Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

What's Behind the Rise in Heart Attacks Among Young People?

 

What's Behind the Rise in Heart Attacks Among Young People?

చిన్న వయసులోనే గుండెపోటు ఎందుకు వస్తుంది - గుండెపోటు లక్షణాలు - నిర్ధారించే పద్ధతులు 

ఓ వైపు టెక్నాలజీ పెరుగుతున్నది, వైద్యరంగం కొత్త పుంతలు తొక్కుతున్నది. మరోవైపు.. మనిషి ఆరోగ్యం మాత్రం అపసవ్య దిశలో పరుగెడుతున్నది. ఒకప్పుడు 60 పైబడిన వారిలో మాత్రమే గుండె సమస్యలు కనిపించేవి.నేడు, 40 ఏండ్లలోపు వారినీ హృద్రోగం మింగేస్తున్నది. చిన్నవయసులో గుండె సమస్యలకు అనేక కారణాలు. 

రక్తపోటు, మధుమేహం గుండెకు శత్రువులు... కానీ, ఇటీవలి కాలంలో ఈ రెండు సమస్యలూ లేకపోయినా గుండెపోటు బారినపడుతున్నారు చాలామంది. దీనికి ప్రధాన కారణం మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లోపించడం, వ్యాయామం లేకపోవడం. కొన్నిసార్లు మితిమీరిన కసరత్తూ ఓ కారణం కావచ్చు. యువతరం గుండెచుట్టూ కాపుకాసిన శత్రువులు ఇవే..👇 

ధూమపానం

గుండెపోటుకు గురవుతున్న ప్రతి ఐదుగురిలో ఒకరు ధూమపాన ప్రియులే. పొగవల్ల రక్తం చిక్కబడుతుంది. ఫలితంగా, గడ్డకట్టే తత్వం పెరిగిపోతుంది. మృదువుగా ఉండాల్సిన రక్తనాళాలు కఠినంగా మారుతాయి. ఫలితంగా రక్తపోటు అధికం అవుతుంది. మంచి కొలెస్ట్రాల్‌ తగ్గిపోయి, చెడు కొలెస్ట్రాల్‌ పేరుకుపోతుంది. రోగి పీల్చిన పొగ నేరుగా రక్త నాళాలను దెబ్బతీయడం వల్ల తక్షణమే రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉంది. ధూమపానం చేసే వారికి గుండెపోటు వస్తే కనుక, మందులు కూడా సమర్థంగా పనిచేయవు. స్మోకింగ్‌ మానేసిన తరువాత అయినా, గుండెపోటు రిస్క్‌ తగ్గాలంటే.. కనీసం రెండేండ్లు పడుతుంది. అసలు ధూమపానం అంటే ఏమిటో తెలియనివారి స్థాయికి గుండె ఆరోగ్యం చేరాలంటే.. 10 నుంచి 15 ఏండ్ల సమయం పడుతుంది. ఇతరులు తాగిన పొగను పీల్చడం ద్వారా కూడా గుండెపోటు రిస్క్‌ 20 నుంచి 30 శాతం పెరుగుతుంది. దీన్నే ‘పాసివ్‌ స్మోకింగ్‌’ అంటారు. 

వంశ పారంపర్యం

గుండెపోటు వంశ పారంపర్యంగా వచ్చే ఆస్కారాలూ ఉన్నాయి. తండ్రికి 55 ఏండ్ల లోపే గుండెపోటు వచ్చినా.. తల్లికి 65 ఏండ్ల లోపు గుండెపోటు వచ్చినా.. వారి సంతానానికి చిన్న వయసులోనే గుండెపోటు వచ్చే ఆస్కారం అధికం. 

కొలెస్ట్రాల్‌తో సమస్యలు

నాణ్యత లేని ఆహారంతో శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ పేరుకుపోతుంది. వ్యాయామం లేకపోవడం వల్ల మంచి కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. ఆ మేరకు చెడు కొలెస్ట్రాల్‌ అధికమైపోయి గుండెపై భారం పడుతుంది. రక్త పరీక్షల ద్వారా మాత్రమే కొలెస్ట్రాల్‌ స్థాయి నిర్ధారణ అవుతుంది. ఊబకాయుల్లోనే అధిక కొలెస్ట్రాల్‌ ఉంటుందనేది ఒక అపోహ మాత్రమే. సన్నగా ఉన్నవారిలోనూ అధిక కొలెస్ట్రాల్‌ ఉండవచ్చు. కాబట్టి, తరచూ కొలెస్ట్రాల్‌ పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. ఆహారంలో మార్పుచేర్పులు కూడా అవసరమే. 

