Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Veteran Director ‘Kalatapasvi’ K. Viswanath Biography

 

Veteran Director ‘Kalatapasvi’ K. Viswanath Biography

కళాతపస్వి కే. విశ్వనాథ్ గారి జీవిత చరిత్ర

=====================

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో అపురూప చిత్రాలను అందించిన దిగ్గజ దర్శకుడు, కళాతపస్విగా పేరొందిన కే. విశ్వనాథ్ గురించిన విషయాలు తెలుసుకుందాం.

బాల్యం, చదువు & ఇండస్ట్రీ లోకి అడుగులు

కె.విశ్వనాథ్ స్వస్థలం బాపట్ల జిల్లా రేపల్లెలోని పెద పులివర్రు గ్రామం. 1930 ఫిబ్రవరి 19న కాశీనాథుని సుబ్రహ్మణ్యం, సరస్వతమ్మ దంపతులకు విశ్వనాథ్ జన్మించారు. గుంటూరు హిందూ కళాశాలలో ఇంటర్మీడియట్, ఆంధ్రా క్రిస్టియన్ కళాశాలలో బీఎస్సీ పూర్తి చేశారు. ఆయన తండ్రి చెన్నైలోని విజయవాహినీ స్టూడియోలో పనిచేసేవారు. దీంతో విశ్వనాథ్ డిగ్రీ పూర్తవగానే అదే స్టూడియోలో సౌండ్ రికార్డిస్ట్ గా  సినీజీవితాన్ని ప్రారంభించారు. తొలిసారి పాతాళభైరవి సినిమాకు అసిస్టెంట్ రికార్డిస్ట్ గా పనిచేశారు. 1965లో 'ఆత్మగౌరవం' సినిమాకు దర్శకుడిగా అవకాశం లభించింది. తొలి చిత్రానికే ఆయనకు నంది అవార్డు అందుకున్నారు. తెలుగు చిత్రపరిశ్రమకు ఎనలేని గౌరవాన్ని తీసుకొచ్చిన ఆయన 50కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ 9 చిత్రాలకు విశ్వనాథ్ దర్శకత్వ బాధ్యతలు వహించారు. ఎన్నో చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు.

ఆణిముత్యాలాంటి సినిమాలు

సాగర సంగమం, స్వాతిముత్యం, సిరిసిరిమువ్వ, శ్రుతిలయలు, సిరివెన్నెల, ఆపద్బాంధవుడు, శంకరాభరణం లాంటి ఆణిముత్యాలను తెలుగు చిత్రసీమకు అందించారు. ఎందరో అగ్రకథానాయకుల చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించి... ఎన్నో అవార్డులను అందుకున్నారు. సినీ రంగంలో ఆయన కృషికి 2016లో చిత్ర పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. 1992లో రఘుపతి వెంకయ్య అవార్డు, అదే ఏడాదిలో పద్మశ్రీ పురస్కారాలను అందుకున్నారు. ఇక విశ్వనాథ్ చిత్రాల్లో ఎంతో పేరుగాంచిన స్వాతిముత్యం సినిమా ప్రఖ్యాత ఆస్కార్ (59వ) చిత్రాల బరిలో నిలిచింది. ఆసియా పసిఫిక్ చలన చిత్ర వేడుకల్లో స్వాతిముత్యం, సాగరసంగమం, సిరివెన్నెల చిత్రాలు ప్రదర్శితమయ్యాయి. మాస్కోలో జరిగిన చలన చిత్ర వేడుకల్లో స్వయంకృషి సినిమా ప్రదర్శితమైంది. స్వరాభిషేకం చిత్రానికి ప్రాంతీయ విభాగంలో జాతీయ పురస్కారం దక్కింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆయనను గౌరవ డాక్టరేట్ తో గౌరవించింది.

శంకరాభరణం’ విడుదల అయిన రోజే.. 

ఆయన చిత్రాల్లో ఈ 'శంకరాభరణం' చిత్రానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. 1980 ఫిబ్రవరి 2న విడుదలైన ఈ చిత్రం తెలుగు చిత్రపరిశ్రమలో ఒక సంచలనం. సంగీతమే ప్రాధాన్యంగా వచ్చిన ఈ చిత్రం కమర్షియల్ హంగులు లేకున్నా అత్యంత ప్రజాదరణ పొందింది. ఈ చిత్రానంతరమే కె. విశ్వనాథ్ "కళాతపస్వి'గా పేరుపొందారు. అయితే 'శంకరాభరణం' విడుదలైన రోజే ఆయన శివైక్యం చెందడం బాధాకరం.

ఆస్కార్ కు నామినేట్ అయిన స్వాతిముత్యం..

మొదటి చిత్రంతోనే మంచి పేరుతెచ్చుకున్న కాశీనాథుని విశ్వనాథ్ ఆ తర్వాత వరుసగా చెల్లెలి కాపురం, ఓ సీత కథ, కాలం మారింది, నేరము శిక్ష, శారద, జీవనజ్యోతి చిత్రాలకు దర్శకత్వం వహించారు. అప్పటివరకు ఓ మూసలో వెళుతున్న తెలుగు చిత్రాలకు విశ్వనాథ్ ఓ కొత్త దిశను చూపారు. సిరిసిరిమువ్వ చిత్రంతో విశ్వనాథ్ తెలుగు చిత్రపరిశ్రమకు తన విశ్వరూపం చూపారు. సంస్కృతిని చాటి చెప్పేందుకు సినిమాలే సరైన మాధ్యమమని విశ్వనాథ్ భావించేవారు. ఇక తెలుగు సినీ చరిత్రలో శంకరాభరణం ఓ సువర్ణ అధ్యాయాన్ని లిఖించింది. ఇక శుభసంకల్పం చిత్రంతో ఆయన తొలిసారి నటుడిగా మారారు. తెలుగు, తమిళ భాషల్లో 30 చిత్రాల వరకు నటించారు. కమల్, విశ్వనాథ్ కలయికలో వచ్చిన స్వాతిముత్యం (1985) చిత్రానికి మహిళా ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు. ఆస్కార్ కి  నామినేట్ అయిన తొలి తెలుగు చిత్రంగా స్వాతిముత్యం ఘనతకెక్కింది.

మరణం - ‘శంకరాభరణం’ విడుదల అయిన రోజే పరమపదించిన కాశీనాథుని విశ్వనాథ్

కాశీనాథుని విశ్వనాథ్ వృద్ధాప్య సమస్యలతో ఫిబ్రవరి 2, 2023 న తీవ్ర అస్వస్థత గురయ్యారు. కుటుంబసభ్యులు జూబ్లీహీల్స్ లోని అపోలో ఆసుపత్రికి తరలించగా... అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

=====================

CLICK FOR PDF COPY OF BIOGRAPHY

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags