Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Essential Services Maintenance Act (ESMA)

 

Essential Services Maintenance Act (ESMA)

ఎస్మా చట్టంఏమిటి? దీనికి ఉన్న విస్తృతి ఎంత? దీన్ని ప్రయోగిస్తే ఏమవుతుందో తెలుసుకుందాం? 

======================

ఎస్మా’ అనేది ‘ఎసెన్షియల్‌ సర్వీసెస్‌ మెయిన్‌టెనెన్స్‌ యాక్ట్‌’కు సంక్షిప్త రూపం. ఇది సమ్మెలు, హర్తాళ్ల వంటి సందర్భాల్లో ప్రజల దైనందిన జీవనానికి ఇబ్బంది కలగకుండా కొన్ని రకాల ‘అత్యవసర సేవల నిర్వహణ’ అవిచ్ఛిన్నంగా కొనసాగేలా చూసేందుకు 1981లో రూపొందించిన చట్టం. అత్యవసర సేవలు అందించే ఉద్యోగులు తమ విధులకు హాజరుకాకుండా ఆయా సేవలకు విఘాతం కలిగేలా సమ్మె కడితే జనజీవనానికి ఇబ్బంది కలగకుండా చూసేందుకు ప్రభుత్వానికి ఈ చట్టాన్ని ప్రయోగించే అధికారం ఉంటుంది.

ఎందు కోసం అమలులోకి తెచ్చారు?

1980ల్లో కార్మిక సంఘాల నిరసనలతో దేశం అట్టుడికిపోయింది. ముఖ్యంగా కార్మిక చట్టాల్లో కొన్ని మార్పులు తేవాలన్న ప్రభుత్వ ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలన్నీ ఉద్ధృత స్థాయిలో ఉద్యమించాయి. 1981లో కార్మిక సంఘాలు పార్లమెంట్‌ ముందు భారీఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించాయి. దేశవ్యాప్తంగా పరిశ్రమలన్నింటా పెద్దఎత్తున సార్వత్రిక సమ్మె చేయాలని పిలుపునిచ్చారు. క్రమేపీ ఉద్యమం తీవ్రరూపం దాలుస్తున్నట్టు స్పష్టం కావటంతో ప్రభుత్వం ముందు 12 పరిశ్రమల్లో సమ్మెను నిషేధిస్తూ ‘ఎస్మా’ ఆర్డినెన్స్‌ తీసుకువచ్చింది. తర్వాత ఈ ఆర్డినెన్స్‌ స్థానే.. ‘ఎస్మా’ చట్టం తెచ్చారు. జమ్మూకాశ్మీర్‌ తప్పించి దేశవ్యాప్తంగా వర్తించే చట్టం ఇది.

ఈ చట్టం ప్రకారం అత్యవసర సేవలంటే..?

ప్రజల దైనందిన జీవితానికి అత్యవసరమని ప్రభుత్వం భావించిన ఏ సేవనైనా ‘అత్యవసర సేవ’గా పరిగణించి, ఆయా సేవలకు సంబంధించి ‘ఎస్మా’ వర్తిస్తుందని ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయవచ్చు. ప్రధానంగా-నీటి సరఫరా, ఆసుపత్రులు, పారిశుధ్యం, రవాణా, తంతితపాలాలతో పాటు పెట్రోలు, బొగ్గు, విద్యుత్‌, ఉక్కు, ఎరువుల వంటి వనరుల ఉత్పత్తి-రవాణా-పంపిణీ సేవలన్నింటికీ దీన్ని వర్తింపజెయ్యచ్చు. అలాగే బ్యాంకింగ్‌, ఆహార ధాన్యాలు, పదార్ధాల పంపిణీ వంటివాటన్నింటికీ దీన్ని వర్తింపజెయ్యచ్చు. ఈ చట్టప్రకారం సమ్మెను నిషేధిస్తున్నట్లు ఒకసారి ఉత్తర్వులు జారీ అయితే- ఇక ఆయా రంగాల్లో సేవలు అందించే వారు సమ్మె చేయటమనేది ‘చట్ట విరుద్ధ’ కార్యకలాపమవుతుంది. ఒకవేళ వారి సేవలు అత్యవసరమైనవైతే అదనపు సమయం పని చేయటానికి తిరస్కరించే అధికారం కూడా వారికి ఉండదు.

ఎస్మా’ను ఉల్లంఘిస్తే?

ఎస్మా నిబంధనలను అతిక్రమించి సమ్మెకు దిగినట్లు ఎవరిపైన అయినా బలమైన అనుమానం ఉంటే.. నేరశిక్షాస్మృతి(సీపీసీ)తో సంబంధం లేకుండానే.. పోలీసు అధికారులు ‘వారంట్‌ లేకుండానే’ అరెస్టు చేయవచ్చు. ఎస్మా నిబంధనలకు విరుద్ధంగా సమ్మె ప్రారంభించే, పాటించే ఉద్యోగులను డిస్మిస్‌ చేయటంతో సహా వివిధ రకాల క్రమశిక్షణా చర్యలు చేపట్టవచ్చు. సమ్మెలో పాల్గొంటున్న వారికి, వారిని ప్రోత్సహిస్తున్న వారికి కూడా జైలు శిక్ష, జరిమానా, లేదా రెండూ విధించవచ్చు. ఈ చట్టం ప్రకారం- సమ్మెకు ఆర్థిక సహకారం అందించే వారూ శిక్షార్హులే.

గతంలో ‘ఎస్మా’ ప్రయోగించిన సందర్భాలు ఉన్నాయా?

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమ్మెలపై ‘ఎస్మా’ ప్రయోగించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. 2003లో తమిళనాడు ప్రభుత్వ ఉపాధ్యాయులు నిరవధిక సమ్మెకు పిలుపిచ్చినప్పుడు జయలలిత ప్రభుత్వం ఎస్మా ప్రయోగించి దాదాపు 1,70,000 మందిని విధుల్లో నుంచి తొలగించింది. సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాతగానీ వారంతా తిరిగి విధుల్లో చేరలేకపోయారు. సమ్మె కట్టిన వైద్యులు, ఆసుపత్రి సిబ్బందిపై మన రాష్ట్రంతో సహా దేశవ్యాప్తంగా చాలాచోట్ల ఎస్మా ప్రయోగించారు. 2006లో ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా విమానాశ్రయ సిబ్బంది సమ్మెకు దిగినప్పుడు, 2009లో ట్రక్కు రవాణా దారులు సమ్మె చేసినప్పుడు, 2009లో చమురు, గ్యాస్‌ సిబ్బంది సమ్మె చేసినప్పుడు.. ఇలా పలు సందర్భాల్లో ‘ఎస్మా’ ప్రయోగించారు.

======================

CLICK FOR MORE DETAILS IN ENGLISH

======================

Previous
Next Post »
0 Komentar

Google Tags