Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Legendary Singer SPB is no moreLegendary Singer SPB is no more
గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అస్తమయం

లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మరణవార్త యావత్ సినీ లోకాన్ని శోక సంద్రంలో ముంచివేసింది. 

దిగ్గజ గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూశారు. సుమారు 50 రోజులు మృత్యువుతో పోరాడిన బాలు.. శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో తుదిశ్వాస విడిచారు. కరోనా వైరస్‌తో పోరాడి గెలిచిన బాలుని ఇతర ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. కరోనా వైరస్ సోకడంతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆగస్టు 5న చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌లో చేరారు. మొదట జలుబు, జ్వరం వంటి స్వల్ప లక్షణాలతో బాధపడిన బాలు.. ఆగస్టు 13న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆ రోజు నుంచీ ఆయన ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స పొందారు. ఆ తరవాత వెంటిలేటర్‌తో పాటు ఎక్మో (ఎక్స్‌ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సీజనేషన్) సపోర్ట్‌తో బాలుకి వైద్యులు చికిత్స అందించారు. బాలు మరణవార్తతో యావత్ సినీ లోకం శోకసంద్రంలో మునిగిపోయింది. 

శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం.. మనందరం ముద్దుగా పిలుచునే పేరు ఎస్పీ బాలు. 1946 జూన్ 4న నెల్లూరులోని కోనేటమ్మపేటలో ఎస్పీ సాంబమూర్తి, శకుంతలమ్మ దంపతులకు బాలు జన్మించారు. బాలు తండ్రి సాంబమూర్తి హరికథలు చెప్పేవారు. బాలుకి చిన్నతనం నుంచే సంగీతంపై మక్కువ ఏర్పడింది. పాటలు పాడటం అలవాటుగా మార్చుకున్నారు. పాటపై తనకున్న ఇష్టం ఆయన్ని సినిమాల వైపు నడిపించింది. 1960ల్లో చెన్నై వెళ్లి అవకాశాల వేట మొదలుపెట్టారు. 

ఓ పాటల పోటీ కార్యక్రమంలో పాల్గొన్న బాలు ప్రతిభను గ్రహించిన ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్పీ కోదండపాణి.. ఆయనకు తొలి అవకాశం ఇచ్చారు. అలా 1966లో విడుదలైన ‘శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న’ చిత్రంతో నేపథ్య గాయకుడిగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. 1966 డిసెంబర్ 15 తన తొలి పాటను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తొలి పాటను రికార్డింగ్ స్టూడియోలో ఆలపించారు. అప్పటి వరకు ఘంటసాల స్వరానికి అలవాటు పడిన తెలుగు ప్రేక్షకులను, సంగీత ప్రియులను ఒక కొత్త స్వరం ఆకర్షించింది. అనతికాలంలోనే ఆ స్వరం పాపులర్ అయిపోయింది. కేవలం పాటలు పాడటమే కాదు.. ఆయా హీరోలకు తగ్గట్టుగా స్వరం మార్చి పాడేవారు బాలు. 

1980లో విడుదలైన ‘శంకరాభరణం’ సినిమాతో బాలు ఖ్యాతి ఖండాలు దాటింది. ఈ సినిమాతో ఆయన తొలి జాతీయ అవార్డును అందుకున్నారు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలోనూ స్టార్ సింగర్‌గా ఎదిగారు. నిజానికి దక్షిణాదిలోనే దిగ్గజ గాయకుడిగా పేరు సంపాదించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో లెక్కలేనన్ని పాటలు పాడారు. అలాగే, హిందీలోనూ పాటలు పాడారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో కలిపి ఆరు జాతీయ అవార్డులను అందుకున్నారు. హిందీలో ‘ఏక్ తుజే కేలియే’ సినిమాలో ‘తేరే మేరే బీచ్‌ మే’ పాటకు గాను ఉత్తమ నేపథ్య గాయకుడిగా జాతీయ అవార్డ్‌ అందుకున్నారు బాలు. ఇక ఇతర అవార్డులు కోకొల్లలు. 

మొత్తం మీద సుమారు 16 భాషల్లో కలుపుకుని 40వేలకు పైగా పాటలు పాడి ప్రపంచంలోనే అత్యధిక పాటలు పాడిన మేల్ సింగర్‌గా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో బాలు స్థానం సంపాదించారు. కేవలం గాయకుడిగానే కాకుండా సంగీత దర్శకుడిగా, నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా దక్షిణాది సినీ పరిశ్రమలో చెరిగిపోని ముద్ర వేశారు బాలు. కమల్‌ హాసన్‌, రజినీకాంత్‌, సల్మాన్‌ ఖాన్‌, అనిల్ కపూర్‌ లాంటి ప్రముఖ నటులకు బాలు గాత్రదానం చేశారు. కమల్ హాసన్‌కు అయితే తెలుగులో బాలు తప్ప మరొకరు డబ్బింగ్ చెప్పలేదు. ‘దశావతారం’ సినిమాలో తొమ్మిది పాత్రలకు బాలునే డబ్బింగ్ చెప్పడం విశేషం. 

ఇక సంగీత దర్శకుడిగా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో కలిపి ఇంచుమించుగా 40 చిత్రాలకు బాలసుబ్రహ్మణ్యం పనిచేశారు. అలాగే, అన్ని భాషల్లో కలుపుకుని 70కి పైగా చిత్రాల్లో ఆయన నటించారు. సినిమా రంగానికి, సంగీతానికి బాలు చేసిన కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం ఆయన్ని 2001లో పద్మ శ్రీ, 2011లో పద్మ భూషన్‌ అవార్డులతో గౌరవించింది. ఇవి కాకుండా బాలు ఖాతాలో ఇంకా చాలా పురస్కారాలు ఉన్నాయి. తమిళనాడు ప్రభుత్వం బాలుని ‘కళైమామణి’ బిరుదుతో సత్కరించింది. కర్ణాటక ప్రభుత్వం నుంచి కర్ణాటక రాజ్యోత్సవ అవార్డును బాలు అందుకున్నారు. ఇక, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, చెన్నైలోని సత్యభామ యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, జేఎన్‌టీయూ అనంతపురం నుంచి గౌరవ డాక్టరేట్లను బాలు అందుకున్నారు.

గాన గంధర్వుడు ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం గారి జీవిత చరిత్ర

మన బాలు గారు పాడిన, నటించిన, స్వర పరిచిన 5 ప్రత్యేక సినిమాలు ఇవే

Previous
Next Post »
0 Komentar

Google Tags