Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Cabinet approves historical bill on women safety


AP Cabinet approves historical bill on women safety


ఏపీ దిశ యాక్ట్‌: మహిళలకు అండగా మరో చరిత్రాత్మక బిల్లుకు ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం ఆమోదముద్ర

మహిళలకు అండగా మరో చరిత్రాత్మక బిల్లుకు ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. మహిళలపై అత్యాచారాలకు పాల్పడితే మరణశిక్ష విధించేలా ఏపీ క్రిమినల్‌ లా చట్టం (సవరణ) 2019కి కేబినెట్‌ అనుమతి తెలిపింది. ఏపీ దిశ యాక్ట్‌గా ఈ చట్టానికి నామకరణం చేశారు. ఇందులో భాగంగా భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 354కు సవరణలు చేసి కొత్తగా 354-ఈ చేర్చింది. ఈ చట్టం ద్వారా అత్యాచారానికి పాల్పడిన ఆధారాలు ఉన్నప్పుడు 21 రోజుల్లో తీర్పు వెలువడనుంది.
వారం రోజుల్లోగా విచారణ పూర్తిచేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి రెండు వారాల్లోగా ట్రయల్ పూర్తి చేసి శిక్ష పడేలా చేయడం ఈ చట్టం ఉద్దేశం. రెడ్ హ్యాండెడ్‌గా ఆధారాలుంటే నిందితులకు మూడు వారాల్లోగా ఉరిశిక్ష విధించడానికి ఈ చట్టం దోహదం చేస్తుంది. ప్రస్తుతం ఉన్న నాలుగు నెలల విచారణ సమయాన్ని 21 రోజులకు కుదిస్తూ బిల్లు రూపొందింది. అత్యాచారం, సామూహిక అత్యాచారం, యాసిడ్‌ దాడులు, వేధింపులు, లైంగిక వేధింపులు తదితర నేరాలకు సత్వరమే విచారణ చేసేందుకు ప్రతి జిల్లాలోనూ ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయనుంది. సోషల్‌ మీడియాలో మహిళలను కించపరిచేలా పోస్టింగ్‌లు పెడితే సెక్షన్‌ 354-ఈ కింద చర్యలు తీసుకునేలా ఈ బిల్లును ప్రతిపాదించారు.

ఇక, సోషల్‌ మీడియాలో మహిళలను కించపరిస్తే కఠిన చర్యలు తీసుకోనున్నారు. మహిళలను కించపరుస్తూ మొదటిసారి పోస్టు చేస్తే రెండేళ్లు, రెండోసారికూడా అదేవిధంగా పోస్టులు చేస్తే నాలుగేళ్లు జైలుశిక్ష విధించనున్నారు. చిన్నారులను లైంగికంగా వేధిస్తే 14 ఏళ్ల వరకూ జైలుశిక్ష, అలాగే చిన్నారులపై లైంగిక వేధింపుల కేసుల్లో తీవ్రత ఉంటే జీవిత ఖైదు పడనుంది. ఇక పోక్సో చట్టం కింద ఇప్పటివరకూ ఉన్న కనీస శిక్షను అయిదేళ్లకు పెంచుతూ ఈ బిల్లులోని అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

Previous
Next Post »
0 Komentar

Google Tags