Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Rupee Breaches 79 Per Dollar Mark for The First Time Ever

 

Rupee Breaches 79 Per Dollar Mark for The First Time Ever

జీవిత కాల కనిష్ఠానికి రూపాయి విలువ - డాలరుతో రూపాయి విలువ 79.04కి

రూపాయి పతనం కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే దీని విలువ రోజు రోజుకూ దిగజారుతోంది. తాజాగా రూపాయి (Rupee value) విలువ జీవిత కాల కనిష్ఠానికి చేరింది. గురువారం స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి డాలరుతో రూపాయి విలువ 79.04కి పతనమైంది.

అంతకుముందు మంగళవారం ఏకంగా 48 పైసలు క్షీణించిన రూపాయి.. 78.85 వద్ద ముగిసింది. తాజాగా మరో 19 పైసలు క్షీణించింది. విదేశీ మదుపరుల అమ్మకాలు కొనసాగుతుండడం, ముడి చమురు ధరల పెరగుదుల, ద్రవ్యోల్బణం వంటివి రూపాయి క్షీణతకు కారణమని నిపుణులు చెబుతున్నారు. రూపాయి బలపడడానికి రిజర్వ్ బ్యాంక్ ఇటీవల కొన్ని చర్యలు చేపట్టినప్పటికీ.. అవి రూపాయి మీద ఒత్తిడిని తగ్గించలేకపోతున్నాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు. రూపాయి బలపడాలంటే కొత్త వ్యూహాలు అనుసరించాల్సిందేనని పేర్కొంటున్నారు.

రూపాయి చిక్కితే నష్టమిదే..

రూపాయి క్షీణత వల్ల సామాన్యుడి బతుకు భారమవుతుంది. ద్రవ్యోల్బణం పెరుగుతుంది. వస్తు సేవలకు అధికంగా చెల్లించాల్సి వస్తుంది. విదేశాల నుంచి దిగుమతయ్యే వంటనూనె, పప్పుదినుసులకూ అధిక ధరలు చెల్లించాలి. అంతర్జాతీయ వ్యాపారం డాలర్లలోనే జరుగుతుంది కాబట్టి, సరఫరా చేసిన దేశానికి డాలర్లలోనే చెల్లించాలి. రూపాయి విలువ క్షీణిస్తే ఈ చెల్లింపుల కోసం ఎక్కువ వ్యయమవుతుంది. ముడి సరకుల్లో అత్యధిక భాగం దిగుమతి చేసుకునే పరిశ్రమలు కరెన్సీ క్షీణత వల్ల దెబ్బతింటాయి.

ఇతర దేశాలకు విహారయాత్రలకు వెళ్లాలంటే అధికంగా ఖర్చవుతుంది. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులపై భారం పెరుగుతుంది. తమ వస్తువులను, సేవలను ఇతర దేశాలకు ఎగుమతి చేసే రంగాలు మాత్రం క్షీణించిన కరెన్సీవల్ల లబ్ది పొందుతాయి. ముఖ్యంగా భారత ఐటీ, ఫార్మా రంగాలకు ఈ పరిస్థితి వల్ల ప్రయోజనం చేకూరుతుంది. ఒక డాలరుకు ఎక్కువ రూపాయలు అందుతాయి కాబట్టి రూపాయి క్షీణత వల్ల ప్రవాస భారతీయ కుటుంబాలు లాభపడతాయి.

Previous
Next Post »
0 Komentar

Google Tags