Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: Inter weightage lifting in EAMCET

 


TS: Inter weightage lifting in EAMCET

ఎంసెట్‌లో ఇంటర్‌ వెయిటేజీ ఎత్తివేత!  ప్రభుత్వానికి ప్రతిపాదన పంపిస్తాం - ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ పాపిరెడ్డి  

ఎంసెట్‌లో ఇంటర్‌ మార్కులకు ఉన్న 25% వెయిటేజీని ఎత్తివేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదన పంపిస్తామని రాష్ట్ర ఉన్నతవిద్యామండలి ఛైర్మన్‌ పాపిరెడ్డి వెల్లడించారు. ఎంసెట్‌ అగ్రికల్చర్‌ ఫలితాల విడుదల సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ, ఏపీ ఇంటర్‌ బోర్డుల నుంచి ఉత్తీర్ణులైన విద్యార్థులతోపాటు సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌సీ, సార్వత్రిక విద్యాపీఠం, నేషనల్‌ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ తదితర వాటిల్లో ఇంటర్‌ లేదా అందుకు సమానమైన విద్యార్హతతో ఉత్తీర్ణులైన వారు ఎంసెట్‌కు హాజరవుతున్నారు. ఆయా బోర్డులు సకాలంలో మార్కులు పంపకపోవడం వల్ల ఎంసెట్‌ ర్యాంకుల కేటాయింపులో సమస్యలు వస్తున్నాయి.

ఈ పరిస్థితి పునరావృతం కాకుండా ఏమి చేయబోతున్నారన్న ప్రశ్నకు పాపిరెడ్డి జవాబిచ్చారు. ఇంటర్‌ మార్కులకు 25 శాతం వెయిటేజీ తొలగిస్తే ఇలాంటి సమస్యలు రావని, దానిపై ప్రభుత్వానికి జేఎన్‌టీయూహెచ్‌తో కలిపి ఉన్నత విద్యామండలి ప్రతిపాదన పంపుతుందన్నారు. జేఈఈ మెయిన్‌లో గతంలో ఇంటర్‌ మార్కులకు 40 శాతం వెయిటేజీ ఉండేదని, పలు బోర్డులతో సమస్య వస్తోందని భావించి దాన్ని 2015లోనే తొలగించారని చెప్పారు. తాము నిపుణులతో చర్చించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామన్నారు.

తొలగింపు సాధ్యమేనా?

ప్రస్తుతం ఎంసెట్‌లో మార్కులకు 75 శాతం, ఇంటర్‌లో మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి ర్యాంకులు కేటాయిస్తున్నారు. ఇంటర్‌లో ప్రధాన సబెక్జులు(600 మార్కులు)లో వచ్చిన మార్కులను 25 శాతానికి కుదించి వెయిటేజీ లెక్కిస్తారు. ఎంసెట్‌లో 160 మార్కులకు వచ్చిన మార్కులను 75 శాతానికి కుదించి... రెండింటిని కలిపి స్కోర్‌ రూపొందించి...ర్యాంకు ఇస్తారు. రాష్ట్రంలో ఎంసెట్‌ వల్ల కోచింగ్‌ సంస్కృతి పెరుగుతోందని, ఇంటర్‌ చదువు నిర్లక్ష్యానికి గురవుతోందని భావించిన ప్రభుత్వం తగిన సిఫార్సుల కోసం ఐఐటీ కాన్పూర్‌ ఆచార్యుడు, జేఎన్‌టీయూహెచ్‌ మాజీ ఉపకులపతి దయారత్నం కమిటీని 2008లో నియమించింది. ఇంటర్‌ విద్య నిర్లక్ష్యానికి గురికాకుండా... ఏటా 25 శాతం వెయిటేజీ పెంచుకుంటూ నాలుగేళ్లలో పూర్తిగా ఇంటర్‌ మార్కుల ఆధారంగా ఎంసెట్‌ సీట్లు భర్తీ చేయాలని ఆ కమిటీ సిఫార్సు చేసింది. ఆ ప్రకారం 2010 నుంచి 25 శాతం వెయిటేజీ అమలు చేసినా...ఆ తర్వాత పెంచలేదు. జేఈఈ మెయిన్‌లో 40 శాతం వెయిటేజీ ఇచ్చి...ఆ తర్వాత రెండేళ్లలోనే 2015 నుంచి దాన్ని ఎత్తివేశారు. ఇప్పుడు ఎంసెట్‌లో ఎత్తివేయాలని ప్రతిపాదిస్తామని ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ పాపిరెడ్డి వెల్లడించడం చర్చనీయాంశమైంది.

ఇవీ కొన్ని సమస్యలు

* ఇంటర్‌ వెయిటేజీ ఎత్తివేస్తే ఇంటర్‌ చదువును నిర్లక్ష్యం చేసే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే పాఠ్య పుస్తకాలు చదివేవారు తగ్గిపోయారు. కోచింగ్‌పై ఆధారపడతారని నిపుణులు అంటున్నారు.

* ప్రస్తుతం ఎసెంట్‌లో ఓసీలు, బీసీలు 25 శాతం మార్కులు(160కి 40) తెచ్చుకుంటేనే అర్హత సాధించినట్లు. ఎస్‌సీ, ఎస్‌టీలకు కనీస అర్హత మార్కులు లేవు. అంటే ఎంసెట్‌లో సున్నా మార్కులు వచ్చినా ఇంటర్‌ మార్కుల ఆధారంగా ర్యాంకు ఇస్తారు. ఇప్పుడు వెయిటేజీ తొలగిస్తే వారికి సమస్య అవుతుంది. ఎంసెట్‌లో సున్నా మార్కులు వచ్చి ర్యాంకులు పొందేవారు ఏటా అయిదు, పది మంది మాత్రమే ఉంటారు’ అని జేఎన్‌టీయూహెచ్‌ ఆచార్యుడు ఒకరు చెప్పారు.

* 2019 నుంచి పాలిసెట్‌లో ఎస్‌సీ, ఎస్‌టీలకు కనీస అర్హత మార్కు ఒకటిగా నిర్ణయిస్తూ సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ నిర్ణయించారు.దానివల్ల ఒకరిద్దరే ర్యాంకులు పొందలేకపోతున్నారు. ఎంసెట్‌లోనూ అదే పరిస్థితి ఉంటుందని మరో ఆచార్యుడు అభిప్రాయపడ్డారు.

* ఇంజినీరింగ్‌లో ప్రవేశాలకు రాష్ట్రానికో పరీక్ష లేకుండా జేఈఈ మెయిన్‌లో చేరతారా? అని కేంద్రం 2017లో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను అడిగింది. మెయిన్‌లో మైనస్‌ మార్కులు ఉంటాయి. ఎంసెట్‌లో రుణాత్మక మార్కులు లేకుంటేనే కొందరికి సున్నా మార్కులు వస్తున్నాయని, మైనస్‌ మార్కులుంటే ఎంతో మంది నష్టపోతారన్న అభిప్రాయాన్ని కొందరు వ్యక్తంచేస్తున్నారు.

Previous
Next Post »
0 Komentar