Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Facebook Security: Tips to Avoid Facebook Fake Accounts - Experts Words Here

 

Facebook Security: Tips to Avoid Facebook Fake Accounts - Experts Words Here

ఫేస్‌బుక్‌ నకిలీఖాతాలపై అప్రమత్తత అవసరం -జాగ్రత్తలు తీసుకోవాలంటున్న నిపుణులు

ఫేస్‌బుక్‌ ఖాతా గురించి తప్పనిసరిగా ముందుజాగ్రత్తలు తీసుకోవలసిందే. లేదంటే మీ పేరుతో నకిలీఖాతాలు సృష్టించి డబ్బులు దండుకునేందుకు సైబర్‌ నేరగాళ్లు కాచుకుని కూర్చున్నారు. నిన్న మొన్నటి వరకు పోలీస్‌ అధికారులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడేవారు. ఇప్పుడు ప్రముఖులు, సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉండే వారిని మోసగిస్తున్నట్లు సైబర్‌క్రైమ్‌ పోలీసులు తెలిపారు. రాజస్థాన్‌లోని భరత్‌పూర్, ఆల్వార్, యూపీలోని మథుర, హరియాణాలోని మేవాడ్‌ జిల్లాలకు చెందిన ముఠాలే ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నట్లు సైబరాబాద్‌ సైబర్‌ క్రైం ఏసీపీ బాలకృష్ణారెడ్డి వివరించారు. 

మరి మనమేం చేయాలి?

తమ పేరిట నకిలీ ఖాతా తెరిచిన విషయాన్ని గుర్తించిన వెంటనే కొన్ని చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పోలీసుల వరకు వెళ్లకుండానే కొన్ని ఈ మార్పులు చేయవచ్చునని తెలిపారు.

నకిలీ ఖాతా తెరచి.. ప్రొఫైల్‌ పిక్చర్‌ కింద కుడివైపు ఉన్న మూడు చుక్కల ట్యాబ్‌పై క్లిక్‌ చేయాలి.

ఆ తర్వాత కనిపించే ఆప్షన్లలో ‘ఫైండ్‌ సపోర్ట్‌ ఆర్‌ రిపోర్ట్‌ ప్రొఫైల్‌’పై క్లిక్‌ చేయాలి. ఎందుకు ఇలా చేస్తున్నారని అడిగినప్పుడు ‘ఫేక్‌ అకౌంట్‌’ అనే ఆప్షన్‌ను సెలెక్ట్‌ చేసి.. తదుపరి ప్రక్రియను పూర్తి చేయాలి.

మరో 20 మంది స్నేహితులతోనూ ఇలా చేయించాలి. అప్పుడు     ఫేస్‌బుక్‌.. దానిని నకిలీ ఖాతాగా గుర్తించి  తొలగిస్తుంది.

ఖాతా హ్యాక్‌ అయితే వెంటనే ఫేస్‌బుక్‌ ప్రతినిధి దృష్టికి   తీసుకెళ్లాలి.

ప్రొఫైల్‌లో మన ఫొటోను మార్చి వేయాలి. వెంటనే స్నేహితులందరికీ మెసేజ్‌ పెట్టాలి. ఖాతా హ్యాక్‌ అయిన విషయాన్ని తెలియజేయాలి. 

ఎలా చేస్తున్నారు? 

ఓ రాష్ట్రానికి చెందిన ఫేస్‌బుక్‌ ఖాతాలను జల్లెడ పట్టి ఎక్కువ మంది మిత్రులున్న 100 నుంచి 200 మందిని ఎంపిక చేసుకుంటున్నారు. వారి ఫొటోలు తీసుకుని ‘అబౌట్‌ ఇన్‌ఫో’ను క్లిక్‌ చేసి ఇతర వివరాలు సేకరిస్తున్నారు. వీటితో నకిలీ ఖాతా సృష్టిస్తున్నారు. తర్వాత ఆ వ్యక్తి ఫ్రెండ్స్‌ జాబితాలో ఉన్న ప్రతి ఒక్కరికీ మళ్లీ ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపిస్తున్నారు. అంగీకరించగానే రకరకాల కారణాలు చెప్పి డబ్బులు పంపించాలని అడుగుతున్నారు. అడిగింది ముఖ్యమైన వ్యక్తి కదా అని చాలా మంది డబ్బు పంపిస్తున్నారని రాచకొండ సైబర్‌క్రైమ్స్‌ ఏసీపీ ఎస్‌.హరినాథ్‌ వివరించారు.

పరువు పోతుందనే ఉద్దేశంతో  ఎక్కువమంది ఫిర్యాదు చేయడం లేదని చెప్పారు. ఈ తరహా కేసులు పోలీసులకు సవాలుగా మారాయి. ఆయా రాష్ట్రాల పోలీసులు సహాయ నిరాకరణ చేస్తుండటంతో నిందితులను అరెస్ట్‌ చేయలేకపోతున్నారు. వాళ్లను కాదని అక్కడికెళ్తే గ్రామాల పొలిమేరల్లోనే దాడులు చేయిస్తున్నారు. ముందే సమాచారం అందించి నిందితులు పారిపోయేందుకూ సహకరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. 

ముందు జాగ్రత్తలూ ముఖ్యమే..

తప్ప నిసరిగా ఫేస్‌బుక్‌ ఖాతాకు ‘ప్రొఫైల్‌ లాక్‌’ పెట్టుకోవాలి. ఇలా చేస్తే మీ ఫొటోలు/వ్యక్తిగత సమాచారాన్ని మీ స్నేహితులు తప్ప ఎవరూ చూడలేరు.

పోస్టులు/ఫొటోలను మీ స్నేహితులకు మాత్రమే కనిపించేలా ‘ప్రైవసీ సెట్టింగ్స్‌’లో మార్పులు చేసుకోవాలి.

గుర్తుతెలియని వ్యక్తులు/అప్పటికే మీ ఖాతాలో ఉన్న వ్యక్తులు ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ను పంపిస్తే అంగీకరించొద్దు

డబ్బు అడిగిన వెంటనే సదరు వ్యక్తికి సమాచారమివ్వాలి.

Previous
Next Post »
0 Komentar

Google Tags