Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Do Not share PAN Details Unnecessarily

 

Do Not share PAN Details Unnecessarily

పాన్‌ కార్డు వివరాలు బహిర్గతం చేయడం భద్రమేనా?

ఓ రిక్షా కార్మికుడికి రూ.3 కోట్లు చెల్లించాలంటూ ఇటీవల ఆదాయపు పన్ను శాఖ నోటీసులు పంపింది. తాను ఇంత మొత్తానికి పన్ను నోటీసు రావడమేంటని ముక్కున వేలేసుకోవడం ఆ బడుగు జీవి వంతైంది. అతని పేరిట గుర్తు తెలియని వ్యక్తులు ఒక్క ఏడాదిలో దాదాపు రూ.43 కోట్ల వ్యాపారం చేసినట్లు తేలింది. అంతకుముందు మూడు సంవత్సరాల క్రితం ప్రముఖ క్రికెటర్‌ అనిల్‌ కుంబ్లే సతీమణి చేతనకు సైతం ఇటువంటి అనుభవమే ఎదురైంది. ఐటీ రిటర్నుల సమయంలో తాను చేయని రూ.38 లక్షల షాపింగ్‌ తన ఖాతాలో కనిపించడంతో వెంటనే అప్రమత్తమయ్యారు.

పాన్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న చోట ఆ దుకాణాదారుడు రిక్షాకార్మికుడిని మోసం చేస్తే.. ఖరీదైన చేతిగడియారం కొనుగోలు సమయంలో సమర్పించిన పాన్‌ నెంబరును షాపువాళ్లు దుర్వినియోగం చేయడం వల్ల చేతన మోసపోయారు. ఈ రెండు సంఘటనలే కాదు. ఇలాంటి మోసాలు చాలా జరుగుతున్నాయి. పాన్‌ కార్డు వినియోగం ఇటీవల పెరిగిన నేపథ్యంలో జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం.

ఈ మధ్యకాలంలో పాన్‌ నంబర్‌ లేకుండా దాదాపు ఏ లావాదేవీ జరగడం లేదు. పేటీఎం, గూగుల్‌ పే, ఫోన్‌ పే వంటి డిజిటల్‌ యాప్స్‌ దగ్గరి నుంచి స్థిరాస్తి, కార్లు, బైక్‌ల కొనుగోలు ఇలా ప్రతిచోట పాన్‌ కార్డు అవసరం తప్పనిసరైంది. పన్ను ఎగవేతను అరికట్టడమే దీని ప్రధాన లక్ష్యం. ఒకవేళ అవసరమైన చోట పాన్‌ కార్డు వివరాలు తెలియజేయలేదంటే.. మనం ఏదైనా కీలక సమాచారాన్ని దాచిపెడుతున్నామని ఐటీ శాఖ అనుమానించాల్సి వస్తుంది. అలాగే మీకు ఎలాంటి పన్ను రాయితీ ప్రయోజనాలు కూడా లభించవు. 

పాన్‌ కార్డు వివరాలు బహిర్గతం చేయడం భద్రమేనా?

పాన్‌ అవసరం పెరగడంతో చాలా చోట్ల మనకు తెలియకుండానే పాన్‌ వివరాలు ఇచ్చేస్తున్నాం. కొన్నిసార్లు జిరాక్స్‌ షాప్‌లు, నెట్‌ సెంటర్లు.. లేదా ఇతర దుకాణాల్లో పాన్‌ జిరాక్స్‌ కాపీలను నిర్లక్ష్యంగా వదిలేస్తుంటాం. కొన్ని సందర్భాల్లో స్కానింగ్‌లకు ఇచ్చి పని పూర్తయ్యాక డిలీట్‌ చేయించకుండా వచ్చేస్తుంటాం. పైన చెప్పిన మోసాలు జరగడానికి ముఖ్య కారణం ఇదే. ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే వ్యక్తిగత వివరాలు బయటకు తెలుస్తున్నాయి. వాటిని కొంతమంది మోసగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. పైగా పాన్‌ నెంబరు తెలిస్తే.. ఆధార్‌కార్డు, పాస్‌పోర్టు, బ్యాంకు ఖాతా నెంబర్లను సైతం కూపీ లాగే అవకాశం ఉంటుంది. ఈ వివరాలు సైబర్‌ నేరగాళ్ల చేతిలో పడితే.. ఇక చెప్పాల్సిన పనే లేదు. 

ఆన్‌లైన్‌లోనూ అంత భద్రం కాదు..

మన దగ్గర భౌతికంగా ఉన్న పాన్‌కార్డును సురక్షితంగా కాపాడుకోవడం వల్ల మోసం జరగదన్న భరోసా ఏమీ లేదు. ఈ మధ్య డిజిటల్‌ లావాదేవీలు పెరిగిపోయిన నేపథ్యంలో.. ఆన్‌లైన్‌లో చాలా చోట్ల పాన్‌ కార్డు నెంబరు బహిర్గతం చేయాల్సి వస్తోంది. ఆన్‌లైన్‌లో మనం సమర్పించిన నెంబరును పొందడం సైబర్‌ నేరగాళ్లకు అసాధ్యమేమీ కాదు! రైల్వే టికెట్‌ బుకింగ్‌లో ఇచ్చిన పాన్‌ నెంబరును నగల దుకాణ యజమానులు పొంది దుర్వినియోగం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఖరీదైన నగలు కొనే సమయంలో పాన్‌ వివరాలు సమర్పించడానికి ఇష్టపడని కొనుగోలుదారుల కోసం ఇలా దొంగిలించిన పాన్‌ నెంబరును ఉపయోగించారు. ఇలా అనేక మంది సామాన్యులు తమ ఐటీ రిటర్న్స్‌లో భారీ లావాదేవీలు చూసి ఆశ్చర్యపోయారు. 

దుర్వినియోగం అవుతోందని తెలుసుకోవడం ఎలా?

మన పాన్‌ నెంబరును ఇతరులు వినియోగిస్తే.. ఆ వివరాలు ఐటీ రిటర్న్స్‌లో అప్‌డేట్‌ కావడానికి కనీసం ఆరు నెలల సమయం పడుతుంది. దీంతో వెంటనే తెలుసుకోవడం సాధ్యం కాకపోవచ్చు. అయితే, పాన్‌ కార్డుతో పాటు ఒకవేళ మన బ్యాంకు ఖాతాను కూడా దుర్వినియోగం చేసినట్లైతే అది మన బ్యాంకు ఖాతా ద్వారా వెంటనే తెలుసుకోవచ్చు. ఇక ఐటీ రిటర్న్స్‌లో ఫారం 26ఏఎస్‌ను తరచూ చెక్‌ చేసుకుంటే మన కార్డును ఏ లావాదేవీల్లో వినియోగించారో తెలిసిపోతుంది. కాబట్టి సంవత్సరానికి కనీసం రెండు లేదా మూడు సార్లు ఫారం 26ఏఎస్‌ను చెక్‌ చేసుకోవడం శ్రేయస్కరం. ఒకవేళ మీరు ఐటీ పరిధిలోకి రానట్లైతే.. అధికారులు నోటీసులు పంపినప్పుడు.. ఆ లావాదేవీ మీరు జరపలేదని నిరూపించుకోవాల్సి ఉంటుంది. 

ఎలా కాపాడుకోవాలి?

* అత్యవసరమైతే తప్ప పాన్‌ నెంబరును బహిర్గతం చేయొద్దు.

* వేరే గుర్తింపు కార్డులు సమర్పించే అవకాశం ఉన్న చోట పాన్‌ కార్డు ఇవ్వొద్దు.

* పాన్‌కార్డులను అవసరానికి మించి జిరాక్స్‌లు తీయించి వాటిపై సంతకాలు చేయొద్దు. ఒకవేళ తప్పనిసరిగా సంతకం చేయాల్సి వస్తే తేదీని వేయడం మర్చిపోవద్దు.

* ఎక్కడైనా స్కాన్‌ చేయాల్సి వచ్చినా.. పని పూర్తికాగానే మీ వివరాలను వెంటనే డిలీట్‌ చేయించండి.

* మీ బ్యాంకు ఖాతాను తరచూ చెక్‌ చేసుకోండి. మీకు తెలియకుండా ఏవైనా లావాదేవీలు జరిగితే వెంటనే అప్రమత్తమవ్వండి.

* కుటుంబసభ్యులతో తప్ప ఇతరులెవరికీ పాన్‌ వివరాలు అనవసరంగా తెలియజేయొద్దు.

* పాన్‌ కార్డు కనిపించపోతే.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి.

Previous
Next Post »
0 Komentar

Google Tags