Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Telugu-origin Sirisha Bandla to join Richard Branson on Virgin Galactic's next flight to space

 

Telugu-origin Sirisha Bandla to join Richard Branson on Virgin Galactic's next flight to space

అంతరిక్షంలోకి తెలుగు మూలాలున్న మహిళ - జులై 11న వర్జిన్‌ గెలాక్టిక్‌ అంతరిక్ష నౌక ప్రయోగం

అంతరిక్షంలోకి తొలిసారిగా తెలుగు మూలాలున్న మహిళ అడుగుపెట్టబోతున్నారు. జులై 11న అమెరికాకు చెందిన వర్జిన్‌ గెలాక్టిక్‌ సంస్థ అంతరిక్ష వాహక నౌకను ప్రయోగించనుంది. తొలిసారిగా నలుగురు ప్రయాణికులతో వెళ్లనున్న ఈ వాహకనౌకలో భారత సంతతికి చెందిన శిరీష బండ్ల కూడా ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. వర్జిన్‌ గెలాక్టిక్‌ ప్రభుత్వ వ్యవహారాల ఉపాధ్యక్షురాలి హోదాలో ఉన్న ఆమె అంతరిక్ష యానం చేయనున్నారు. 

అంతరిక్ష పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు గానూ వర్జిన్‌ గెలాక్టిక్ ఈ ప్రయోగం చేపట్టనుంది. అంతరిక్షంలోకి ప్రయాణికులను తీసుకెళ్లేందుకు ఈ కంపెనీకి జూన్‌ 25న ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ లైసెన్సు జారీ చేసింది. దీంతో ఈ నెల 11న న్యూ మెక్సికో నుంచి ఈ స్పేస్‌ఫ్లైట్‌ బయల్దేరనుంది. వర్జిన్‌ గెలాక్టిక్‌ చేపడుతున్న నాలుగో అంతరిక్షయానం ఇది. అయితే ప్రయాణికులను తీసుకెళ్లడం ఇదే తొలిసారి అని కంపెనీ వెల్లడించింది. జులై 11న ప్రయోగించే వాహక నౌకలో ఇద్దరు పైలట్లతో పాటు వర్జిన్‌ గెలాక్టిక్‌ అధిపతి రిచర్డ్‌ బ్రాన్సస్‌, మరో ముగ్గురు కంపెనీ ప్రతినిధులకు అంతరిక్షంలోకి వెళ్లే అవకాశం లభించింది. అందులో ఒకరు శిరీష బండ్ల కాగా.. చీఫ్‌ ఆస్ట్రోనాట్‌ ఇన్‌స్ట్రక్టర్‌ బెత్‌ మోసెస్‌, లీడ్‌ ఆపరేషన్స్‌ ఇంజినీర్‌ కాలిన్‌ బెన్నెట్‌ అంతరిక్ష యానం చేయనున్నారు.

శిరీష బండ్ల ఆంధ్రప్రదేశ్‌లో జన్మించారు. ఆ తర్వాత కుటుంబంతో కలిసి అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ప్రస్తుతం ఆమె వాషింగ్టన్‌లో నివసిస్తున్నారు. అంతరిక్షంలోకి వెళ్తోన్న తొలి తెలుగు మూలాలున్న మహిళ ఈమే కావడం విశేషం. అంతకుముందు భారత్‌కు చెందిన కల్పనా చావ్లా, భారత సంతతికి చెందిన సునితా విలియమ్స్‌ అంతరిక్షంలో అడుగుపెట్టారు.

అపర కుబేరుడు, అమెజాన్‌ అధిపతి జెఫ్‌ బెజోస్‌ అంతరిక్ష ప్రయాణం చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల 20న ఆయన తన సంస్థ బ్లూ ఆరిజిన్‌  ప్రయోగించే వాహక నౌక ద్వారా అంతరిక్షంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఆయనకు పోటీగా వర్జిన్‌ గెలాక్టిక్‌ ఈ ప్రయోగం చేపట్టినట్లు తెలుస్తోంది. అంతేగాక, బెజోస్‌ వెళ్లే తేదీ కంటే 9 రోజుల ముందుగానే ఈ ప్రయోగం జరగనుంది.

Previous
Next Post »
0 Komentar

Google Tags