Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

School Education System in Different Countries – Know the Details

 

School Education System in Different Countries – Know the Details

వివిధ దేశాల్లో పాఠశాల విద్యా వ్యవస్థ ఎలా ఉంది? ఒక్కో దేశంలో ఒక్కోలా విద్యార్థుల చదువులు - వివరాలు తెలుసుకుందాము

నేటి బాలల భవిష్యత్తును నిర్ణయించేది పాఠశాల విద్యే. అందుకే అక్షరాస్యతను పెంచడం కోసం ప్రభుత్వాలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి. అయినా ఆశించిన ఫలితాలు రావట్లేదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని ఎప్పటినుంచో డిమాండ్‌ ఉంది. దీంతో కేంద్ర ప్రభుత్వం దీనిపై ఓ నిర్ణయం తీసుకొని నూతన విద్యా విధానం-2020ని సిద్ధం చేసిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 10+2+3గా ఉన్న విద్యా వ్యవస్థ ఇప్పుడు 5+3+3+4గా ఉండనుంది. మరి ఇతర దేశాల్లో విద్యా వ్యవస్థ ఎలా ఉంది? విద్యార్థులు ఎలా చదువుకుంటున్నారు? ఓ సారి గమనించండి.   

1. జపాన్‌

జపాన్‌.. ఆధునిక దేశం. అత్యధిక అక్షరాస్యత ఉన్న దేశాల్లో ముందు వరుసలో ఉంటుంది. అక్కడ పదేళ్ల వరకు విద్యార్థులకు చిన్న చిన్న టెస్టులు తప్ప.. వార్షిక పరీక్షలు నిర్వహించరు. చిన్నతనంలోనే పాఠాలతోపాటు ఎదుటివాళ్లతో ఎలా ప్రవర్తించాలి? స్వీయ నియంత్రణలో ఉండటం ఎలా? కొన్ని విషయాల్లో కఠినంగా వ్యహరించడం ఎలా? వంటి విషయాలను నేర్పిస్తారు. అక్కడి పాఠశాలల్లో విద్యార్థుల కోసం కాపలాదారులు, సంరక్షకులు, ఆయాలను నియమించరు. విద్యార్థులే బృందాలుగా ఏర్పడి పాఠశాలను పరిశుభ్రంగా ఉండేలా చూసుకుంటారు. ఈ విధంగా చేయడం వల్ల విద్యార్థులు పరస్పరం సహకరించుకుంటూ శుభ్రతను పాటించడం నేర్చుకుంటారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసే భోజనం చేస్తారు. దీంతో వారి మధ్య బంధం మరింత బలపడుతుంది. వారానికి ఐదు రోజులే పనిదినాలు. పాఠశాల ముగిసిన తర్వాత, వారాంతంలోనూ విద్యార్థులు ప్రైవేట్‌ శిక్షణ తరగతులకు హాజరవుతుంటారు. విద్యార్థుల భవిష్యత్తుకు అవసరమయ్యే పాఠాలతోపాటు జపనీస్‌ కాలీగ్రఫీ, సాహిత్యాన్ని తప్పక బోధిస్తారు. రెండు లేదా మూడు సెమిస్టర్లతో, 6+3+3 విధానంలో పాఠశాల విద్య నడుస్తుంది. 

2. ఫ్రాన్స్‌

ఇతర దేశాలతో పోలిస్తే అతి తక్కువ పాఠశాల పనిదినాలు ఉన్న దేశం ఫ్రాన్స్‌. ఇక్కడి పాఠశాలలు వారంలో నాలుగున్నర రోజులే పనిచేస్తాయి. శని, ఆదివారాలు సెలవు. బుధవారం రోజున పాఠశాలలు ఒంటిపూట నడుస్తాయి. దీంతో చాలామంది విద్యార్థులు ఆ రోజు డుమ్మా కొడుతుంటారట. ఇక విద్యార్థుల భోజన సమయం గంటన్నర నుంచి రెండు గంటల వరకు ఉంటుంది. పెద్దగా ప్రతిభ కనబరచలేని విద్యార్థులకు ప్రత్యేకంగా తరగతి ఏర్పాటు చేసి, వారిపై మరింత శ్రద్ధ పెడతారు. 15 ఏళ్ల వయసులో మనవద్ద పదో తరగతి పరీక్షలాగే అక్కడ బాకుల్యురేట్‌ పరీక్ష రాయాల్సి ఉంటుంది. దాంట్లో ఉత్తీర్ణత సాధిస్తేనే సెకండరీ ఎడ్యుకేషన్‌ పూర్తి చేసినట్టు. 

3. జర్మనీ

జర్మనీ పాఠశాల విద్య కాస్త భిన్నం. ఇక్కడ విద్యార్థులు 1 నుంచి 4వ తరగతి వరకు ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటారు. ఆ తర్వాత వారి ప్రతిభను బట్టి హప్ట్‌స్కూల్‌, రియల్‌ స్కూల్‌, జిమ్నాసియమ్‌ అనే మూడు వేర్వేరు పాఠశాలల్లో చేర్చుతారు. ఏ పాఠశాలలో చదివినా.. కనీసం తొమ్మిదేళ్ల విద్యను పూర్తి చేసుకోవాల్సిందే. వీటితోపాటు పార్ట్‌టైం పాఠశాలల్ని నిర్వహిస్తారు. ఇక్కడ చదువు పూర్తి చేసుకున్నవారు నేరుగా ఉద్యోగాల్లో చేరవచ్చు. పాఠశాలలు ఉదయం 7.30 నుంచి 8.15గంటల మధ్య ప్రారంభమై, మధ్యాహ్నం 12 నుంచి 1.30 గంటల మధ్యన ముగుస్తాయి. జర్మనీ విద్యార్థులపై హోంవర్క్‌, ఇతర ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ యాక్టివిటీస్‌ అంటూ అధిక భారం పడుతుంటుంది. వీటికోసం పాఠశాల యాజమాన్యాలు పని వేళలను మరింత పొడిగిస్తూ ఉంటాయి. 

4. దక్షిణ కొరియా

ప్రపంచంలో అత్యుత్తమ విద్యావ్యవస్థ ఉన్న దేశాల్లో దక్షిణ కొరియాకు మంచి స్థానముంది. ఇక్కడి పాఠశాల విద్యార్థులు నూటికి 99శాతం ఉత్తీర్ణత సాధిస్తుంటారు. యూనివర్సిటీల్లో సీటు సంపాదించడం కోసం పాఠశాల స్థాయిలోనే బాగా కష్టపడి చదువుతుంటారు. ఈ దేశంలోని పాఠశాలల పని వేళలు అధికంగా ఉంటాయి. ఉదయం 5 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పాఠశాల కొనసాగుతోంది. బాగా చదువుకోవాలనుకునే విద్యార్థులు కొన్నిసార్లు రాత్రి 10-11గంటల వరకు లైబ్రరీలో కూర్చొని చదువుకుంటారు. మరికొందరు లైబ్రరీలో చదువు పూర్తయ్యాక రాత్రిపూట నిర్వహించే ప్రత్యేక పాఠశాలల్లో చేరి, అర్ధరాత్రి దాటి 2 గంటల వరకూ చదువుకోవడం విశేషం. జపాన్‌లాగే ఇక్కడ కూడా 6+3+3 విద్యావిధానం ఉంటుంది. అలాగే మార్చి నుంచి జులై వరకు, సెప్టెంబర్‌ నుంచి ఫిబ్రవరి వరకు ఏడాదిలో మొత్తం రెండు సెమిస్టర్లు ఉంటాయి. 

5. చైనా

భారీ జనాభా గల చైనాలో పాఠశాల విద్య మూడు భాగాలుగా ఉంటుంది. ప్రీ-స్కూల్‌ విద్య మూడేళ్లు, ప్రైమరీ విద్య ఆరేళ్లు, సెకండరీ విద్య ఆరేళ్లు ఉంటుంది. సెకండరీ విద్యలో మళ్లీ రెండు విభాగాలుంటాయి. మూడేళ్ల జూనియర్‌ విద్య, మూడేళ్ల సీనియర్‌ విద్య. జూనియర్‌ విద్య పూర్తయ్యాక విద్యార్థులు ఒక ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. దీంట్లో ఉత్తీర్ణత సాధించిన తర్వాత సీనియర్‌ విద్య చదవడమో లేదా వొకేషనల్‌ కోర్సులో చేరడమో విద్యార్థులే నిర్ణయించుకుంటారు. సీనియర్‌ విద్యను ఎంపిక చేసుకుంటే అది పూర్తయ్యాక జాతీయ స్థాయిలో ప్రవేశ పరీక్ష రాసి యూనివర్సిటీల్లో సీటు దక్కించుకోవాలి. అదే వొకేషనల్‌ కోర్సులో చేరితే 2-4 ఏళ్ల శిక్షణ అనంతరం ఉద్యోగాల్లో చేరవచ్చు. 

6. శాన్‌ మారినో

అతి చిన్న దేశాల్లో శాన్‌ మారినో ఒకటి. 40వేల లోపు జనాభా ఉండే ఇక్కడ అక్షరాస్యత 98శాతం. ఇటలీ విద్యా వ్యవస్థను అమలు చేస్తారు. ఈ దేశంలోని పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులకు మధ్య ఆత్మీయ బంధం ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఆరుగురు పిల్లలకు ఒకరు చొప్పున ఉపాధ్యాయులు ఉంటారు. దీంతో ప్రతి విద్యార్థిపై శ్రద్ధ వహించి చదువుకునేలా చేస్తారు. 6 నుంచి 14 వయసు చిన్నారులకు తప్పనిసరి విద్య (5+3+3 విధానం)ను ఈ దేశం అమలు చేస్తోంది. మూడేళ్ల నుంచి ఆరేళ్ల మధ్య వయసు చిన్నారులను కూడా పాఠశాలలో చేర్చుకుంటారు. కానీ వారికి హాజరు.. పరీక్షలంటూ ఏమీ ఉండవు. ఎనిమిదేళ్ల విద్య పూర్తయ్యాక విద్యార్థుల ఇష్టం మేరకు ఆపై మూడేళ్లు చదువుకొని, కాలేజీకి వెళ్లొచ్చు. 

7. లగ్జెమ్‌బర్గ్‌

యూరప్‌ ఖండంలో ఉండే లగ్జెమ్‌బర్గ్‌ దేశంలో పాఠశాల ప్రాథమిక విద్యను విద్యార్థుల వయసు(3-5, 6-7, 8-9, 10-11) బట్టి నాలుగు భాగాలుగా విభజించారు. ఆ తర్వాత సెకండరీ విద్యను ఆరేడేళ్లు చదవాల్సి ఉంటుంది. ఇక్కడ విద్యార్థులకు లగ్జెమ్‌బర్గీస్‌, జర్మనీ, ఫ్రెంచ్‌ భాషల్లో బోధిస్తారు. 

8. కెనడా

అత్యధికమంది విద్యావంతులు యూనివర్సిటీ నుంచి బయటికొచ్చి ఉద్యోగాలు సంపాదించే దేశాల్లో కెనడా మొదటిస్థానంలో ఉంటుంది. ఇక్కడ విద్యార్థులు చిన్నతనం నుంచే బాగా చదువుకోవడానికి అలవాటు పడతారు. ఎందుకంటే కెనడాలో ఎక్కువ మంది ఇతర దేశాల నుంచి వలస వచ్చినవాళ్లే ఉంటారు. వారు ఉన్నత చదువులు చదివి ఉద్యోగాల నిమిత్తం కెనడాకు వచ్చి స్థిరపడతారు. వారిలాగే వారి పిల్లలు కూడా బాగా చదువుకోవాలన్న ఉద్దేశంతో చిన్నతనం నుంచే విద్యపై శ్రద్ధ పెడతారు. నిజానికి కెనడాకు ఒక విద్యా వ్యవస్థ అంటూ ఏమీ లేదు. ప్రాంతాలే స్థానికంగా విద్యావిధానాన్ని రూపొందించుకుంటాయి. కనీసం పదహారేళ్ల విద్య తప్పనిసరి. 

9. ఫిన్లాండ్‌

ఫిన్లాండ్‌లో ప్రత్యేకమైన పాఠశాల విద్యా విధానం ఉంది. ఆరేళ్ల వరకు పిల్లల్ని పాఠశాలలో చేర్చుకోరు. ఒకవేళ తల్లిదండ్రులు ఆరేళ్ల కంటే తక్కువ ఉన్నప్పుడే చదువు నేర్పించాలనుకుంటే ఖరీదైన ఎర్లీ చైల్డ్‌హుడ్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ కేర్‌ ప్రొగ్రామ్‌లో చేర్చాల్సిందే. ఆరేళ్ల వరకు ఆడుతూ పాడుతూ చదువు కొనసాగిస్తారు. 7-9 ఏళ్ల మధ్య ఉన్న విద్యార్థులకు ఏడాదికి 190 రోజుల పనిదినాల చొప్పున అందరికీ ఒకే విధమైన విద్యను బోధిస్తారు. ఇక్కడ జాతీయ స్థాయిలో పరీక్షలు ఉండవు. పాఠశాలలే పరీక్షలు నిర్వహిస్తాయి. ఆ తర్వాత అప్పర్‌ సెకండరీ విద్యలో జనరల్‌, వొకేషనల్‌ అని రెండు రకాలు ఉంటాయి. రెండింటినీ మూడేళ్లపాటు చదవాల్సిందే. 

10. సింగపూర్‌

సింగపూర్‌ అత్యధిక అక్షరాస్యత ఉన్న చిన్న దేశం. ఇక్కడ పాఠశాల విద్య మూడు భాగాలు. తొలి ఆరేళ్లు ప్రైమరీ, నాలుగేళ్లు సెకండరీ, ఆ తర్వాత మూడేళ్లు పోస్ట్‌-సెకండరీ విద్యను అభ్యసించాల్సి ఉంటుంది. ప్రైమరీ విద్యలో నాలుగేళ్లు పూర్తికాగానే పాఠశాలలే సొంతంగా పరీక్ష నిర్వహిస్తాయి. వీటిలో విద్యార్థులు ఏ సబ్జెక్టులో రాణించగలుతున్నారో గుర్తించి, ఆ తర్వాత రెండేళ్ల చదువును కొనసాగిస్తారు. సింగపూర్‌లో జాతీయ స్థాయి విద్యా వ్యవస్థ ఉంది.

Previous
Next Post »
0 Komentar

Google Tags