ఆహారపు అలవాట్లు

గత పదేండ్లలో ఆహారపు అలవాట్లు చాలా మారి పోయాయి. తాజా కూరగాయలు, పండ్లు తీసుకొనే అలవాటు తగ్గిపోయింది. డీప్‌ ఫ్రై చేసిన పదార్థాలు, బేకరీ ఐటమ్స్‌, ప్రాసెస్డ్‌ ఫుడ్‌ ఆరగించడం ఫ్యాషన్‌గా మారింది. దీనివల్ల బరువు పెరుగుతున్నది. కొలెస్ట్రాల్‌, షుగర్‌ స్థాయులూ హద్దుమీరుతున్నాయి. 

అధిక బరువు, ఊబకాయం

అధిక రక్తపోటు, మధుమేహం, చెడు కొలెస్ట్రాల్‌కు ప్రధాన కారణం.. బరువు పెరగడమే. ఒక వ్యక్తి సాధారణ స్థాయి కంటే ఎక్కువ బరువు ఉన్నాడంటే దాన్ని బీపీ, షుగర్‌లకు ప్రారంభ దశగా భావించాలి. ఊబకాయం హఠాత్తుగా రాదు. బరువు క్రమంగానే పెరుగుతుంది. తొలి దశలోనే నియంత్రించడం ఉత్తమం. 

శారీరక శ్రమ లేకపోవడం

శారీరక శ్రమ తగ్గిపోయింది. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ వల్ల చాలామంది గంటల తరబడి కదలకుండా పనిచేస్తున్నారు. సమయాభావం సాకుతో హెల్త్‌ చెకప్‌లకు దూరం అవుతున్నారు. దీంతో యువతలో బీపీ, షుగర్‌, కొలెస్ట్రాల్‌ స్థాయులు పెరిగిపోతున్నాయి. అంతిమంగా గుండెపోటుకు దారితీస్తున్నాయి. 

మితిమీరిన వ్యాయామం 

సాధారణంగా, పుట్టిన ఏడాది కాలం నుంచీ ప్రతి వ్యక్తిలో కొంత మేర రక్తనాళాల్లో బ్లాకేజ్‌ ఉండటం సహజం. ఇది వయసుతో పాటు అతి నెమ్మదిగా పెరుగుతుంది. అయితే, ఆరోగ్యంపై పెద్దగా ప్రభావం చూపదు. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, జీవన శైలి ఫలితంగా ఈ బ్లాకేజ్‌ ఒక్కసారిగా తీవ్రం అవుతుంది. అంతులేని శారీరక శ్రమ, ఒత్తిడి వల్ల ప్రాణాంతకంగానూ పరిణమించవచ్చు. నిత్యం వ్యాయామం చేయకుండా, ఒకేసారి మితిమీరిన కసరత్తుకు సిద్ధపడితే గుండె మీద భారం పడుతుంది. అది గుండెపోటుకు దారితీసే ఆస్కారం ఉంది.. జిమ్‌ వర్కవుట్స్‌తో హృదయ స్పందన అకస్మాత్తుగా పెరిగిపోతుంది. ఫలితంగా రక్తనాళాలు నిమిషాల్లోనే 40 నుంచి 100 శాతం మేర బ్లాక్‌ అవుతాయి. దీంతో, గుండెపోటు వస్తుంది. 

మానసిక ఒత్తిడి

గతంలో కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉండేది. కరోనా కాలం నుంచీ ప్రతి ఇల్లూ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌తో బిజీబిజీగా కనిపిస్తున్నది. మినీ ఆఫీసుగా మారుతున్నది. ఇంట్లో నుంచే పనిచేస్తుండటంతో సేదతీరే అవకాశమూ లేకుండా పోయింది. దీంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నది యువత. కుటుంబ, ఆర్థిక సమస్యలు, ఉద్యోగ అభద్రత, ఆలూమగల బంధాలకు బీటలు.. తదితర కారణాల వల్ల మానసిక రుగ్మతలు అధికం అవుతున్నాయి. ఈ ‘సైకాలజికల్‌ స్ట్రెస్‌’ కూడా గుండెపోటుకు ఓ కారణమే. 

మాదక ద్రవ్యాల వినియోగం

యువత డ్రగ్స్‌కు బానిస అవుతున్నది. గుండెపోటుకు గురవుతున్న నలభై ఏండ్లలోపు వారిలో మాదక ద్రవ్యాలు తీసుకుంటున్నవారి సంఖ్య తక్కువేం కాదు. మత్తు పదార్థాల వల్ల్ల రక్తనాళాలు కుంచించుకుపోతాయి. గుండెకు రక్త సరఫరా మందగించి గుండెపోటుకు దారి తీస్తుంది. 

