Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Current Covid State-wise Regulations in India

 

కరోనా ఆంక్షలు మన దేశంలో వివిధ రాష్ట్రాలలోని ప్రస్తుత ఆంక్షల వివరాలు

క్యాలెండర్‌లో ఏడాది మారింది.. కానీ కరోనా మహమ్మారి మాత్రం అలాగే ఉంది. తొలి దశ తర్వాత కాస్త ఊపిరిపీల్చుకుందేమో..! రెండో దశలో మరింత బలంగా బుసలు కొడుతోంది. ఫలితంగా దేశంలో రోజువారీ కేసులు, మరణాలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. కొత్త కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో భారత్‌ క్రమక్రమంగా ఆంక్షల చట్రంలోకి జారుకుంటోంది. వైరస్‌ వ్యాప్తి కట్టడికి ఇప్పుడు అనేక రాష్ట్రాలు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. మరి ఏ రాష్ట్రంలో ఎలాంటి ఆంక్షలున్నాయో ఓసారి చూద్దాం..!

మహారాష్ట్ర. 

రెండో దశలో కరోనా ఉద్ధృతి ఎక్కువగా రాష్ట్రాల్లో మహారాష్ట్ర ముందువరుసలో ఉంది. అక్కడ రోజుకు 60వేల పైనే కేసులు వెలుగుచూస్తున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ తరహా కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. ఏప్రిల్‌ 14 రాత్రి 8 గంటల నుంచి 15 రోజుల పాటు ‘జనతా కర్ఫ్యూ’ విధించింది. రాష్ట్రమంతటా 144 సెక్షన్‌ అమలుచేస్తోంది. అత్యవసర, నిత్యావసర సేవలు మినహా అన్ని కార్యకలాపాలు, బహిరంగ ప్రదేశాలు, మాల్స్‌, రెస్టారెంట్లు మూసివేసింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని ప్రభుత్వం హెచ్చరించింది. 

దిల్లీ.. 

ఇక మహారాష్ట్ర తర్వాత దేశ రాజధాని దిల్లీలో వైరస్‌ విజృంభణ తీవ్ర స్థాయిలో ఉంది. అక్కడ గతంలో ఎన్నడూ లేని విధంగా రోజుకు దాదాపు 20వేల మంది కరోనా బారినపడుతున్నారు. దీంతో కేజ్రీవాల్‌ సర్కారు కూడా కఠిన ఆంక్షలు అమల్లోకి తెచ్చింది. వారాంతపు కర్ఫ్యూ విధించింది. ప్రతి శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు అన్ని వ్యాపార, వాణిజ్య  కార్యకలాపాలు బంద్‌ చేసింది. కర్ఫ్యూ రోజుల్లో మాల్స్‌, స్విమ్మింగ్‌ పూల్స్‌, మార్కెట్లు, స్పా సెంటర్లు, జిమ్‌లు మూసివేయాలని స్పష్టం చేసింది. రెస్టారంట్లకు కేవలం హోం డెలివరీకి మాత్రమే అనుమతి కల్పించింది. సినిమా థియేటర్లు 30శాతం సామర్థ్యంతో నడపాలని స్పష్టం చేసింది. ముందుగా నిర్ణయించుకున్న వివాహాల్లో 50 మంది, అంత్యక్రియల్లో 20 మందికి మించి పాల్గొనరాదని వెల్లడించింది.  

ఉత్తరప్రదేశ్‌.. 

ఉత్తరప్రదేశ్‌లోనూ కొవిడ్ పరిస్థితి నానాటికీ ఉద్ధృతంగా మారుతోంది. దీంతో వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు అక్కడి ప్రభుత్వం ఆదివారాలు లాక్‌డౌన్‌ ప్రకటించింది. ఆ రోజుల్లో అన్ని గ్రామీణ, పట్టణప్రాంతాల్లో పూర్తి లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుందని పేర్కొన్న ప్రభుత్వం.. ఆదివారాలు బహిరంగ ప్రదేశాలను శానిటైజ్‌ చేయాలని అధికారులను ఆదేశించింది. ఇక కరోనా నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. మాస్క్‌ ధరించకుండా ఒకసారి పట్టుబడితే రూ. 1000, మళ్లీ మళ్లీ నిబంధన ఉల్లంఘిస్తే రూ. 10వేల జరిమానా విధిస్తామని యోగి సర్కారు స్పష్టం చేసింది. అంతేగాక, మహారాష్ట్ర, కేరళ వంటి కరోనా ఉద్ధృతి ఎక్కువగా ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చే వారికి ఆర్‌టీ-పీసీఆర్‌ నెగెటివ్‌ రిపోర్టు తప్పనిసరి చేసింది. 

మధ్యప్రదేశ్‌.. 

మధ్యప్రదేశ్‌లోనూ వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. దీంతో అక్కడ ప్రభుత్వం ‘కరోనా కర్ఫ్యూ’ పేరుతో ఆంక్షలు విధించింది. కర్ఫ్యూ సమయంలో అత్యవసర, వైద్య సేవలు, నిర్మాణ కార్యకలాపాలు, నిత్యావసర దుకాణాలు మాత్రమే అందుబాటులో ఉంటాయని తెలిపింది. మహారాష్ట్ర నుంచి వచ్చేవారికి ఆర్‌టీ-పీసీఆర్‌ నెగెటివ్‌ పత్రం తప్పనిసరి అని పేర్కొంది.  

రాజస్థాన్‌.. 

రాజస్థాన్‌లోనూ ఏప్రిల్‌ 16 సాయంత్రం 6 గంటల నుంచి ఏప్రిల్‌ 19 ఉదయం 5 గంటల వరకు వారాంతాపు కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. నిత్యావసర, వైద్య సేవలు మినహా అన్ని కార్యకలాపాలను నిలిపివేశారు. వివాహాది శుభకార్యాలు, అంత్యక్రియల్లో పాల్గొనేవారి సంఖ్యను తగ్గించింది. అయితే శనివారం ఉప ఎన్నికలు జరిగే అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ కర్ఫ్యూ నుంచి మినహాయింపు కల్పించింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారికి కరోనా నెగెటివ్‌ పత్రం తప్పనిసరి చేస్తున్నట్లు వెల్లడించింది. 

తమిళనాడు 

తమిళనాడులోనూ ఏప్రిల్‌ 10 నుంచి లాక్‌డౌన్‌ తరహా కఠిన ఆంక్షలు అమలవుతున్నాయి. పండగలు, మతపరమైన బహిరంగ సమావేశాలపై నిషేధం విధించారు. హోటళ్లు, రెస్టారెంట్లు, క్లబ్‌లు, సినిమా థియేటర్లు 50శాతం సామర్థ్యంతో నడపాలని నిర్ణయించింది. శుభకార్యాల్లో 100 మంది, సామాజిక, రాజకీయ, విద్య, వినోదం, క్రీడ, సాంస్కృతిక కార్యక్రమాలకు 200 మందికి అనుమతి కల్పించింది. ప్రార్థనా మందిరాల్లోకి భక్తులకు రాత్రి 8 గంటల వరకే అనుమతినిచ్చింది. 

కర్ణాటక.. 

రోజువారీ కేసులు పెరుగుతున్న రాష్ట్రాల్లో కర్ణాటక కూడా ఒకటి. అక్కడ బెంగళూరు సహా ఏడు జిల్లాల్లో రాత్రి కర్ఫ్యూ కొనసాగుతోంది. చండీగఢ్‌, కేరళ, పంజాబ్‌, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి వచ్చేవారు తప్పనిసరిగా ఆర్‌టీ-పీసీఆర్‌ నెగటివ్‌ పత్రం చూపించాలని స్పష్టం చేసింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప రెండోసారి కరోనా బారినపడిన విషయం తెలిసిందే. 

పంజాబ్‌, చండీగఢ్‌.. 

పంజాబ్‌లో ఏప్రిల్‌ 30 వరకు రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉంది. స్కూళ్లు మూతబడ్డాయి. చండీగఢ్‌ ప్రభుత్వం శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు వారాంతపు లాక్‌డౌన్‌ విధించింది. చండీగఢ్‌కు వచ్చేవారు కొవా పంజాబ్‌ యాప్‌లో నమోదు చేసుకోవాలని అక్కడి ప్రభుత్వం స్పష్టం చేసింది. 

కేరళ.. 

కేరళలో ఏప్రిల్‌ 30 వరకు కరోనా ఆంక్షలు విధించింది అక్కడి సర్కారు. దుకాణాలన్నీ రాత్రి 9 గంటల వరకు మూసివేయాలని స్పష్టం చేసింది. అవుట్‌డోర్‌ కార్యక్రమాల్లో 200, ఇండోర్‌ కార్యక్రమాల్లో 100 మందికి మించి పాల్గొనరాదని సూచించింది. 

ఇక, తెలంగాణలో మాస్క్‌ లేకపోతే రూ. 1000 జరిమానా విధిస్తున్నారు. గుజరాత్‌, ఒడిశా, హరియాణా, జమ్మూకశ్మీర్‌ల్లోని పలు జిల్లాల్లో రాత్రి కర్ఫ్యూ, ఛత్తీస్‌గఢ్‌లోని కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ఉత్తరాఖండ్‌ రాష్ట్రమంతటా రాత్రి కర్ఫ్యూ అమల్లోకి తెచ్చింది.

Previous
Next Post »
0 Komentar

Google Tags