Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

PMJJBY: Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana – All the Details Here

 

PMJJBY: Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana – All the Details Here

పీఎమ్ జేజేబీవై: ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన – పూర్తి వివరాలు ఇవే

మనం ఎంతగానో ప్రేమించే వ్యక్తి మరణిస్తే.. ఆ బాధ నుంచి కోలుకునేందుకు చాలా సమయం పడుతుంది. ఒకవేళ ఆ వ్యక్తి కుటుంబానికి మూలధారమైన వ్యక్తి అయితే ఆ బాధకు ఆర్థిక ఇబ్బందులు తోడవుతాయి. జీవిత బీమా ఉంటే కొంత వరకు ఆర్థిక సమస్యలను నుంచి బయటపడొచ్చు. అందువల్లే ప్రతి ఒక్కరికీ జీవిత బీమా ఉండాలని ఆర్థిక నిపుణులు సూచిస్తుంటారు.

అయితే బీమా ప్రీమియం చెల్లించలేకనో, అవగాహన లేకపోవడం వల్లనో చాలా మంది ఇంతటి ప్రాధాన్యం ఉన్న జీవిత బీమాకు దూరంగానే ఉంటున్నారు. దీంతో వారి కుటుంబాలకు ఆర్థిక భద్రత ఉండటం లేదు. ఈ కారణం వల్లే జీవిత బీమా సామాన్యులకు సైతం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో నామమాత్రపు ప్రీమియంతో కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి జీవన్ జ్యో తి బీమా యోజన (PMJJBY)ను 2015 బడ్జెట్లో ప్రవేశపెట్టింది.

పీఎమ్ జేజేబీవై ప్రభుత్వ మద్దతు గల ప్యూర్ టర్మ్ పాలసీ. ఏ కారణం చేతనైనా పాలసీదారుడు మరణిస్తే కుటుంబానికి హామీ మొత్తం అందజేస్తుంది. ఈ పథకం ఒక సంవత్సరం కాలపరిమితితో వస్తుంది. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ప్రీమియం చెల్లించి పథకాన్ని పునురుద్ధరించుకోవచ్చు. లైఫ్ ఇన్సురెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో పాటు దాదాపు అన్ని జీవిత బీమా సంస్థలు ఈ పథకాన్ని అందిస్తున్నాయి. ఈ పథకం బ్యాంకుల వద్ద కూడా అందుబాటులో ఉంది.

ఎవరు అర్హులు..?

• 18 నుంచి 50 సంవత్సరాల వయసు వారికి పాలసీ అందుబాటులో ఉంటుంది. బ్యాంకులో పొదుపు ఖాతా ఉన్న వారెవరైనా ఈ పథకంలో చేరవచ్చు.

ఇందుకోసం బ్యాంకు ఖాతాను ఆధార్‌తో అనుసంధానించాల్సి ఉంటుంది. కేవైసీ చేయించడం తప్పనిసరి.

ఒకవేళ ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ పొదుపు ఖాతాలు ఉంటే ఏదో ఒక పొదపు ఖాతా ఉన్న బ్యాంకు నుంచి మాత్రమే పథకానికి నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ రెండింటి ద్వారా నమోదు చేసుకుని ప్రీమియం చెల్లించినప్పటికీ ఒకటి మాత్రమే పరిగణనలోకి తీసుకుని హామీ చెల్లిస్తారు.

• 55 సంవత్సరాల వరకు జీవిత బీమా పొందేందుకు వీలుంటుంది. కానీ 50 ఏళ్లలోపు వారు మాత్రమే నమోదు చేసుకునే వీలుంది. ఆ తర్వాత అనుమతించరు.

ఉదా: ఒక వ్యక్తి 25 సంవత్సరాల వయసులో పాలసీ తీసుకుంటే 55 సంవత్సరాల వరకు అంటే 30 సంవత్సరాల పాటు రిస్క్ కవరేజ్ కోసం పథకాన్ని పునరుద్ధరించుకోవచ్చు. ఒకవేళ 50 సంవత్సరాల వయసులో పాలసీ తీసుకుంటే, 55 సంవత్సరాల వరకు అంటే మరో ఐదేళ్లు మాత్రమే రిస్క్ కవరేజ్ పొందేందుకు వీలుంటుంది.

నమోదు.. కాలవ్యవధి..

ఈ పథకం ఒక సంవత్సరం కాలపరిమితితో వస్తుంది. జూన్ 1 నుంచి మే 31 వరకు అమల్లో ఉంటుంది. తర్వాత ఏడాదికి పునరుద్ధరించుకోవాలనుకునే వారు మే 31న ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ పథకాన్ని మధ్యలో ప్రారంభించినప్పటికీ.. ఖాతాదారుడు అభ్యర్ధించిన తేదీ నుంచి ప్రారంభమై మే31తో కవరేజ్ , ముగుస్తుంది. తర్వాతి ఏడాది నుంచి జూన్ 1 నుంచి మే 31 వరకు అమల్లో ఉంటుంది. ఈ పథకంలో కొత్తగా చేరితే.. నమోదు చేసిన 45 రోజుల తర్వాత మాత్రమే బీమా వర్తిస్తుంది. దురదృష్టవశాత్తూ ఎవరైనా చనిపోతే వారి నామినీలు 30 రోజుల్లోగా పాలసీ ఉన్న బ్యాంకు శాఖను సంప్రదించి క్లెయిమ్ కోసం దాఖలు చేసుకోవచ్చు.

DOWNLOAD APPLICATION FORM

ప్రీమియం ఎంత?

ఈ పథకం ప్రీమియంను ప్రభుత్వం ఇటీవలే పెంచింది. ప్రస్తుతం వర్తించే ప్రీమియం ఏడాదికి రూ. 436. 2015లో పథకాన్ని ప్రారంభించినప్పుడు కేవలం రూ.330 ప్రీమియంతోనే అందించేవారు. ఈ పథకం దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న ప్రతికూలతలను దృష్టిలో ఉంచుకుని ప్రీమియంను రూ.330 నుంచి రూ. 436కి పెంచినట్లు ఇటీవలే ప్రభుత్వం ప్రకటించింది. పెంచిన ప్రీమియం రేట్లు జూన్ 1, 2022 నుంచి అమల్లోకి వచ్చాయి.

ఈ పథకానికి సంబంధించి ఒకే వాయిదాలో ప్రీమియం మొత్తం చెల్లించాలి. కొత్తగా ప్రారంభించే వారికి.. మొదటి ఏడాది మాత్రం కవరేజ్ వర్తించే కాలానికి అనుగుణంగా ప్రీమియం వర్తిస్తుంది. అంటే పథకంలో కొత్తగా జాయిన్ అవుతున్నప్పుడు.. మీరు జాయిన్ అయ్యే నెలలను అనుసరించి ప్రీమియం ఉంటుంది. ఒకవేళ జూన్- ఆగస్టు మధ్య కాలంలో ఈ పథకంలో చేరితే ఆ ఏడాదికి రూ. 436, సెప్టెంబరు-నవంబరు మధ్య కాలంలో చేరితే రూ.349, డిసెంబరు-ఫిబ్రవరి నెలల మధ్య చేరితే రూ. 228, మార్చి-మే నెలల మధ్య కాలంలో చేరితే రూ.114 ప్రీమియం చెల్లించాలి. ఆ తర్వాత నుంచి సంవత్సరానికి రూ. 436 ప్రీమియం చెల్లించాలి. ప్రతి ఏడాది మే 31 ప్రీమియం చెల్లించాలి. కాబట్టి ఈ పథకంలో జాయిన్ అయిన వారు ప్రీమియం మొత్తాన్ని ప్రతి ఏడాదీ ఖాతా నుంచి ఆటోమేటిగ్గా తీసుకునేందుకు బ్యాంకులను అనుమతించాలి.

జాయింట్ ఖాతా విషయంలో...

బ్యాంకులు ఖాతాదారులకు ఉమ్మడిగా ఖాతాను తీసుకునే వీలుకల్పిస్తున్నాయి. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది కూడా ఉమ్మడిగా ఖాతాను తీసుకునే వీలుంది. అలా జాయింట్ ఖాతా తీసుకున్న వారు కూడా ఈ పథకంలో చేరొచ్చు. అయితే ఎవరికి వారు పథకంలో చేరాల్సి ఉంటుంది. అంటే జాయిట్ ఖాతాదారులందరూ విడివిడిగా వార్షిక ప్రీమియంలు చెల్లించాలి.

హామీ మొత్తం:

పాలసీదారుడు మరణిస్తే రూ.2 లక్షల హామీ మొత్తాన్ని నామినీకి అందజేస్తారు. ఇది ప్యూర్ టర్మ్ పాలసీ. అందువల్ల మెచ్యూరిటీ ప్రయోజనాలు ఉండవు. పాలసీదారుడు మరణించినప్పుడు మాత్రమే లబ్ధిదారుని హామీ మొత్తం చెల్లిస్తారు. ఈ పాలసీ ప్రీమియం చెల్లించిన ఏడాదికి మధ్యలో నిలపివేయడం గానీ, వెనక్కి ఇచ్చేయడం గానీ సాధ్యం కాదు.

మధ్యలోనే నిష్క్రమిస్తే..?:

వ్యక్తి ఏదైనా కారణంగా ఈ పథకం నుంచి మధ్యలోనే నిష్క్రమిస్తే, వార్షిక ప్రీమియం చెల్లించడం ద్వారా తిరిగి చేరవచ్చు.

ఎప్పుడు రద్దవుతుంది?

ఈ పథకంలో చేరిన సభ్యుడు 55 సంత్సరాల వయసుకు చేరినప్పుడు

ప్రీమియం చెల్లింపులకు.. తగినంత బ్యాలెన్స్ ఖాతాలో నిర్వహించనప్పుడు

వివిధ బ్యాంకుల్లో నుంచి బీమా తీసుకున్నప్పుడు, వివిధ బ్యాంకుల ద్వారా ఒకటి మించి పాలసీలు తీసుకున్నప్పటికీ కవరేజ్ మాత్రం రూ.2 లక్షలకే పరిమితం అవుతుంది. ఇతర బ్యాంకుల కవరేజ్ ను రద్దు చేస్తారు. ప్రీమియం మొత్తాన్ని జప్తు చేస్తారు.

చివరిగా: ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సి పథకం. ప్రీమియం రేట్లు పెరిగినా.. ఇప్పటికీ నామమాత్రపు ప్రీమియం అనే చెప్పాలి. ఏడాదికి రూ. 436 అంటే.. రోజుకు 1.20 పైసలు, నెలకు రూ.36 చొప్పున పడుతుంది.

Previous
Next Post »
0 Komentar

Google Tags