Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Android Security Settings You Should Know for Your Mobile Security

 

Android Security Settings You Should Know for Your Mobile Security

మీ మొబైల్ సెక్యూరిటీ కోసం మీరు తెలుసుకోవాల్సిన సెక్యూరిటీ ఫీచర్ల వివరాలు ఇవే  

ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు ఎక్కడికెళ్లినా ఏ పనిచేస్తున్నా స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో భాగమైపోయింది. అందుకే దాన్ని దొంగలు, సైబర్ నేరగాళ్ల నుంచి కాపాడుకోవడం తప్పనిసరి. దానికి తగ్గట్లుగా మొబైల్ తయారీ కంపెనీలు ఇటీవలి కాలంలో వస్తున్న ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లలో ఇన్‌-బిల్ట్ ప్రొటెక్షన్ టూల్స్‌ని (ఫోన్‌కి రక్షణ కల్పించే సాధనాలు) ఇస్తున్నాయి. మరి ఆ టూల్స్‌ ఏంటీ?..వాటి ద్వారా మీ ఆండ్రాయిడ్ ఫోన్‌కి ఎలాంటి రక్షణ ఉంటుందనేది తెలుసుకుందాం.

స్క్రీన్‌ లాక్‌

స్మార్ట్‌ఫోన్‌ దొంగిలించిన వెంటనే దొంగలు దాన్ని ఓపెన్ చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. అందులోకి ఇతరులు చొరబడకుండా మంచి లాక్‌ వేయాలి. ఇటీవలి కాలంలో వచ్చే స్మార్ట్‌ఫోన్లలో కూడా పిన్, ప్యాట్రన్‌, పాస్‌వర్డ్, ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఫేస్‌లాక్ వంటి లాకింగ్ ఫీచర్లు ఇస్తున్నారు. వాటిలో ఏదో ఒక దానితో మీ ఫోన్‌కి భద్రత ఏర్పాటుచేసుకోవచ్చు. మీ ఫోన్ పోగొట్టుకున్నా దాన్ని ఓపెన్ చేయాలంటే మీరు పెట్టిన లాకింగ్ ఫీచర్ తప్పనిసరి. 

లాక్‌ నోటిఫికేషన్‌

మీ ఫోన్ లాక్ చేసిన తర్వాత స్క్రీన్‌ మీద ఎలాంటి నోటిఫికేషన్లు కనిపించాలి అనేది మీరు ఎంచుకోవచ్చు. ఇందుకోసం ఫోన్ సెట్టింగ్స్‌లో యాప్స్‌ అండ్ నోటిఫికేషన్స్ లేదా నోటిఫికేషన్స్‌ సెక్షన్‌లోకి వెళితే లాక్‌ స్క్రీన్ నోటిఫికేషన్స్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి మీ కావాల్సిన యాప్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేస్తే సరిపోతుంది. అయితే ఈ ఫీచర్‌ ఒక్కో ఫోన్‌ మోడల్‌లో ఒక్కో విధంగా ఉంటుంది. అలానే ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ 11 ఆపై ఓఎస్‌లతో పనిచేస్తున్న ఫోన్లలో మాత్రమే ఉంటుంది. దీని వల్ల ఫోన్‌ పోయినా ముఖ్యమైన యాప్‌లకు సంబంధించిన సమాచారాన్ని ఇతరులు చూడలేరు.

ఫైండ్ మై డివైజ్

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను పోగొట్టుకున్నప్పుడు గూగుల్  ఫైండ్‌ మై డివైజ్ ఫీచర్ ఎంతో ఉపయోగపడుతుంది. దీని సాయంతో మీ ఫోన్ ఉన్న చోటుని గుర్తించవచ్చు. ఇందుకోసం మీరు సెట్టింగ్స్‌లో కొన్ని మార్పులు చేయాల్సివుంటుంది. మొబైల్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి సెక్యూరిటీలో ఫైండ్ మై డివైజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఎనేబుల్ చేస్తే సరిపోతుంది. ఈ ఫీచర్ పనిచేసేందుకు లొకేషన్‌ ఫీచర్ తప్పనిసరిగా ఆన్ చేసి ఉంచాలి. అలానే మీ ఫోన్‌లో ఉన్న డేటాను ఇతరులు యాక్సెస్ చేయకుండా ఫోన్‌ని ఫైండ్ మై డివైజ్‌ వెబ్‌సైట్‌ నుంచి బ్లాక్ చెయ్యొచ్చు. కొన్ని ఫోన్లలో ఈ ఫీచర్ సెట్టింగ్స్‌లో బయోమెట్రిక్స్‌ అండ్ సెక్యూరిటీ సెక్షన్‌లో ఉంటుంది.

స్మార్ట్‌లాక్‌

కొన్నిసార్లు మనం ఫోన్‌ని అన్‌లాక్‌ చేసి ఉంచుతాం. అలా అన్‌లాక్ చేసిన ఫోన్ పోగొట్టుకుంటే అందులోని విలువైన సమాచారం ఇతరుల చేతికి చిక్కినట్టే. ఒకవేళ మీరు ఫోన్‌లో స్మార్ట్‌లాక్‌ ఫీచర్ ఎనేబుల్ చేసి మీ ఫోన్‌ లాక్‌ చేస్తే మీరు అనుమతించిన ప్రదేశాలు, డివైజ్‌లకు దగ్గరగా వెళ్లినప్పుడు లేదా కనెక్ట్ చేసినప్పుడు ఫోన్ అన్‌లాక్ అవుతుంది. ఈ స్మార్ట్‌లాక్‌లో మూడు ఫీచర్లు ఉంటాయి. వాటిలో మొదటిది ఫోన్‌ని మీ శరీరంలో ఎక్కడ టచ్‌ చేసినా అన్‌లాక్ అవుతుంది. రెండోది మీరు యాడ్‌ చేసిన లొకేషన్లలోకి వెళ్లినప్పుడు ఫోన్ అన్‌లాక్ అవుంది. ఉదాహరణకు మీ ఇల్లు, ఆఫీస్‌ లేదా మీరు తరచుగా వెళ్లే ప్రదేశాలు. మూడోది తరచుగా ఉపయోగించే డివైజ్‌లకు దగ్గరగా వెళ్లినప్పుడు లేదా వాటికి కనెక్ట్ చేసినప్పుడు అన్‌లాక్ అవుతుంది. అంటే మీ పీసీ, డెస్క్‌టాప్‌ కంప్యూటర్‌, ట్యాబ్ వంటి డివైజ్‌లకు దగ్గరగా ఉన్నప్పుడు ఫోన్ అన్‌లాక్ అవుతుంది. స్మార్ట్‌లాక్‌తో మీ ఫోన్ లాక్‌ అయితే స్క్రీన్‌ మీద లాక్‌ సింబల్ చుట్టూ రౌండ్ కనిపిస్తుంది. ఈ ఫీచర్ కూడా ఆండ్రాయిడ్ 10 ఆపై వెర్షన్ ఓఎస్‌లు ఉన్న ఫోన్లలో మాత్రమే పనిచేస్తుంది.

గూగుల్ ప్లే ప్రొటెక్ట్

ప్లేస్టోర్ నుంచి మనం ఎన్నో రకాల యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకుంటుంటాం. వాటి ద్వారా హ్యాకర్స్‌ ఎన్నో రకాల మాల్‌వేర్‌లు ఫోన్‌లోకి పంపి యూజర్ డేటా దొంగిలిస్తుంటారు. వీటికి అడ్డుకట్ట వేసేందుకు గూగుల్ ప్లే ప్రొటెక్ట్ ఫీచర్ ఎంతో ఉపయోగపడుతుంది. ఇది ఫోన్‌కి హాని కలిగించే యాప్‌లను గుర్తించి తొలగిస్తుంది. అలానే గూగుల్ అన్‌వాంటెడ్ సాఫ్ట్‌వేర్ పాలసీని అతిక్రమించిన యాప్‌లను గుర్తించి వాటి సమాచారాన్ని యూజర్‌కి చేరవేస్తుంది. ఫోన్‌లో ఇది డిఫాల్ట్ సెట్టింగ్‌గా ఉంటుంది. ఒకవేళ మీ ఫోన్‌లో ఈ ఫీచర్‌ ఎనేబుల్ చేసుందో లేదో తెలుసుకునేందుకు సెట్టింగ్స్‌లోకి వెళ్లి సెక్యూరిటీలో చూస్తే తెలిసిపోతుంది. 

బ్రౌజింగ్ భద్రత కోసం 

చాలా వరకు ఆండ్రాయిడ్ ఫోన్లలో గూగుల్ క్రోమ్‌ ఇన్‌బిల్ట్ బ్రౌజర్‌గా వస్తుంది. దీని ద్వారా బ్రౌజింగ్ చేసేప్పుడు ప్రమాదకరమైన వెబ్‌సైట్లు ఓపెన్ కాకుండా ఉండాలంటే క్రోమ్‌ బ్రౌజర్ సెట్టింగ్స్‌లో సేఫ్ బ్రౌజింగ్ మోడ్‌ను ఎనేబుల్ చేసుంచాలి. ఇందులో మీ ఫోన్‌లో క్రోమ్ బ్రౌజర్ యాప్ ఓపెన్ చేసి కుడివైపున ఉన్న మూడు డాట్‌లపై క్లిక్ చేయాలి. తర్వాత సెట్టింగ్స్‌లో ప్రైవసీ అండ్ సెక్యూరిటీ ఫీచర్‌పై క్లిక్ చేస్తే సేఫ్‌ బ్రౌజింగ్ ఫీచర్ కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేస్తే అందులో మీకు ఎన్‌హ్యాన్స్‌డ్‌ ప్రొటెక్షన్‌, స్టాండర్డ్ ప్రొటెక్షన్, నో ప్రొటెక్షన్ అని మూడు ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో నో ప్రొటెక్షన్ మినహా మిగిలిన వాటిలో ఏదో ఒక ఆప్షన్ ఎంచుకోవడం ఉత్తమం అని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.

ఎలాంటి యాప్‌లను అనుమతించాలంటే!

ఫోన్‌లో థర్డ్‌ పార్టీ యాప్‌లు డౌన్‌లోడ్ చేసిన తర్వాత అవి యూజర్ నుంచి కొన్ని రకాల అనుమతులను కోరుతాయి. ఉదాహరణకు లొకేషన్, కాంటాక్ట్స్‌, మెసేజెస్‌, ఫొటో గ్యాలరీ, కెమెరా, మైక్రోఫోన్‌తోపాటు సదరు యాప్‌ పనితీరును బట్టి కొన్ని రకాల గూగుల్ సర్వీసెస్‌ను ఉపయోగించేందుకు యూజర్‌ అనుమతించాలి. ఒకవేళ మీరు ఏదైనా యాప్‌కు అనుమతులు ఇచ్చిన తర్వాత దానిని ఉపయోగించకూడదనుకంటే ఆ యాప్‌కు జారీ చేసిన అనుమతులను రద్దు చెయ్యొచ్చు. అలానే అప్పటి వరకు యాప్‌ సేకరించిన మీ సమారాన్ని తొలగించమని సదురు యాప్‌ను కోరవచ్చు.

గూగుల్ సెక్యూరిటీ చెకప్

అలానే తరచుగా గూగుల్ సెక్యూరిటీ చెక్‌, గూగుల్ పాస్‌వర్డ్ చెక్‌ వంటివి చేస్తుంటే ఫోన్‌లోని మీ సమాచారాన్ని సురక్షితంగా ఉంచవచ్చు. గూగుల్ పాస్‌వర్డ్ సాయంతో మీరు ఉపయోగిస్తున్న గూగుల్ ఖాతాల పాస్‌వర్డ్‌లు సురక్షితమేనా కాదా అనేది తెలుసుకోవచ్చు. ఇందుకోసం password.google.com అనే వెబ్‌సైట్‌లోకి వెళ్లి check password అనే ఫీచర్ సెలెక్ట్ చేసి కింద కనిపిస్తున్న సూచనలు అనుసరిస్తే మీ పాస్‌వర్డ్ ఎంత వరకు సేఫ్ అనేది చెప్తుంది. అలానే సెక్యూరిటీ చెకప్‌ కోసం బ్రౌజర్‌లో గూగుల్ సెక్యూరిటీ చెకప్ అని టైప్ చేస్తే మీ ఖాతాతో ఎన్ని డివైజ్‌లలో లాగిన్ అయింది, చివరిగా సెక్యూరిటీ చెక్ ఎప్పుడు జరిగింది, సైన్-ఇన్  అండ్ రికవరీ సమాచారం గురించి తెలియజేస్తుంది.

Previous
Next Post »
0 Komentar

Google Tags