Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Rafael Nadal lifts French Open 2022 - Wins a Record 14th Roland Garros and Total 22nd Grand Slam

 

Rafael Nadal lifts French Open 2022 - Wins a Record 14th Roland Garros and Total 22nd Grand Slam

ఫ్రెంచ్ ఓపెన్-2022 విజేత నాదల్ - అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ల (22) రికార్డు ను కొనసాగిస్తున్న నాదల్‌

నాదల్‌ ఫ్రెంచ్ ఓపెన్‌లో సరికొత్త చరిత్రను లిఖించాడు. జకోవిచ్‌, రోజర్ ఫెదరర్‌లను ఇంతకుముందు దాటుకుని టెన్నిస్‌ ప్రపంచంలో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లను కైవసం చేసుకున్న నాదల్, ఇప్పుడు మరో గ్రాండ్‌స్లామ్‌ గెలిచి వాళ్లిద్దరికి రెండు టైటల్స్ ఎక్కువ తో రికార్డు సృష్టించాడు. ప్రస్తుత తన 14వ  ఫ్రెంచ్ ఓపెన్‌ టైటిల్‌తో నాదల్‌  గ్రాండ్‌స్లామ్‌ల సంఖ్య 22కి చేరింది.

తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన రఫా ఆదివారం జరిగిన ఫైనల్లో 6-3, 6-3, 6-0తో నార్వే కుర్రాడు కాస్పర్ రూడ్ పై అలవోకగా విజయం సాధించాడు. రెండో సెట్లో కాసేపు మినహాయిస్తే రఫా జోరు ముందు రూడ్ తేలిపోయాడు. మ్యాచ్ లో నాదల్ 37 విన్నర్లు కొట్టగా.. రూడ్ 16 విన్నర్లే కొట్టాడు. నాదల్ కేవలం 18 అనవసర తప్పిదాలు చేయగా.. రూడ్ 26 అనవసర తప్పిదాలతో దెబ్బతిన్నాడు. మ్యాచ్ లో అయిదో సీడ్ నాదల్ మొత్తం ఎనిమిది బ్రేక్ లు సాధించగా.. ఎనిమిదో సీడ్ రూడ్ రెండు సార్లు మాత్రమే రఫా సర్వీసును బ్రేక్ చేయగలిగాడు. నాదల్ తొలిసారి 19 ఏళ్ల వయసులో, 2005లో ఇక్కడ విజేతగా నిలిచాడు. రొలాండ్ గారోస్ లో 115 మ్యాచ్ ల్లో కేవలం మూడుసార్లు మాత్రమే ఓడిపోయాడంటే అతడి ఆధిపత్యం ఎలా సాగుతోందో అర్ధం చేసుకోవచ్చు. అదే ఫైనల్లోనైతే ఒక్కసారి కూడా ఓడిపోలేదు. ఎవరూ కూడా నాదల్ (14 ఫ్రెంచ్ టైటిళ్లు) కన్నా ఎక్కువసార్లు ఓ గ్రాండ్ స్లామ్ టోర్నీలో విజేతగా నిలవలేదు. ఇతర దిగ్గజాలు ఫెదరర్, జకోవిచ్ కన్నా అతడిప్పుడు రెండు టైటిళ్లు ముందున్నాడు. రఫా తన తొలి టైటిల్ ను కూడా జూన్ 5 (2005)నే సాధించడం విశేషం. ప్రస్తుత టోర్నీలో అతడు మూడు సెట్లు మాత్రమే కోల్పోయాడు.

నాదల్ జోరు: క్లే కింగ్ నాదల్, తొలిసారి గ్రాండ్ స్లామ్ ఫైనల్ చేరిన రూడ్ మధ్య మ్యాచ్ ఆసక్తికరంగా మొదలైంది. బ్రేకులే, బ్రేకులు. తొలి నాలుగు గేముల్లో మూడు సార్లు సర్వీస్ ప్రొవైంది. అయితే ఎప్పటిలాగే నాదల్ దే పైచేయి. తొలి గేమ్ లో అలవోకగా సర్వీసును నిలబెట్టుకున్న నాదల్.. రెండో గేమ్ లో చెలరేగిపోయాడు. నెట్ దగ్గరికి వచ్చి దూరంగా బంతిని స్మాష్ చేసి బ్రేక్ పాయింట్ సాధించిన అతడు.. ఓ కళ్లు చెదిరే క్రాస్ కోర్ట్ షాట్ తో ప్రత్యర్థి సర్వీసును బ్రేక్ చేసి 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. కానీ మూడో గేమ్ లో తడబడ్డాడు. నాదల్ వరుసగా రెండు డబుల్ ఫాల్ట్ చేయడంతో 40-15తో ఆధిక్యంలోకి వెళ్లిన రూడ్.. అవకాశాన్ని ఉపయోగించుకుని బ్రేక్ సాధించాడు. అయితే అతడి సంతోషం ఎంతో సేపు నిలవలేదు. నెట్ దగ్గరికి దూసుకొస్తూ రూడ్ దూకుడు ప్రదర్శించినా.. అనవసర తప్పిదాలు చేశాడు. ఫలితంగా నాదల్ నాలుగో గేమ్ లో బ్రేక్ సాధించాడు. అక్కడి నుంచి అలవోకగా సర్వీసు నిలబెట్టుకుంటూ సెట్ ను చేజిక్కించుకున్నాడు.

కానీ రెండో సెట్లో రూడ్ పుంజుకున్నాడు. మరింత ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. అదే సమయంలో నాదల్ లో కాస్త దూకుడు తగ్గింది. నాదల్ డబుల్ ఫాల్ట్ ను సొమ్ము చేసుకుంటూ నాలుగో గేమ్ లో బ్రేక్ సాధించిన రూడ్.. 3-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. కానీ చిత్రంగా మ్యాచ్ లో అతడు గెలిచిన చివరి గేమ్ అదే. వెనుకబడడానికి ఇష్టపడని నాదల్ బలంగా పుంజుకున్నాడు. మామూలుగా కాదు. నిర్దాక్షిణ్యంగా చెలరేగిన అతడు వరుసగా 11 గేములు నెగ్గి ఛాంపియన్ షిప్ ను చేజిక్కించుకున్నాడు. నాదల్ బలమైన ఫోర్ హ్యాండ్, బ్యాక్ హ్యాండ్ షాట్లతో దూసుకుపోతుంటే.. రూడ్ నుంచి కనీస ప్రతిఘటనే కరవైంది.

నాదల్ చక్కని క్రాస్ కోర్టు షాట్లూ ఆడాడు. రూడ్ సర్వీసులు తేలిపోయాయి. వరుసగా అయిదు గేములతో రెండో సెట్ ను చేజిక్కించుకున్న నాదల్.. మూడో సెట్లో మరింత రెచ్చిపోయాడు. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. అలవోకగా సర్వీసు నిలబెట్టుకున్న అతడు.. రెండు, నాలుగు, ఆరో గేముల్లో బ్రేక్ సాధించి మ్యాచ్ ను ముగించాడు.

Previous
Next Post »
0 Komentar

Google Tags