Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Five Warning Signs of Wrong Usage of Credit Cards

 

Five Warning Signs of Wrong Usage of Credit Cards

క్రెడిట్‌ కార్డు తప్పుగా వాడుతున్నామని తెలుసుకునేందుకు ఐదు సంకేతాలు ఇవే

క్రెడిట్‌ కార్డు అత్యవసర సమయాల్లో ఓ వరమనే చెప్పాలి. అదే సమయంలో ఆర్థిక క్రమశిక్షణ లేకపోతే.. దీని వల్ల నష్టాలూ అదే స్థాయిలో ఉంటాయి. తద్వారా మన రుణ చరిత్ర కూడా దెబ్బతింటుంది. కాబట్టి మనం వాటిని ఎలా ఉపయోగించుకుంటున్నాము అనేదే ముఖ్యమైన అంశం. ఓ ఐదు సంకేతాలు మనం కార్డుని తప్పుడు మార్గంలో వినియోగిస్తున్నామని తెలియజేస్తాయి.

1. తరచూ కనీస మొత్తం చెల్లించడం

నెలలో వినియోగించుకున్న మొత్తాన్ని చెల్లించడానికి కొన్నిసార్లు వీలు కాదు. అలాంటప్పుడు కనీస మొత్తాన్ని చెల్లించి అధిక వడ్డీరేటు, ఇతర రుసుముల నుంచి తప్పించుకోవచ్చు. అయితే, తరచూ ఇలా కనీస మొత్తం చెల్లించాల్సిన పరిస్థితి తలెత్తుందంటే జాగ్రత్త పడాల్సిందే. మీరు రుణ ఊబిలో చిక్కుకుపోతున్నారడానికి ఇదొక సంకేతం.

ఏం చేయాలి?

పూర్తి స్థాయి మొత్తాన్ని చెల్లించడం ఇబ్బందిగా ఉంటే.. ఈఎంఐ కిందికి మార్చుకోండి. లేదంటే ఏదైనా ఖరీదైన వస్తువు క్రెడిట్‌ కార్డుతో చెల్లించాల్సి వస్తే.. ముందే ఈఎంఐ ఆప్షన్‌ని ఎంచుకోండి. అవసరమైతే క్రెడిట్‌ కార్డుపై వ్యక్తిగత రుణం కూడా తీసుకోవచ్చు. క్రెడిట్‌ కార్డు బిల్లును సకాలంలో చెల్లించకపోతే పడే వడ్డీ, రుసుముల కంటే పర్సనల్‌ లోన్‌ వడ్డీరేటు తక్కువే ఉంటుంది.

======================

2. క్రెడిట్‌ యుటిలైజేషన్‌ రేషియో(సీయూఆర్‌) 30% కంటే ఎక్కువ

మీ క్రెడిట్‌ లిమిట్‌లో మీరు ఎంత మొత్తం వినియోగించుకున్నారని తెలియజేసేదే సీయూఆర్‌. సీయూఆర్‌ 30 శాతం మించితే మీ అవసరాలు పరిమితిని మించి ఉన్నాయని అర్థం. తరచూ ఈ 30శాతం పరిమితి దాటితే.. మీ క్రెడిట్‌ స్కోర్‌ దెబ్బతింటుంది.

ఏం చేయాలి?

సీయూఆర్‌ తరచూ 30 శాతాన్ని మించితే.. మీ క్రెడిట్‌ కార్డు లిమిట్‌ని పెంచమని బ్యాంకులను విజ్ఞప్తి చేయండి. లేదంటే అదనపు కార్డు తీసుకోండి.

=======================

3. రివార్డు పాయింట్లను పట్టించుకోకపోవడం

రివార్డు పాయింట్లు క్రెడిట్‌ కార్డు వల్ల కలిగే అదనపు ప్రయోజనమే చెప్పాలి. మీరు ఖర్చు చేసిన దాన్ని బట్టి పాయింట్లు వచ్చి చేరుతుంటాయి. అయితే, కొందరు మాత్రమే వీటిని సద్వినియోగం చేసుకుంటారు. రివార్డు పాయింట్లకు కాలపరిమితి ఉంటుంది. అది దాటితే.. రివార్డు పాయింట్ల వల్ల కలిగే ప్రయోజనాన్ని మనం కోల్పోయినట్లే. వాస్తవానికి క్రెడిట్‌ కార్డుకు చెల్లించే వార్షిక రుసుము అందులో ఉండే ప్రయోజనాలను బట్టి ఉంటుంది. రివార్డు పాయింట్లు ఉంటే కార్డుకు రుసుము ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. మరి అలాంటప్పుడు రుసుము చెల్లించి ప్రయోజనాన్ని వాడుకోకపోతే నష్టమే కదా!

ఏం చేయాలి?

ఎన్ని రివార్డు పాయింట్లు ఉన్నాయి? వాటిని ఎక్కడ వినియోగించుకోవచ్చు? తరచూ చెక్‌ చేసుకుంటూ ఉండండి. అవకాశం ఉన్న చోట వాడుకోవడం మాత్రం మరువొద్దు.

=======================

4. క్రెడిట్‌ కార్డుతో క్యాష్‌ విత్‌డ్రా

డిజిటల్‌ చెల్లింపుల కోసం డెబిట్‌ కార్డు ఉంది కదా..! మళ్లీ క్రెడిట్‌ కార్డు ఉపయోగించడం ఎందుకు? క్రెడిట్‌ కార్డు పరిమితిలో కొంత మొత్తాన్ని నగదు రూపంలో తీసుకోవడానికి కూడా అనుమతి ఉంటుంది. దీంతో చాలా మంది ఈ కార్డు డెబిట్/ఏటీఎంలా వాడుతుంటారు. అయితే, అత్యవసరమైతే తప్ప.. నగదు తీసుకోవడం మంచిది కాదు. ఎందుకంటే నగదు తీసుకున్న తర్వాత రోజు నుంచే వడ్డీ ప్రారంభమవుతుంది. వడ్డీరేటు 23-49 శాతం మధ్య ఉంటుంది. పైగా మనం తీసుకున్న మొత్తం నుంచి కూడా 3.5 శాతం వరకు రుసుము కింద వసూలు చేస్తారు. దీనికి బిల్లింగ్‌ సైకిల్‌ అంటూ ఏమీ ఉండదు. వీటన్నింటినీ కలిపితే.. మీ జేబుకు పెద్ద చిల్లు పడ్డట్లే!

ఏం చేయాలి?

మీ బ్యాంకు ఖాతాలో డబ్బు లేకుండా.. అత్యవసర పరిస్థితి తలెత్తితే మాత్రమే క్రెడిట్‌ కార్డు ద్వారా డబ్బులు తీసుకోండి. వీలైనంత త్వరగా తిరిగి చెల్లించేందుకు ప్రయత్నించండి.

===================

5. బిల్లింగ్‌ సైకిల్‌కు అనుగుణంగా ఖర్చు చేయకపోవడం

ప్రతి క్రెడిట్‌ కార్డుకు 50 రోజుల బిల్లింగ్‌ సైకిల్‌ ఉంటుంది. అంటే మీ బిల్లింగ్‌ సైకిల్‌లోని తొలిరోజు మీరు డబ్బు వాడుకుంటే.. తిరిగి చెల్లించడానికి మీకు 50 రోజుల సమయం ఉంటుంది. ఒకవేళ మీరు మీ బిల్లింగ్‌ సైకిల్‌లో 30వ రోజు సొమ్మును వినియోగించుకుంటే తిరిగి చెల్లించడానికి మరో 20 రోజులు ఉంటాయి. ఈ సమయంలోపు మీరు ఎలాంటి వడ్డీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. కాబట్టి మీరు చేసే ఖర్చు బిల్లింగ్‌ సైకిల్‌కి అనుగుణంగా ఉండేలా చూసుకోవాలి. లేదంటే సకాలంలో చెల్లింపులకు ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది.

ఏం చేయాలి?

ఖరీదైన వస్తువులను వీలైనంత వరకు బిల్లింగ్‌ సైకిల్‌ ప్రారంభంలోనే కొనుగోలు చేయండి. తద్వారా మీకు తిరిగి చెల్లించడానికి ఎక్కువ సమయం ఉంటుంది. అప్పటిలోపు ఎదోలా డబ్బు సర్దుబాటు అవుతుంది. అలాగే ఖర్చు మరీ పెరిగిపోతుంది అనుకుంటే.. తర్వాత అత్యవసరం కాని వస్తువుల కొనుగోలును వాయిదా వేసుకునేందుకు అవకాశమూ ఉంటుంది.

Previous
Next Post »
0 Komentar

Google Tags