Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Healthy Drinks During Your Daily Yoga Time

 

Healthy Drinks During Your Daily Yoga Time

యోగా చేసే సమయంలో - తాగవలసిన ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

కరోనా మహమ్మారి సృష్టించిన విలయంతో ఇప్పుడు అందరి దృష్టి వ్యాయామం, యోగా సాధనపై పడింది. ఇన్నాళ్లూ వాటి గురించి పెద్దగా పట్టించుకోనివారు కూడా అంతర్జాలంలో వెతికి మరీ యోగాసనాలు సాధన చేస్తున్నారు. యోగా వల్ల శారీరకంగానూ, మానసికంగానూ ఎన్నో ప్రయోజనాలున్నాయి. వ్యాధినిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అయితే ప్రతిరోజూ యోగా చేసేటప్పుడు కొన్ని ఆహార నియమాలు కూడా పాటిస్తే మరింత ఫలితముంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. యోగా సమయంలో చెమట రూపంలో చాలా నీరు బయటకుపోయి, డీ హైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉంది. అలా కాకుండా ఉండాలంటే కొన్ని రకాల ద్రవపదార్థాలను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

1. గోల్డెన్‌ మిల్క్‌ 

గోల్డెన్‌ మిల్క్‌ అనగానే ఇదేదో బంగారం కలిపిన పాలు తాగాలేమోనని భయపడకండి. కప్పు పాలలో ఓ టీ స్పూను పసుపు వేసి బాగా మరిగించాలి.  ఆ తర్వాత కాస్త చల్లార్చి కొంచెం తేనెను కలిపి తాగాలి. ఇలా చేయడం వల్ల సాధారణ పాలకంటే ఎక్కువ ప్రభావం ఉంటుంది. అలర్జీ లాంటి సమస్యలు దరిచేరవు. బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఓ చక్కని మార్గం. గోల్డెన్‌ మిల్క్‌ వల్ల కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు ఉన్నవారికి కూడా ఎంతో ప్రయోజనం ఉంటుంది. 

2. అల్లం టీ 

మనలో చాలామందికి ఉదయాన్నే టీ తాగే అలవాటు ఉంటుంది. అయితే జీర్ణక్రియ చక్కగా జరగాలంటే ఉదయాన్నే కప్పు అల్లం టీ తీసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బాగా కడిగి శుభ్రం చేసిన చిన్న అల్లంముక్కను 5 నిమిషాలపాటు వేడి నీటిలో మరగబెట్టి,  చెంచా తేనె వేసుకొని తాగితే జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. యోగా ప్రారంభించడానికి  కనీసం 30 నిమిషాల ముందు అల్లం టీ తీసుకుంటే మంచిది. 

3. మామిడి రసం 

వీలైతే రోజుకు కనీసం గ్లాసు మామిడి జ్యూస్‌ను తాగడం వల్ల శరీరం డీ హైడ్రేషన్‌కు గురికాకుండా జాగ్రత్త పడొచ్చు. అంతేకాకుండా క్యాన్సర్‌ నుంచి రక్షణ పొందేందుకు మామిడి రసం ఉపయోగపడుతుంది. ఏడాది పొడవునా మామిడి పళ్లు దొరక్కపోయినా.. విరివిగా దొరికే వేసవిలోనైనా వీలైనంత వరకు ఈ రసం తాగడం ఉత్తమం. ఇందులోని విటమిన్‌-సి వల్ల రక్తం శుభ్రపడుతుంది. ఎర్రరక్తకణాలు ఉత్పత్తి అయ్యేందుకు దోహదపడుతుంది. 

4. ఉసిరి రసం 

భారత్‌లో ఉసిరికాయలు విరివిగా దొరుకుతాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఫలితంగా వ్యాధి నిరోధకత పెరుగుతుంది. ఓ ఉసిరికాయను చిన్న చిన్న ముక్కలుగా కోసి, మిక్సీలో వేసి జ్యూస్‌గా తయారు చేయాలి. రుచికోసం కొంచెం తేనే లేదా పంచదార వేసుకున్నా ఫర్వాలేదు. రోజులో కనీసం ఒక్కసారైనా ఈ జ్యూస్‌ తాగితే ఉత్తమ ఫలితాలుంటాయి. అయితే ఫలానా సమయంలోనే తాగాలన్న నిబంధనేమీ లేదు. రోజులో ఎప్పుడైనా తాగొచ్చు.

5. కొబ్బరి నీళ్లు 

కొబ్బరినీళ్లతో శరీరానికి ఎంతో మేలని అందరూ చెబుతుంటారు. యోగా సాధన చేస్తున్నవారు రోజుకు కనీసం గ్లాసు కొబ్బరి నీళ్లు తీసుకుంటే మంచిది. శరీరానికి అవసరమైన పోషకాలు ఇందులో ఉంటాయి. మెగ్నీషియం, మాంగనీస్‌, పొటాషియం, సోడియం, కాల్షియం లాంటి ఖనిజ లవణాలు కొబ్బరి నీళ్లలో సమృద్ధిగా ఉంటాయి. 

6. కలబంద రసం 

కలబంద ఎడారి జాతికి చెందిన మొక్క. దీనికి ఆకులు ఉండవు. కాండంలోనే నీటిని నిల్వ ఉంచుకుంటుంది. జిగురుగా ఉండే ఆ పదార్థాన్ని జ్యూస్‌ చేసుకొని తాగితే ఎంతో ఫలితం ఉంటుంది. జీర్ణక్రియను వృద్ధి చేయడంతోపాటు  హార్మోన్లను సమతాస్థితిలో ఉంచుతుంది. ఫలితంగా బరువు అదుపులో ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి ఇది తోడ్పడుతుంది. ఈ రసం తాగడం వల్ల ప్రత్యుత్పత్తి వృద్ధి చెందుతుందని నమ్ముతారు. 7. వెలగ పండు రసం 

వేసవిలో డీ హైడ్రేషన్‌ నుంచి తప్పించుకునేందుకు సరైన ఔషధం వెలగపండు రసం. చర్మాన్ని నాజూగ్గా, ప్రకాశవంతంగా తయారు చేస్తుంది. అంతేకాకుండా మలబద్ధకం నివారించడానికి తోడ్పడుతుంది. పొట్టలో అల్సర్లు రాకుండా కాపాడుతుంది. అందువల్ల ఈ విపత్కర పరిస్థితుల్లో యోగా సాధన చేయడం ఎంత ముఖ్యమో.. దానికి అనుగుణంగా ఆరోగ్యకరమైన ఆహార నియమాలూ పాటించడం అంతే ముఖ్యం.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం.

Previous
Next Post »
0 Komentar

Google Tags