Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Australian Cricket Star Andrew Symonds Dies in Car Crash

 

Australian Cricket Star Andrew Symonds Dies in Car Crash

ఆస్ట్రేలియా క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ కారు ప్రమాదంలో మృతి

ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్‌, మాజీ ఆల్‌రౌండర్‌ ఆండ్రూ సైమండ్స్‌ (46) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. క్విన్స్‌లాండ్‌లోని టౌన్స్‌విల్లేలో ఆయన నివాసం ఉంటున్న ప్రాంతంలో గతరాత్రి కారు ప్రమాదానికి గురయ్యాడు. ఈ దుర్ఘటనలో సైమండ్స్‌ కన్నుమూసినట్లు అక్కడి పోలీసులు వెల్లడించారు. అతడి మృతి పట్ల పలువురు ఆటగాళ్లు, మాజీ సహచరులు విచారం వ్యక్తం చేశారు. సైమండ్స్‌ 1998 నుంచి 2012 వరకు క్రికెట్‌ ఆడాడు. ఆస్ట్రేలియా తరఫున 26 టెస్టులు, 198 వన్డేలు, 14 టీ20ల్లో ప్రాతినిధ్యం వహించాడు. ఈ క్రమంలో ఆ జట్టు తరఫున అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా తనదైన ముద్ర వేశాడు. అలాగే ఆస్ట్రేలియా 2003, 2007 వన్డే ప్రపంచకప్‌లు సాధించిన జట్లలోలోనూ సభ్యుడిగా ఉన్నాడు. 

క్రికెట్ ఆస్ట్రేలియా ఛైర్మన్‌ లాచ్‌లాన్ హెండర్సన్ సైమండ్స్‌ మృతి పట్ల సంతాపం తెలిపారు.. “ఆస్ట్రేలియన్ క్రికెట్ మరో అత్యుత్తమమైన ఆటగాడిని కోల్పోయింది. ఆండ్రూ రెండు ప్రపంచ కప్ విజయాల్లో కీలక పాత్ర పోషించడమే కాకుండా క్వీన్స్‌లాండ్ తరఫున కూడా గొప్ప ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. తన ఆటతో ఎనలేని అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు. ఈ కష్ట సమయంలో క్రికెట్ ఆస్ట్రేలియా తరపున ఆండ్రూ కుటుంబానికి, సన్నిహితులు, స్నేహితులకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం’’ అని పేర్కొన్నారు. కాగా, క్రికెట్‌ ఆస్ట్రేలియా రెండు నెలల క్రితమే ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లు.. రాడ్‌ మార్ష్‌, షేన్‌వార్న్‌ను కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సైమండ్స్‌ కూడా మృతిచెందడంతో ఆ జట్టు అభిమానులు విషాదంలో మునిగిపోయారు. 

కెరీర్‌ పరంగా 1994-1995లో ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ ఆడటం ప్రారంభించిన అతడు 1998లో తొలిసారి అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. అప్పుడు పాకిస్థాన్‌ పర్యటనలో వన్డే అరంగేట్రం చేసిన సైమండ్స్‌ అదే జట్టుపై 2009లో చివరి వన్డే ఆడాడు. టెస్టుల్లో 2004లో శ్రీలంకపై అరంగేట్రం చేసి 2008లో దక్షిణాఫ్రికాతో ఆఖరి టెస్టు ఆడాడు. ఇక టీ20ల్లో 2005లో న్యూజిలాండ్‌పై తొలి మ్యాచ్‌ ఆడిన సైమండ్స్‌ 2009లో పాకిస్థాన్‌పై చివరి మ్యాచ్‌ ఆడాడు. ఈ క్రమంలోనే మొత్తం వన్డేల్లో 5,088 పరుగులు, టెస్టుల్లో 1,462, టీ20ల్లో 337 పరుగులు చేశాడు. బౌలింగ్‌ పరంగా టెస్టుల్లో 24, వన్డేల్లో 133, టీ20ల్లో 8 వికెట్లు తీశాడు. ఇక భారత టీ20లీగ్‌లోనూ 2008-2010 సీజన్లలో హైదరాబాద్‌, 2011లో ముంబయి తరఫున ఆడాడు.

 

Previous
Next Post »
0 Komentar

Google Tags