర్షిస్తుంది.
ఉబ్బలమడుగు జలపాతం:
ఉబ్బలమడుగు జలపాతం "తడ జలపాతం" మరియు "కంటకం జలపాతం" గా ప్రసిద్ధి చెందింది. ఇది శ్రీ కాళహస్తి నుండి 35 కి.మీ దూరంలో దట్టమైన కంబకం అడవి ప్రాంతంలో ఉన్నందువలన మీ సా హసకృతమైన ఇష్టాన్ని ఇంకా ఎక్కువ చేస్తుంది మరియు ఇక్కడ ప్రకృతి సౌందర్యం చూడకుండా ఉండలేము. కోమలమైన పచ్చదనం మరియు మైమరపించే ప్రకృతి దృశ్యాలు కేవలం సందర్శించడానికి కాకుండా ఒక అనుభూతిని నింపుతుంది.
గుడిమల్లం:
గుడిమల్లం అనే గ్రామం రేణిగుంట రైల్వే స్టేషన్ దగ్గరలో కలదు. ఈ గ్రామంలో పరశురామేశ్వర ఆలయం ఉన్నందువలన ఈ ప్రాంతం బాగా ప్రసిద్ధి చెందింది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ ఆలయం 2300 సంవత్సరముల క్రితంనాటి పురాతన ప్రాచీనమైన హిందూమత ఆలయంగా గుర్తించారు. పల్లవులు మరియు బనల కాలంలో గ్రానైట్ తో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆ తరువాత విక్రమ చోళ పాలనలో రాతితో పునర్నిర్మించారు. ఆ నిర్మాణం పాతకాలం నాటి అద్బుతమైన నిర్మాణ నైపుణ్యాన్ని తెలియజేస్తుంది.
నగరి కొండలు:
శ్రీ కాళహస్తి నుండి 36 కి.మీ దూరంలో కుశస్థలి నది ఒడ్డున ఈ నగరి కొండలు ఉన్నాయి, ఇది మంచి పర్యాటక కేంద్రం. నగరి కొండలు 855 మీటర్ల ఎత్తు ఉంటుంది, దీని ఎత్తైన ప్రదేశం మానవుని ము క్కు ఆకారంలో ఉంటుంది. అందువలన దీనిని నగరి ముక్కు అని పిలుస్తారు. పర్వతాధిరోహకులకు ఈ ప్రదేశంలో గల మిక్కిలి సవాళ్ళను అధిరోహించుటకు ఇష్టపడతారు. నగరిలో చాల దేవాలయాలు ఉండటం వలన భక్తులు ఇక్కడకి వస్తుంటారు
Previous
Next Post »
0 Komentar