Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Teaching in the school is good- UTF survey

బడిలో బోధనే మేలు -యూటిఎఫ్‌ సర్వేలో వెల్లడి
* తరగతిగదికి ఆన్‌లైన్‌ ప్రత్యామ్నాయం కాదు
* 90.4శాతం తల్లి తండ్రులది ఇదే మాట
* 96.5 శాతం మందికి ట్యాబ్‌, ల్యాప్‌టాప్‌, కంప్యూటర్లు లేవు
* 41.5 శాతం మందికి స్మార్ట్‌ఫోన్‌లు లేవు
* ఏజెన్సీలో 62 శాతం మందిది ఇదే స్థితి
* 50.8శాతం మందికి ఫోన్లలో డాటా లేదు
ప్రజాశక్తి-అమరావతి: కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో విద్యాబోధన ఆన్‌లైనా..ఆఫ్‌లైనా? కొంతకాలంగా చర్చనీయాంశమైన విషయమిది..! తల్లితండ్రులు మాత్రం ఈ ప్రశ్నకు ఆఫ్‌లైనే మేలని తేల్చేశారు. బడిలో ఉపాధ్యాయుడి పర్యవేక్షణలోనే చదువుసాగాలని స్పష్టం చేశారు. నేరుగా సందేహాలు అడగడం, సమాధానాలు తెలుసుకోవడం, పరస్పరం చర్చలు, ఆటపాటల ద్వారా ప్రత్యక్షంగా సాగే తరగతి గది బోధనకు ఆన్‌లైన్‌ ఏమాత్రం ప్రత్యామ్నాయం కాదని చెప్పారు. ఇదేదో ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చదివించే తల్లితంద్రుల అభిప్రాయమనుకుంటే పొరపాటే..! కొద్దిరోజులుగా ఆన్‌లైన్‌ బోధన పేరుతో జరుగుతున్న నిర్వాకాన్ని, పిల్లలు అనుభవిస్తున్న మానసిక హింసను ప్రత్యక్షంగా చూస్తున్న కార్పొరేట్‌ పాఠశాలలకు పిల్లల్ని పంపేవారు సైతం ఆఫ్‌లైన్‌కే ఓటు వేశారు. ఐదుశాతమో, పది శాతమో కాదు 90.4శాతం మంది తల్లితండ్రుల మొగ్గు బడిలో బోధనవైపే..! ఆంధ్రప్రదేశ్‌ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (ఎపి యుటిఎఫ్‌) రాష్ట్ర వ్మాప్తంగా విస్తృతంగా నిర్వహించిన సర్వేలో ఈ విషయం తేటతెల్లమైంది.
కరోనా నేపథ్యంలో తల్లితండ్రులు, విద్యార్థులు, ఉపాద్యాయుల పరిస్థితి మానసిక సంఘర్షణ ఏమిటనే అంశంపై నిర్వహించిన ఈ సర్వే 2నెల 8నుంచి 15వతేది వరకు రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లోని 603 మండల కేంద్రాలు, పట్టణప్రాంతాలు, 4253 గ్రామాల్లో సాగింది. మొత్తం 26,869 మంది తల్లితండ్రులను, 44, 644 మంద్రి విద్యార్థులను కలిసి వారి అబిప్రాయాలను సేకరించింది. పట్టణప్రాంతాలు, గ్రామాలతో పాటు ఏజెన్సీ ప్రాంతంలోని మారుమూల పల్లెలో కూడా ఈ సర్వే జరగడం విశేషం. సర్వేలో పాల్గొన్న వారిలో కేవలం 3.5శాతం మంది కి మాత్రమే ట్యాబ్‌,ల్యాప్‌టాప్‌, కంప్యూటర్లలో ఏదో ఒకటి అందుబాటులో ఉంది. అంటే 96.5శాతం మందికి వీటిలో ఏ ఒక్కటి లేదు. ప్రభుత్వాలు చెప్పే సాంకేతిక లెక్కలకు క్షేత్రస్థాయిలోని వాస్తవాలకు ఉన్న తేడా ఇది..!
'స్మార్ట్‌' కొందరే .. టివి కూడా అందరికి లేదు..
స్మార్ట్‌ఫోన్‌ కూడా రాష్ట్రంలో అందరి వద్ద లేదు. సగటున 50శాతం మంది విద్యార్థుల తల్లితండ్రులకు స్మార్ట్‌ఫోన్‌ లేదు. మైదాన ప్రాంతాల్లో స్మార్ట్‌ఫోన్లు లేని వారు41.5శాతం వుంటే, ఏజెన్సీ ప్రాంతంల 62శాతం మందికి లేదు. ఇక స్మార్ట్‌ఫోన్‌ ఉన్న వారిలో సైతం 71.3శాతం మంది తల్లితండ్రులు తమ పిల్లలకు స్మార్ట్‌ఫోన్‌ ఇవ్వము అని చెప్పారు. ఇక టీవి విషయానికి వస్తే 87.8శాతం మంది విద్యార్థులకు అందుబాటులో వుంది. అదే గ్రామీణ ప్రాంతాల్లో అయితే 70శాతం మందికే టివి వుంది. సప్తగిరి చానల్‌లో ఇపుడు వస్తున్న తరగతులను 62.4శాతం మంది విద్యార్జులు మాత్రమే చూస్తున్నారు. వీరిలో 55.1శాతం మంది విద్యార్థులకు సప్తగిరి చానల్‌లో వస్తున్న పాఠాలు అర్థంకాని పరిస్థితి వున్నట్లు సర్వేలో తేలింది. టీవిల్లో వచ్చే పాఠాలకు ఏదైనా సందేహం వస్తే 62.7శాతం మందికి సందేహాన్ని నివృత్తి చేసేవారులేని పరిస్తితి వుంది. ప్రైవైట్‌ కార్పోరేట్‌ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థుల్లో కూడా ఆన్‌లైన్‌ బోధనపై 7శాతం మంది విద్యార్థులు మాత్రమే సంతృప్తిని వ్యక్తం చేశారు. టీవి పాఠాలు కూడా సరిపోవని 92.3శాతం మంది తల్లితండ్రులు తమ అబిప్రాయంగా చెప్పారు.
కరోనా వేళ ఇలా....!
కరోనా తీవ్రత లేని ప్రాంతాల్లో పాఠశాలలను ప్రారంభించాలని 73.1శాతం మంది కోరగా 26.9శాతం మంది ఈ పరిస్థితుల్లో పాఠశాలలు తెరవడం ప్రమాదకరమని తెలిపారు. ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకుంటే 50.1శాతం తల్లితండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపుతామని తెలిపారు. ఇపుడున్న తరగతి గదుల్లో 47.9శాతం మాత్రమే బౌతికదూరం పాటిస్తూ తరగతులు నిర్వహించుకునేలా వుంటే 40.5శాతం గ్రామాల్లో సరైన వైద్యసదుపాయాలు లేని పరిస్థితి వున్నట్లు సర్వేలో తేలింది.ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌ తరగతులు పెద్దగా సత్పలితాలను ఇవ్వలేవని పలువురి అబిప్రాయంగా వుంది.
సర్వే ఇలా జరిగింది..
సర్వేచేసిన కాలం జూలై 8నుండి 15 తేది వరకు
సర్వేచేసిన జిల్లాలు 13
మండలాలు, పట్టణాలు 603
గ్రామాలు, వార్డులు, ఏజెన్సీగ్రామాలు 4,253
కుటుంబాల సంఖ్య 26,869
విద్యార్థులు 44,644
సర్వేలో పాల్గన్న ఉపాద్యాయులు 7065
ప్రజాశక్తి దినపత్రిక సౌజన్యంతో..
Previous
Next Post »
0 Komentar

Google Tags