రక్తనాళాలు చితికిపోవడం

రక్తనాళాలు తీవ్రంగా దెబ్బతినడం వల్ల కూడా గుండెపోటు వస్తుంది. కాకపోతే, రక్తనాళాలు చితికిపోవడం లేదా పగిలిపోవడం చాలా అరుదైన పరిణామం. దీనికి కచ్చితమైన కారణాలు చెప్పలేం. స్త్రీ, పురుషులు ఇద్దరికీ ఈ ప్రమాదం పొంచి ఉంది. 

గుండెపోటు లక్షణాలు

75 శాతం యువతలో గుండెపోటుకు ముందు ఛాతీ నొప్పి రాదు. నేరుగా గుండెపోటే వచ్చేస్తుంది.

కొందరిలో ఛాతీ మధ్య భాగంలో మంటగా, బిగుతుగా, బరువుగా ఉంటుంది.

ఈ సమస్య ఎడమ చేతికి లేదా గొంతుకు పాకుతుంది.

చెమటలు పట్టడం, వాంతులు కావడం వంటి లక్షణాలూ కనబడవచ్చు.

చాలా సందర్భాల్లో ఈ లక్షణాలను గ్యాస్ట్రిక్‌ లేదా కండరాల సమస్యగా పొరబడే అవకాశం ఉంది. తక్షణం దవాఖానకు వెళ్లకపోతే గుండెకు రక్త సరఫరా తగ్గిపోయి ఆకస్మిక మరణం సంభవించవచ్చు.

బాధితులను 3 నుంచి 4 గంటల్లో హాస్పిటల్‌కు తీసుకెళ్తే, కోలుకునే అవకాశాలు ఎక్కువ.

తరచూ ఛాతీ నొప్పి వస్తే పరీక్షలు చేయించుకుని కారణాలను నిర్ధారించుకోవాలి.ధూమపాన ప్రియులు, ఊబకాయులు, వంశ పారంపర్య చరిత్ర ఉన్నవారి విషయంలో మరింత జాగ్రత్త అవసరం. 

నిర్ధారించే పద్ధతులు

ఈసీజీ ద్వారా గుండె సమస్యను గుర్తించవచ్చు. కొంతమందికి మొదటిసారి చేసే ఈసీజీలో సమస్య బయటపడదు. ఈసీజీ సాధారణంగా ఉందంటే సమస్య లేదని కాదు అర్థం. రెండుమూడుసార్లు తీస్తే అందులో సమస్య బయటపడే ఆస్కారం ఉంది. ఎకో, ట్రోపోనిన్‌ పరీక్షలు చేయించుకోవాలి. 

చికిత్సా పద్ధతులు

యువతలో సాధారణంగా ఒకే బ్లాక్‌ ఉంటుంది. అదే వయోధికులలో మల్టిపుల్‌ బ్లాక్స్‌ ఉంటాయి. నిపుణులు రక్తనాళాల్లో ఏర్పడిన బ్లాక్‌ ఆధారంగా స్టెంట్‌ వేస్తారు.

రక్తం పలుచబడే ఇంజక్షన్లతో కూడా చికిత్స ఇస్తారు. కానీ ఛాతీ నొప్పి వచ్చిన మూడు గంటల్లోపు ఇస్తేనే ఫలితం ఉంటుంది. 12 గంటలు గడిచాక ఈ చికిత్స సమర్థంగా పనిచేయదు.

బ్లడ్‌ థిన్నర్‌ ఇంజక్షన్‌ తీసుకున్న తరువాత రోగికి కచ్చితంగా ఆంజియోగ్రామ్‌ చేయించాలి. అవసరమైతే బైపాస్‌ సర్జరీ చేయాల్సి ఉంటుంది. 

గుండెపోటు రాకుండా ఉండాలంటే:

ధూమపానం మానేయాలి.

తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవాలి.

తీపి, ఉప్పు, నెయ్యి తగ్గించాలి.

రెడ్‌ మీట్‌ (బీఫ్‌, పోర్క్‌, మటన్‌) తగ్గించాలి.

వనస్పతి నూనెతో చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి.

ప్రాసెస్డ్‌, ప్యాకేజ్‌ ఫుడ్స్‌ తినకూడదు.

బరువు పెరగకుండా జాగ్రత్తపడాలి.

రోజూ కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్‌, జాగింగ్‌ లేదా స్విమ్మింగ్‌ చేయాలి. వారంలో ఐదు రోజులు ఏదో ఓ వ్యాయామం తప్పనిసరి.

మధుమేహం, కొలెస్ట్రాల్‌ నియంత్రణలో పెట్టుకోవాలి.

ఎప్పటికప్పుడు బీపీ పరీక్షించుకోవాలి.

ఆకస్మిక వ్యాయామాలు, మితిమీరిన శారీరక శ్రమ వద్దే వద్దు.

యోగా, ధ్యానం దినచర్యలో భాగం చేసుకోవాలి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం.

Previous
Next Post »
0 Komentar

Google Tags