Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Bhagat Singh: The Socialist Revolutionary Freedom Fighter



Bhagat Singh: The Socialist Revolutionary Freedom Fighter
విప్లవ చైతన్యానికి మారుపేరు.. భగత్ సింగ్
భారతజాతిని దాస్యవిముక్తి గావించడానికి... పరదేశీయులైన బ్రిటీష్ అధికార  సేనలకు దీటైన సవాలు విసిరి.. యువ పోరాటయోధుడై..
భగత్ సింగ్.. మండే అగ్ని గోళం. జ్వలించే నిప్పుకణిక. రెపరెపలాడే విప్లవ పతాక. భగత్ సింగ్ పేరు వింటేనే ప్రతి భారతీయుడి రోమాలు నిక్కబొడుచుకుంటాయి. 23 ఏళ్ల వయసులోనే దేశ స్వాతంత్య్రం కోసం పోరాడి ఉరి కొయ్యను ముద్దాడాడు. మార్చి 23, 1931 రాత్రి 7.30 గంటలకి తన స్నేహితులయిన విప్లవ యోధులు సుఖ్ దేవ్, రాజ్ గురులతో పాటు అసువులు బాశాడు. నిరంకుశ బ్రిటిష్ ప్రభుత్వం వారి ముగ్గురినీ వరుసగా నిల్చోబెట్టి ఉరి తీసింది. ఉరి కొయ్య ముందు నిల్చుని కూడా ఆ ముగ్గురూ ఏ మాత్రం భయపడలేదు. ఆ ధైర్యమే ప్రవాహంలా మారి తరువాతి తరాలకు చేరింది.

భగత్ సింగ్ ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్న పంజాబ్ ప్రాంతంలోని ఖత్కర్ కలాన్ అనే గ్రామంలో 1907, సెప్టెంబరు 28న జన్మించాడు. అతని తల్లిదండ్రులు కిషన్ సింగ్, విద్యావతి. భగత్ సింగ్ తాత అర్జున్ సింగ్ స్వామి దయానంద సరస్వతికి అనుచరుడు. అలాగే హిందూ సంస్కరణ ఉద్యమంలోనూ పాల్గొన్నాడు. అతని ప్రభావం భగత్‌పై బాగా ఉండేది. పదమూడేళ్ల ప్రాయంలో మహాత్మాగాంధీ సహాయ నిరాకరణోద్యమం కూడా భగత్ పై విపరీత ప్రభావం చూపింది. ప్రత్యక్షంగా ఆ స్వాతంత్య్ర పోరాటంలో మొదటిసారి పాల్గొన్నాడు. ప్రభుత్వ పుస్తకాలను, దుస్తులను తగులబెట్టాడు. అయితే గాంధీ చేపట్టిన అహింసా ఉద్యమం వల్లే కాకుండా, హింసాత్మక ఉద్యమంతో కూడా బ్రిటిష్ వారి ఆగడాలకు చెక్ పెట్టాలన్న ఆలోచనలో ఉండేవాడు. 1919లో జరిగిన జలియన్ వాలా బాగ్ దురంతం అతనిలో బ్రిటిష్ వారి పట్ల కోపాన్ని మరింత పెంచింది.

యుక్త వయసుకు వచ్చాక లాహోర్‌లోని నేషనల్ కాలేజీలో చేరాడు. అప్పుడే అతనికి పెళ్లి చేసేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. దీంతో భగత్ ఓ ఉత్తరం రాసి ఇంటి నుంచి పారిపోయాడు. ఆ ఉత్తరంలో నా జీవితం దేశానికి అంకితం చేయాలనుకుంటున్నాను. నాకు ఇంకే కోరిక లేదు అని రాశాడు. ఇంటి నుంచి పారిపోయి నవ జవాన్ భారత సభ అనే సంఘం లో చేరాడు. ఆ సంఘం ద్వారా యువకులను ఆకర్షించి స్వాతంత్య్రోద్యమ సాధనకు పురికొల్పాడు. అనంతరం హిందూస్థాన్ గణతంత్ర సంఘంలోనూ చేరాడు. అక్కడే అతనికి సుఖ్ దేవ్ పరిచయమయ్యాడు. ఇద్దరు అనతి కాలంలోనే ఆ సంఘానికి నాయకులయ్యారు. బ్రిటిష్ ప్రభుత్వంపై హింసాత్మక ఉద్యమానికి సిద్ధమయ్యారు. అదే సమయంలో సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా దేశంలో సైమన్ గో బ్యాక్ ఉద్యమాన్ని స్వాతంత్య్ర ఉద్యమకారులు. అందులో భాగంగా లాహోర్‌లో లాలా లజపతి రాయ్ బ్రిటిష్ సాయుధ బలగాలను ఎదురొడ్డి నిలిచారు. సూపరింటెండెంట్‌గా సాండర్స్ లాఠీతో లాలా లజపతిరాయ్ పై విరుచుకుపడ్డాడు. తల పగలగొట్టాడు, ఛాతీపైనా గాయమంది.

పంజాబ్ కేసరి నేల కొరిగాడు. అతని మరణం భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురులలో ఆగ్రహాన్ని నింపింది. చెమర్చిన కళ్లతోనే సాండర్స్ అంతు చూశారు. కసి తీరా కాల్చి చంపారు. ఆ హత్యకు కారణమైన వారిని ఉరితీయాలని బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించింది. అనంతరం 1929లో అసెంబ్లీపై బాంబులు విసిరారు. ఆ సంఘటనలో ఎవరూ గాయపడలేదు. అనంతరం ముగ్గురు లొంగిపోయారు. దేశం నుంచి బహిష్కరణకు గురయ్యారు. అనంతరం వారిపై బ్రిటిష్ ప్రభుత్వం సాండర్స్ హత్యా నేరం మోపింది. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్‌దేవ్‌లు నేరాన్ని ఒప్పుకున్నారు. కోర్టులో బ్రిటిష్ వ్యతిరేక నినాదాలు చేశారు. కోర్టు వారికి ఉరిశిక్ష విధించింది.

ఉరి కంబాన్ని ఎక్కే కొద్ది రోజుల ముందు భగత్ సింగ్ తన మాతృమూర్తితో ఇలా అన్నారు. ‘నేను చనిపోతే దేశానికి అదో ఉత్పాతంగా మిగిలిపోతుంది. నేను నవ్వుతూ మృత్యువుని అల్లుకుంటే భారతదేశంలో వున్న మాతృమూర్తులు అందరూ తమ బిడ్డలు భగత్ సింగ్‌లా కావాలని కోరుకుంటారు. బలీయమైన స్వాతంత్య్ర కాంక్ష వున్న సమరయోధులు అసంఖ్యాకంగా ఉద్భవిస్తారు. అప్పుడే విప్లవ యోధులు సాగిస్తున్న పోరాటాన్ని నిలువరించడం దుష్ట శక్తులకు సాధ్యం కాదు. అప్పుడు భగత్ సింగ్ తల్లి ఇలా స్పందించారు “ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు చనిపోవలసిందే. గొప్ప మరణం అనేది ఎలా వుంటుంది అంటే ప్రపంచమంతా ఆ మరణం గురించే చెప్పుకుంటుంది” అని. తన బిడ్డ ఉరి కొయ్యని ముద్దాడే ముందు చివరిసారి ఇచ్చిన నినాదం ఇంక్విలాబ్ జిందాబాద్. ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ ఆ ముగ్గురు యోధులు ఉరి కొయ్యను ముద్దాడారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags