Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Transport Ministry Okays Green Tax on Vehicles Over 8 Years Old: Gadkari

 

Transport Ministry Okays Green Tax on Vehicles Over 8 Years Old: Gadkari

పాత వాహనాలకు గ్రీన్‌ ట్యాక్స్‌ - కేంద్రం కీలక నిర్ణయం

కాలుష్యానికి కారణమవుతున్న వాహనాల విషయంలో కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కాలుష్య నివారణలో భాగంగా పాతబడిన వాహనాలకు గ్రీన్‌ ట్యాక్స్‌ విధించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలపై కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ సంతకం చేశారు. రాష్ట్రాల సంప్రదింపుల అనంతరం దీన్ని కేంద్రం నోటిఫై చేయనుందని అధికారులు తెలిపారు. 

కాలుష్య నివారణలో భాగంగా 8 సంవత్సరాల పైబడిన రవాణా వాహనాలకు 10 నుంచి 25 శాతం వరకు గ్రీన్‌ ట్యాక్స్‌ చెల్లించాల్సి ఉంటుంది. ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ పునరుద్ధరణ సమయంలో ఈ ట్యాక్స్‌ వసూలు చేయనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. అలాగే, 15 సంవత్సరాల కంటే పాత వ్యక్తిగత వాహనాలు కూడా గ్రీన్‌ ట్యాక్స్‌ పరిధిలోకి వస్తాయని వెల్లడించారు. ఈ తరహా వాహనాల రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ సమయంలో పన్ను వసూలు చేస్తారని చెప్పారు. కాలుష్యం ఎక్కువగా ఉన్న నగరాల్లో రిజిస్ట్రేషన్‌ అయ్యే వాహనాలకు అత్యధిక గ్రీన్‌ టాక్స్‌ (రోడ్డు పన్నులో 50 శాతం) వసూలు చేయాలన్న ప్రతిపాదన కూడా ఉందని పేర్కొన్నారు. 

అయితే, హైబ్రిడ్‌, ఎలక్ట్రిక్‌, సీఎన్‌జీ, ఇథనాల్‌, ఎల్‌పీజీ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలు కలిగిన వాహనాలకు ఈ ప్రతిపాదన నుంచి మినహాయింపు ఉంటుందని అధికారులు తెలిపారు. అలాగే 15 సంవత్సరాల కంటే పాతవైన ప్రభుత్వ వాహనాల రిజిస్ట్రేషన్‌ను ఇకపై కొనసాగించకూడదన్న ప్రతిపాదన కూడా ఉందని పేర్కొన్నారు. పాత వాహనాలు కాలుష్య కారకాలుగా మారుతున్నాయని, అందుకే ఈ గ్రీన్‌ ట్యాక్స్‌ వసూలుకు నిర్ణయించినట్లు తెలిపారు. ఈ ట్యాక్స్‌ ద్వారా వసూలైన మొత్తాన్ని పర్యావరణ పరిరక్షణకు వినియోగించనున్నట్లు పేర్కొన్నారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags