Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Dance Choreographer Sivasankar Is No More

 

Dance Choreographer Sivasankar Is No More

ప్రముఖ నృత్య దర్శకుడు శివశంకర్‌ మాస్టర్‌ ఇక లేరు 

నృత్య దర్శకుడు, నటుడు శివశంకర్‌ మాస్టర్‌(72) ఇక లేరు. ఇటీవల కరోనా బారిన పడిన ఆయన హైదరాబాద్‌ ఏఐజీలో చికిత్స పొందుతూ ఆదివారం తుది శ్వాస విడిచారు. తమిళ, తెలుగు చిత్రాలతో సహా 10 భాషల్లోని 800లకు పైగా చిత్రాల్లో పాటలకు ఆయన నృత్యాలు సమకూర్చారు. అత్యధికంగా దక్షిణాది భాషా చిత్రాలకు పనిచేశారు. 1975లో ‘పాట్టు భరతమమ్‌’ చిత్రానికి సహాయకుడిగా కెరీర్‌ ప్రారంభించిన ఆయన ‘కురువికూడు’ చిత్రంతో నృత్య దర్శకుడిగా మారారు. కేవలం కొరియోగ్రాఫర్‌గానే కాదు, నటుడిగా వెండితెరపైనా తనదైన ముద్రవేశారు. 2003లో వచ్చి ‘ఆలయ్‌’చిత్రంతో నటుడిగా మారిన శివశంకర్‌ మాస్టర్‌ దాదాపు 30కి పైగా చిత్రాల్లో వైవిధ్య నటనతో నవ్వులు పంచారు.

బుల్లితెర పైనా తనదైన ముద్రవేశారు. పలు షోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహించారు. ఆయన వద్ద శిష్యరికం చేసిన ఎంతో మంది కొరియోగ్రాఫర్‌లు ప్రస్తుతం టాప్‌ నృత్య దర్శకులుగా కొనసాగుతున్నారు. శివశంకర్‌కు ఇద్దరు కుమారులు. విజయ్‌ శివశంకర్‌, అజయ్‌ శివశంకర్‌ ఇద్దరూ డ్యాన్స్‌ మాస్టర్లే. శివశంకర్‌ మాస్టర్‌కు మెరుగైన వైద్యం అందించడానికి సోనూసూద్‌, ధనుష్‌, చిరంజీవిలు తమవంతు సాయం చేశారు. అయినా మాస్టర్‌ ప్రాణాలు దక్కలేదు. ఆయన ఇక లేరన్న వార్తతో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. శివశంకర్‌ మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సామాజిక మాధ్యమాల వేదికగా ప్రార్థించారు. 

చిన్నప్పుడు వెన్నెముక గాయం.. ఎనిమిదేళ్లు మంచంపైనే.. 

శివశంకర్‌ మాస్టర్‌ 1948 డిసెంబరు 7న చెన్నైలో జన్మించారు. కల్యాణ సుందర్‌, కోమల అమ్మాళ్‌ తల్లిదండ్రులు. తండ్రి కొత్వాల్‌ చావిడిలో హోల్‌సేల్‌ పండ్ల వ్యాపారం చేసేవారు. శివశంకర్‌కు ఏడాదిన్నర వయసు ఉండగా, తనని వాళ్ల పెద్దమ్మ ఒడిలో కూర్చోబెట్టుకుని ఇంటి బయట అరుగుమీద కబుర్లు చెప్పుకునేవారట. ఒకరోజు అరుగు మీద కూర్చొన్న సమయంలో ఒక ఆవు తాడు తెంపుకొని రోడ్డుపైకి వచ్చింది. అది తమ మీదకు వస్తుందేమోనని శివశంకర్‌ పెద్దమ్మ భయపడి పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్లే సమయంలో గుమ్మం దగ్గర పడిపోయింది. ఆమె చేతిలో ఉన్న శివశంకర్‌ కూడా కింద పడిపోయాడు. దీంతో ఆయన వెన్నెముకకు తీవ్ర గాయమైంది. ఆ తర్వాత నెల రోజుల పాటు జ్వరం. ఏ డాక్టర్‌కు చూపించినా సరికాలేదు. అదే సమయంలో విదేశాల్లో డాక్టర్‌గా పనిచేసి మద్రాసు వచ్చిన నరసింహ అయ్యర్‌ అనే ఆయన వద్దకు శివశంకర్‌ను తీసుకెళ్లారు. ఎక్స్‌రే తీసి, వెన్నెముక విరిగిపోయిందని నిర్థారించారు. అప్పుడు ఆ డాక్టర్‌ శివశంకర్‌ తల్లిదండ్రులకు ఒక సలహా ఇచ్చారు. ‘ఈ పిల్లాడిని ఎవరి వద్దకు తీసుకెళ్లకుండా నా దగ్గర వదిలేస్తే లేచి నడిచేలా చేయగలను’ అని అన్నారు. ఆయనను నమ్మి శివశంకర్‌ తండ్రి అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. దాదాపు ఎనిమిదేళ్లపాటు శివశంకర్‌ పడుకునే ఉన్నారు. 

