Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

India beats England to win record fifth ICC Under-19 World Cup

 

India beats England to win record fifth ICC Under-19 World Cup

భారత్‌కు అయిదో అండర్‌-19 ప్రపంచకప్‌ -ఫైనల్లో ఇంగ్లాండ్‌పై 4 వికెట్ల విజయం

 

బవా ఆల్‌రౌండ్‌ మెరుపులు -రాణించిన రవి, రషీద్‌, నిశాంత్‌

ప్రపంచకప్‌లో అడుగు పెట్టినప్పటి నుంచి ట్రోఫీయే లక్ష్యంగా అడుగులేస్తూ.. ఎదురొచ్చిన  ప్రతి ప్రత్యర్థినీ దంచి కొడుతూ ముందంజ వేసిన యువ భారత్‌.. ఫైనల్లోనూ ప్రతాపం చూపింది. తనలాగే అజేయంగా ఫైనల్‌కు దూసుకొచ్చిన ఇంగ్లాండ్‌ను ఓడించి సిసలైన విజేత అనిపించుకుంది. పేలవ ఆరంభం నుంచి పుంజుకుని ఇంగ్లాండ్‌.. పోటీనిచ్చినా మన కుర్రాళ్ల పట్టుదల ముందు నిలవలేకపోయింది. భారత్‌కిది అయిదో అండర్‌-19 ప్రపంచకప్‌. చివరగా యువ జట్టు 2018లో కప్పు గెలిచింది. 

అండర్‌-19 ప్రపంచకప్‌ మళ్లీ భారత్‌ ఖాతాలో చేరింది. వెస్టిండీస్‌ ఆతిథ్యమిచ్చిన 2022 టోర్నీలో జైత్రయాత్రను కొనసాగిస్తూ ఫైనల్లో భారత్‌ 4 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌పై విజయం సాధించింది. శనివారం టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లిష్‌ జట్టు 44.5 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది. పేసర్లు రాజ్‌ బవా (5/31), రవికుమార్‌ (4/34) ఆ జట్టును దెబ్బ తీశారు. జేమ్స్‌ ర్యూ (95; 116 బంతుల్లో 12×4) గొప్ప ఇన్నింగ్స్‌ ఆడాడు. జేమ్స్‌ సేల్స్‌ (34 నాటౌట్‌; 65 బంతుల్లో 2×4) అతడికి సహకారమందించాడు. అనంతరం ఆంధ్రా కుర్రాడు షేక్‌ రషీద్‌ (50; 84 బంతుల్లో 6×4)తో పాటు నిశాంత్‌ సింధు (50 నాటౌట్‌; 54 బంతుల్లో 5×4, 1×6), రాజ్‌ బవా (35: 54 బంతుల్లో 2×4, 1×6) సత్తా చాటడంతో లక్ష్యాన్ని భారత్‌ 47.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 

రెండో బంతికే వికెట్‌: ఛేదనలో భారత్‌కు ఆరంభంలోనే పెద్ద షాక్‌ తగిలింది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్‌ రఘువంశీ (0) ఇన్నింగ్స్‌ రెండో బంతికే వెనుదిరిగాడు. అయితే సెమీస్‌లో అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన గుంటూరు కుర్రాడు షేక్‌ రషీద్‌.. హర్నూర్‌ (21), యశ్‌ ధుల్‌ (17)లతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. అయితే సేల్స్‌ (2/51).. స్వల్ప వ్యవధిలో రషీద్‌, ధుల్‌లను ఔట్‌ చేసి ఇంగ్లాండ్‌ను పోటీలోకి తెచ్చాడు. మ్యాచ్‌ ఎటైనా మొగ్గేలా కనిపించిన దశ అది. ఈ స్థితిలో నిశాంత్‌, బవా నిబ్బరం ప్రదర్శించారు. కుదురుగా ఆడి లక్ష్యాన్ని కరిగిస్తూ వచ్చిన ఈ జోడీ.. ఆఖర్లో జోరు పెంచింది. దీంతో భారత్‌ లక్ష్యం వైపు పరుగులు పెట్టింది. విజయానికి ఇంకో 26 పరుగులు అవసరమైన స్థితిలో బవా ఔటైనా.. తంబె (1) కూడా కాసేపటికే వెనుదిరిగినా.. బానా (13 నాటౌట్‌)తో కలిసి నిశాంత్‌ పని పూర్తి చేశాడు. 

వందైనా చేస్తుందా అనుకుంటే..: మొదట ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌ ఆరంభమైన తీరు చూస్తే ఆ జట్టు వంద చేసినా గొప్పే అనిపించింది. పేస్‌కు అనుకూలించిన పిచ్‌ను ఉపయోగించుకుంటూ రాజ్‌ బవా, రవికుమార్‌ రెచ్చిపోవడంతో ఆ జట్టు టాప్‌, మిడిలార్డర్‌లు వణికిపోయాయి. రవికుమార్‌ ఆరంభంలోనే అత్యంత కీలకమైన రెండు వికెట్లు తీసి ఇంగ్లాండ్‌ను గట్టి దెబ్బ కొట్టాడు. టోర్నీలో మంచి ఫామ్‌లో ఉన్న బెతెల్‌ (2), ప్రెస్ట్‌ (0)లను అతను వరుస ఓవర్లలో ఔట్‌ చేశాడు. ఈ దశలో థామస్‌ (27; 30 బంతుల్లో 4×4, 1×6) భారత బౌలర్లపై ఎదురు దాడికి ప్రయత్నించాడు. అతడికి జేమ్స్‌ తోడవడంతో ఇంగ్లాండ్‌ కోలుకున్నట్లే కనిపించింది. కానీ రాజ్‌ బవా.. ప్రత్యర్థిని మామూలుగా దెబ్బ తీయలేదు. ముందుగా ఊపుమీదున్న థామస్‌ను అతను ఔట్‌ చేశాడు. తన తర్వాతి ఓవర్లో బవా వరుస బంతుల్లో రెండు వికెట్లు పడగొట్టాడు. లక్స్‌టన్‌ (4), బెల్‌ (0) మీదికి దూసుకొస్తున్న బంతులను ఆడబోయి వికెట్ల వెనుక దొరికిపోయారు. కాసేపు నిలిచిన రెహాన్‌ అహ్మద్‌ (10) సైతం బవాకే వికెట్‌ ఇచ్చేయడంతో ఇంగ్లాండ్‌ 61/6తో పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే జేమ్స్‌.. మొత్తం కథ మార్చేశాడు. కాసేపు హార్టన్‌ (10) అండతో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దిన అతడికి.. తర్వాత పేస్‌ బౌలర్‌ సేల్స్‌ తోడయ్యాడు. వీళ్లిద్దరూ 18.4 ఓవర్లలో 93 పరుగులు జోడించారు. సెంచరీకి అత్యంత చేరువగా వచ్చిన జేమ్స్‌.. చివరికి రవికుమార్‌ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయి పెవిలియన్‌ చేరాడు. ఈ వికెట్‌ పడ్డాక ఇంగ్లాండ్‌ను చుట్టేయడానికి ఎంతో సమయం పట్టలేదు.

BRIEF SCORE DETAILS 

ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌: జేమ్స్‌  95; సేల్స్‌ నాటౌట్‌ 34; మొత్తం:(44.5 ఓవర్లలో ఆలౌట్‌) 189;

బౌలింగ్‌: రవికుమార్‌ 9-1-34-4; రాజ్‌ బవా 9.5-1-3-5;

భారత్‌ ఇన్నింగ్స్‌: రషీద్‌ 50; నిశాంత్‌ నాటౌట్‌ 50; బవా బోడెన్‌ 35; మొత్తం: (47.4 ఓవర్లలో 6 వికెట్లకు) 195;

బౌలింగ్‌: బోడెన్‌ 7-1-24-2; సేల్స్‌ 7.4-0-51-2; అస్పిన్‌వాల్‌ 9-0-42-2;

Previous
Next Post »
0 Komentar

Google Tags