Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Corona Pandemic: Second Wave in European countries - UK Prime Minister signs on lockdown



Corona Pandemic: Second Wave in European countries 
 UK Prime Minister signs on lockdown
ఐరోపా దేశాల్లో మహమ్మారి రెండోసారి పంజా.. లాక్‌డౌన్‌పై బ్రిటన్ ప్రధాని సంకేతాలు
చైనాలో మొదలైన ప్రాణాంతక కొత్తరకం వైరస్.. ఐరోపా దేశాలను అతలాకుతలం చేసింది. స్పెయిన్, ఫ్రాన్స్, బ్రిటన్ సహా అనేక ఐరోపా దేశాలు చిగురుటాకులా వణికిపోయాయి.

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఉద్ధృతి ఏమాత్రం తగ్గుముఖం పట్టడంలేదు. ఇప్పటి వరకూ మహమ్మారి బారినపడ్డ బాధితుల సంఖ్య మూడు కోట్లు దాటగా.. 9.56 లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. మహమ్మారి మొదలై తొమ్మిది నెలలు గడుస్తున్నా రోజు రోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇదిలా ఉండగా, తొలినాళ్లలో మహమ్మారి దెబ్బకు వణికిపోయిన ఐరోపా దేశాల్లో గత మూడు నెలలుగా పరిస్థితి కొద్దిగా కుదుటపడినా.. మళ్లీ రెండో దశ వ్యాప్తి మొదలవుతోంది.

ఈ నేపథ్యంలో పలు దేశాలు మరోమారు లాక్‌డౌన్ లేదా పాక్షిక లాక్‌డౌన్ విధిస్తున్నాయి. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లోని కొన్ని ప్రాంతాల్లో పాక్షిక లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. మాడ్రిడ్ ప్రభుత్వ ప్రతినిధి ఇసాబెల్ డియాజ్ అయుసో మాట్లాడుతూ.. నగరం అంతటికీ కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కొన్ని ప్రాంతాల్లో పాక్షిక లాక్‌డౌన్ అమలు చేస్తున్నామని తెలిపారు.

ఇదేవిధంగా ఇజ్రాయిల్‌లో కరోనా కేసులను నియంత్రించేందుకు మరోమారు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది. కరోనా వైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మూడు వారాల పాటు లాక్‌డౌన్ కొనసాగుతుందని ప్రధాని బెంజిమన్ నెతాన్యాహూ తెలిపారు.

కరోనా మహమ్మారితో అత్యంత తీవ్రంగా దెబ్బతిన్న ఐరోపా దేశాల్లో బ్రిటన్‌ ఒకటి. తాజాగా బ్రిటన్ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ చేసిన ప్రకటన మరింత ఆందోళనకు గురిచేస్తోంది. దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి రెండో దశ ప్రారంభమైందని ప్రకటించిన ఆయన.. మరోసారి కఠిన ఆంక్షలు తప్పకపోవచ్చునని సంకేతాలు ఇచ్చారు. ఫ్రాన్స్‌, స్పెయిన్‌ సహా ఐరోపాలో వైరస్ తిరిగి విజృంభిస్తోందని, అదే తరహాలో బ్రిటన్‌ కూడా రెండో దశ ఎదుర్కోవడం అనివార్యమని ఆయన అభిప్రాయపడ్డారు.


ప్రస్తుతం కోవిడ్ కట్టడికి అమల్లో ఉన్న భౌతికదూరం వంటి నిబంధనల్ని మరింత కఠినతరం చేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఆరుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడొద్దనే నిబంధనలు అక్కడ ఇప్పటికే అమలులో ఉన్నాయి. గతవారం వైరస్ వ్యాప్తి వృద్ధిరేటు 1.0-1.2 శాతం ఉండగా.. ఈ వారం 1.1-1.4కి చేరిందని ప్రభుత్వ సైంటిఫిక్ సలహాదారులు పేర్కొన్నారు. దీనిని అనుమానించాల్సిందేనని కెవిన్ మెక్‌కాన్‌వే అనే శాస్త్రవేత్త అన్నారు. వృద్ధి రేటు అంచనా సమర్ధవంతంగా లేకపోతే కొత్త కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతాయని అన్నారు.

వాయువ్య, ఉత్తర, మధ్య ఇంగ్లాండ్‌లో మంగళవారం నుంచి ఆంక్షలు అమలుచేస్తున్నారు. కేఫ్‌లు, రెస్టారెంట్స్‌లో ఆహారం, కూల్ డ్రింక్‌లను మాత్రమే టేబుల్ వద్దకు అనుమతిస్తున్నారు. రాత్రి 10.00 గంటల్లోపు పబ్బులు, బార్లను మూసేయాలని ఆదేశించారు. బ్రిటన్‌లో శుక్రవారం కొత్తగా 4,322 మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. మే తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో కొత్త కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.

దీంతో రెండో దశ వ్యాప్తి ప్రారంభమైందని భావిస్తున్నారు. ఇప్పటి వరకు దేశంలో 3,85,412 కేసులు నమోదయ్యాయి. వీరిలో 41,732 మంది మరణించారు. గత కొన్ని రోజులుగా కేసులు తగ్గుముఖం పట్టడంతో నిర్ధారణ పరీక్షల తగ్గించారనే విమర్శలు వెల్లువెత్తాయి. కొంత మంది పరీక్షల కోసం ఏకంగా కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చిందని స్థానిక మీడియా పేర్కొంది.

Previous
Next Post »
0 Komentar

Google Tags