డ్యాన్స్‌పై మమకారం పెరిగి.. 

శివశంకర్‌కు ఎలాగైనా చదువు చెప్పించాలని ఆయన తండ్రి ట్యూషన్‌ పెట్టించారు. దీంతో శంకర్‌ నేరుగా అయిదో తరగతిలో చేరారు. అయితే, వెన్నెముక గాయం కారణంగా ఇతర పిల్లలతో ఆడుకోవటానికి అవకాశం ఉండేది కాదు. దీంతో ఇంట్లో చాలా గారాబంగా పెంచారు. అప్పట్లో ‘సభ’ అని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే సంస్థ ఉండేది. అందులో శివశంకర్‌ తండ్రి సభ్యుడు. ఆయనకు పాటలంటే ప్రాణం. నాటకాలు, డ్యాన్సులు చూడాలంటే డ్రైవర్‌ను ఇచ్చి శివశంకర్‌ను పంపేవారు. వాటిని చూసి చూసి, వాటిపై శివ శంకర్‌కు ఆసక్తి, ఎలాగైనా డ్యాన్స్‌ చేయాలన్న పట్టుదల పెరిగిపోయాయి. దాంతో తనంతట తానే డ్యాన్స్‌ నేర్చుకుని, 16 ఏళ్లు వచ్చేసరికి ట్రూప్‌ల వెంట వెళ్లి డ్యాన్సు చేయడం మొదలు పెట్టారు. అప్పటికి వెన్ను నొప్పి కూడా తగ్గిపోయింది. ఒక రోజు ఎవరో వచ్చి శివశంకర్‌ డ్యాన్సులు చేయడాన్ని వాళ్ల నాన్నకు చెప్పేశారు. అబద్ధాలు చెప్పడం శివశంకర్‌ తండ్రికి అస్సలు ఇష్టం ఉండదు. అందుకే నిజం చెప్పేశారు. చదువుకోకుండా ఇలా చేస్తున్నాడని ఇంట్లో అందరూ ఒకటే తిట్లు. ఎలాగో ఎస్సెల్సీ పూర్తి చేశారు. ‘తర్వాత ఏం చేస్తావు’ అని వాళ్ల నాన్న శివ శంకర్‌ను అడిగారు. ‘నేను డ్యాన్సు నేర్చుకుంటా’ అని చెప్పారట. ఆ తర్వాత పెద్ద పెద్ద పండితులకు శివశంకర్‌ జాతకం చూపిస్తే, ‘డ్యాన్సర్‌ అవుతాడు. వదిలెయ్‌’ అని చెప్పారట. దాంతో మద్రాసులో నటరాజ శకుంతల అనే నృత్యకారుడి వద్ద శివశంకర్‌ నృత్యం నేర్చుకున్నారు. ఆడవాళ్లు ఎలాంటి హావభావాలు పలికిస్తారు? వాటిని మగవాళ్లు ఎలా పలికిస్తారు? వంటి ఎన్నో విషయాలు పదేళ్లు శిష్యరికం చేసి నేర్చుకున్నవే. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో సలీమ్‌ దగ్గర సహాయకుడిగా చేరి కెరీర్‌ను మొదలు పెట్టిన శివశంకర్‌ మాస్టర్‌ వందల చిత్రాలకు నృత్యాలు సమకూర్చి ఎన్నో అవార్డులు అందుకున్నారు. 

ధీర ధీర’కు జాతీయ అవార్డు 

రామ్‌చరణ్‌ కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో  వచ్చిన ‘మగధీర’లో ‘ధీర ధీర’ పాటకు కొరియోగ్రఫీ అందించిన శివశంకర్‌ మాస్టర్‌ ఉత్తమ నృత్య దర్శకుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. దీంతో పాటు నాలుగు సార్లు తమిళనాడు స్టేట్‌ ఫిల్మ్‌ అవార్డులను సొంతం చేసుకున్నారు. ఇక వెండితెరపై శివశంకర్‌ మాస్టర్‌ కనపడితే చాలు నవ్వులు పూసేవి. తమిళ, తెలుగు చిత్రాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా నవ్వులు పంచారు. ‘నేనే రాజు నేనే మంత్రి’, ‘అక్షర’, ‘సర్కార్’, ‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’, ‘రాజుగారి గది3’ తదితర చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆయన మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags