Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

What Are Cloudbursts, And Why They Occur

 

What Are Cloudbursts, And Why They Occur

ఏమిటీ క్లౌడ్ బరస్ట్..? ఎప్పుడు, ఎక్కడ సంభవిస్తాయి..? ఎలా ఏర్పడుతాయి..? భారత్ లో గతంలో చోటుచేసుకున్నాయా..?

ఇటీవల అమర్‌నాథ్ శివలింగం సమీపంలో సంభవించినట్లు భావిస్తోన్న క్లౌడ్ బరస్ట్ తో (Cloudburst) 16మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. స్వల్ప సమయంలోనే భారీ వరదలకు కారణమయ్యే ఈ ప్రకృతి వైపరీత్యాన్ని (National Disaster) ముందస్తుగా అంచనా వేయడం కూడా ఓ సవాల్ అని చెప్పవచ్చు. కుంభవృష్టితో ప్రాణ, ఆస్తి నష్టాలకు దారితీసే ఈ ప్రతికూల వాతావరణ స్థితిని ఎదుర్కోవడం దాదాపు అసాధ్యమే. అయితే, తాజాగా దేశంలో పలుచోట్ల భారీ వర్షాలు, వరదలకు క్లౌడ్ బరస్టు కారణమనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.అసలు క్లౌడ్ బరస్ట్ (Cloud burst) అంటే ఏమిటీ..? వీటికి కారణాలేంటి అనే విషయాలను ఓసారి చూద్దాం.

ఏమిటీ క్లౌడ్ బరస్ట్..?

భారత వాతావరణశాఖ (IMD) ప్రకారం, సాధారణంగా అతి స్వల్ప సమయంలో భారీ వర్షాలకు దారితీయడాన్నే మేఘాల విస్ఫోటము లేదా క్లౌడ్ బరస్ట్ గా (Cloud burst) వ్యవహరిస్తారు. ముఖ్యంగా 20 నుంచి 30చ.కి.మీ పరిధిలో గంటకు 10 సెం.మీ (100మి. మీ) వర్షపాతం నమోదవుతుంది. ఒక్కోసారి ఉరుములు, పిడుగులతో ఊహించని స్థాయిలో కురిసే ఈ భారీ వర్షాలు ఆకస్మిక వరదలకు దారితీస్తాయి. స్వల్ప పరిధిలో రెండు గంటల వ్యవధిలోనే 5 సెం.మీ, అంతకంటే ఎక్కువ వర్షపాతం నమోదైతే కూడా దాన్ని మినీ క్లౌడ్ బరస్ట్ గా వ్యవహరిస్తారు. అయితే, అన్ని క్లౌడ్ బరస్టు (Cloudburst) భారీ వర్షాలకు దారి తీస్తాయి.. కానీ, స్వల్ప సమయంలో సంభవించే భారీ వర్షాలన్నింటినీ క్లౌడ్ బరస్ట్ గా పరిగణించలేం. కొన్ని వాతావరణ పరిస్థితులు ఉంటేనే వాటిని క్లౌడ్ బరస్ట్ గా పరిగణిస్తారు.

ఎప్పుడు, ఎక్కడ సంభవిస్తాయి..?

క్లౌడ్ బరస్ట్ (Cloudburst) ఎప్పుడు సంభవిస్తుందనే విషయాన్ని కచ్చితంగా అంచనా వేయడం కష్టమేనని చెప్పవచ్చు. దేశంలో సంభవించే క్లౌడ్ బరస్ట్ పైనా ఇప్పటివరకు తక్కువ సమాచారమే ఉంది. తక్కువ పరిధిలో కుంభవృష్టి సృష్టించే అవకాశం ఉండటంతో అవి ఏ ప్రాంతంలో సంభవిస్తాయనే విషయాన్ని కచ్చితంగా ఎవరూ చెప్పలేరు. అవి ఎక్కువగా ఎత్తైన ప్రదేశాల్లోనే చోటుచేసుకుంటాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ముఖ్యంగా వర్షాకాలం సమయంలో హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, ఉత్తరాఖండ్ వంటి ఎత్తైన ప్రదేశాల్లో వాతావరణ మార్పుల వల్ల ఇవి అకస్మాత్తుగా సంభవిస్తుంటాయి. 

ఎలా ఏర్పడుతాయి..?

రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించినప్పుడు అరేబియా సముద్రం నుంచి తేమతో కూడిన గాలులు వీస్తాయి. ఇవి పర్వత ప్రాంతాల్లో ప్రయాణిస్తున్నట్లు అధిక తేమను కలిగి ఉంటాయి. అయితే, వర్షం పడే స్థితి ఏర్పడినప్పటికీ వేడి వాతావరణం వల్ల మేఘాలు ఘనీభవించడం కొనసాగుతూనే ఉంటుంది. ఇలా ఘనీభవన ప్రక్రియ పలుసార్లు కొనసాగడంతో మేఘాలు సాంద్రత పెరిగి (బరువెక్కి) ఏదో ఒక సమయంలో ఒక్కసారిగా విస్పోటము చెందుతాయి. దీంతో తక్కువ పరిధిలో, తక్కువ సమయంలోనే కుంభవృష్టి కురిసి భారీ వరదలకు కారణమవుతాయి.

భారత్ లో గతంలో చోటుచేసుకున్నాయా..?

భారీ ప్రాణ, ఆస్తి నష్టాలకు దారితీసే ఈ క్లౌడ్ బరస్టు భారత్ లో చోటుచేసుకుంటూనే ఉన్నాయి. కేవలం హిమాలయ ప్రాంతాల్లోనే ఏటా పదుల సంఖ్యలో క్లౌడ్ బరస్టు సంభవిస్తున్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

భారత వాతావరణశాఖ గణాంకాల ప్రకారం, 1970 నుంచి 2016 వరకు 30 క్లౌడ్ బరస్టులు సంభవించాయి. 2002లో ఉత్తరాంచల్ లో సంభవించిన కుంభవృష్టికి 28 మంది బలయ్యారు. ఆకస్మిక వరదల దాటికి పలు గ్రామాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. తాజాగా అమర్నాథ్ గుహ వద్ద జరిగిన క్లౌడ్ బరస్ట్ కారణంగా వరదలు సంభవించాయి. ఆ విషాద ఘటనలో 16 మంది మృత్యువాతపడటంతోపాటు పదుల సంఖ్యలో యాత్రికులు గాయాలపాలయ్యారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags