Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

May Day, International Workers' Day


కార్మికులకు, ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు మరియు అందరికీ "ప్రపంచ కార్మిక దినోత్సవ" శుభాకాంక్షలతో ...

నేడు మే డే..

మే దినోత్సవం లేదా మే డే (May Day) ప్రతి సంవత్సరం మే 1 వ తేదీన జరుపుకునే స్మారక దినం. చాలా దేశాలలో మే దినం, అంతర్జాతీయ కార్మిక దినోత్సవం లేదా కార్మిక దినోత్సవంతో ఏకీభవిస్తాయి. ఇవి అన్నీ కూడా కార్మికుల పోరాటం, కార్మికుల ఐక్యతను గుర్తిస్తాయి. మే డే ఒక చారిత్రాత్మక చైతన్య దినం. చికాగోలో వున్న కొంతమంది రక్తతర్పణం చేసి కేవలం తమ దేశంలో వుండే కార్మికవర్గానికే కాకుండా ప్రపంచానికంతటికీ కొత్త వెలుగును అందించారు. 24 గంటలలో ఎనిమిది గంటలు పని, ఎనిమిది గంటలు విశ్రాంతి (రెస్టు), ఇంకా ఎనిమిది గంటలు రిక్రీయేషన్‌ అన్నవి ఈ పోరాటం ద్వారా సాధించుకున్నారు.

నేడు ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే. పెట్టుబడిదారుల శ్రమ దోపిడీని ఎదిరించి కార్మికులు తమ హక్కులను సాధించుకున్న రోజు. పెట్టుబడిదారులు తమ శ్రమను రోజులతరబడి విరామం లేకుండా దోచుకుంటున్న సమయంలో మేమూ మనుషులమే, మా శక్తికి కూడా పరిమితులుంటాయని తిరుగబడిన రోజు అది. 1886లో అమెరికాలోని చికాగో నగరంలో కార్మికులు తమ పనిముట్లను కింద పడేసి రోజులో ఎనిమిది గంటల పని కోసం పోరాటం ప్రారంభించారు. ఈ డిమాండ్ కోసం వారు తమ ప్రాణాలను సైతం ఎదురొడ్డారు. సమ్మె చేస్తున్న కార్మికులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో తమ సహచరులు నలుగురు మరణించినా వారు తమ పట్టు వీడలేదు. చివరికి తమ పోరాట పటిమతో వారు తమ హక్కును సాధించుకున్నారు. ఈ పోరాటం ఇచ్చిన స్ఫూర్తితో ప్రపంచ వ్యాప్తంగా కార్మికులు సంఘటితమై సంఘాలుగా ఏర్పడి తమ హక్కులను సాధించుకోవడం ప్రారంభించారు. తమ బానిస బతుకుల నుంచి విముక్తిని పొందారు. తమలో చైతన్యాన్ని రగల్చిన ఆ రోజును స్మరించుకుంటూ కార్మిక లోకం ప్రతి సంవత్సరం మే ఒకటో తేదీన కార్మిక దినోత్సవాన్ని జరుపుకుంటున్నది.

నిజానికి ఈనాటికీ ప్రభుత్వ కార్యాలయాలలో తప్ప ప్రైవేటు కర్మాగారాలలో మాత్రం కార్మికుల చేత పశువుల్లా పని చేయించుకుంటున్నారు. అదేవిధంగా బాలకార్మికులచేత వెట్టి చాకిరీ చేయిస్తున్నారు.  ప్రభుత్వం ఎన్నిచట్టాలు తెచ్చినా ప్రతి రంగంలోనూ బాలకార్మికులు కనబడుతున్నారు.  ఇప్పటికైన ప్రభుత్వం గట్టి చట్టాలు తెచ్చి, బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిషేదించాలి. వారిచేత చేయించుకున్న ఉత్పత్తులను నిషేదించాలి. దేశంలో పేరుకు పెద్ద కంపెనీలుగా  చెలామణి అవుతున్న కార్పోరేట్ సంస్థలు కార్మికులను పీల్చి పిప్పి చేస్తున్నాయి. ఈ సంస్థలలో పనిచేసే కార్మికులకు కంటినిండా నిద్రలేకసమయానికి తిండి లేక ఆరోగ్యాలను పాడుచేసుకుంటున్నారు. ఎక్కవ జీతానికి ఆశపడి కార్పోరేట్ సంస్థల కబంధహస్తాలలో ఎందరో కార్మికులు చిక్కుకొని రోదిస్తున్నారు.  ఇలాంటి కార్మికుల జీవితాలలో వెలుగును నింపిన రోజే నిజమైన ప్రపంచ కార్మిక దినోత్సవం అని చెప్పొచ్చు. ఏదేమైనా నలుగురు కార్మికులు తమ పని గంటల కోసం పోరాడిన ఈరోజున వారిని స్మరించుకుందాం..

Previous
Next Post »
0 Komentar

Google Tags