‘Anaganaga’ - A Must-Watch Telugu Movie About Education
System and Father-Son Relationship
విద్యా
విధానం మరియు తండ్రీకొడుకుల బంధంపై చూడవలసిన ‘అనగనగ‘ తెలుగు సినిమా
=====================
కథ:
వ్యాస్ ఒక ఇంటర్నేషనల్
పాఠశాలలో పర్సనాలిటీ డెవలప్మెంట్ టీచర్. బట్టీ చదువుల వల్ల పిల్లలు ఎగ్జామ్స్
పాసైనా జీవితంలో ఫెయిల్ అవుతారని నమ్ముతాడు. ర్యాంకుల పేరుతో చిన్నారులపై ఒత్తిడి
తీసుకురావద్దని తరచూ తోటి ఉపాధ్యాయులు, స్కూల్
యాజమాన్యంతో వాదిస్తూ ఉంటాడు. పాఠాలను కథల రూపంలో వివరిస్తూ చెబితేనే
విద్యార్థులకు సులభంగా అర్థమవుతుందని అంటాడు. భార్య భాగ్య (కాజల్ చౌదరి) అదే
స్కూల్ కు ప్రిన్సిపల్ అయినా, మేనేజ్మెంట్ మాటకు
కట్టుబడి భర్తను తరచూ కోప్పడుతూ ఉంటుంది. కేవలం ర్యాంకులు, పేరు ప్రతిష్ఠల కోసం పాకులాడే ఆ స్కూల్ వ్యాస్ మాటలు
పట్టించుకోకపోగా అతడిని ఉద్యోగం నుంచి తీసేస్తుంది. చదువులో వెనకబడిపోతున్న
చిన్నారుల కోసం వ్యాస్ ఏం చేశాడు?
విశ్లేషణ:
నేటి
విద్యావ్యవస్థ, దాని తీరుతెన్నులను ప్రశ్నిస్తూ, తండ్రీ-కొడుకుల మధ్య ఉన్న అనుబంధాన్ని భావోద్వేగభరితంగా
చూపించిన చిత్రమే 'అనగనగా'. విద్యావ్యవస్థ లోపాలను ఎత్తి చూపుతూ వచ్చిన 'తారే జమీన్ పర్', 'త్రీ ఇడియట్స్' వంటి చిత్రాల
కథానేపథ్యం ఉన్నా, అచ్చ తెలుగు
చిత్రంగా తీర్చిదిద్దడంలో దర్శకుడు సన్నీ సంజయ్ విజయం సాధించారు.
ఆత్మహత్య
చేసుకోవాలనుకున్న ఓ చిన్నారిని తల్లిదండ్రులు సైకాలజిస్టు దగ్గరకు తీసుకొచ్చే
సన్నివేశంతోనే దర్శకుడు మనకు ఏ కథ చెప్పబోతున్నాడో ఇట్టే అర్థమవుతుంది. వ్యాస్ సర్
పరిచయం,
పిల్లలకు అర్థమయ్యేలా పాఠాలు చెప్పాలనే అతడి తాపత్రయం తదితర
సన్నివేశాలతో కథ ముందుకుసాగుతుంది. తమ పాఠశాల పేరును కాపాడుకునేందుకు ఎగ్జామ్స్
పాస్ కావాలని పిల్లలపై ఒత్తిడి తీసుకురావడం, చదవని
పిల్లలను 'ఫెయిల్యూర్' అంటూ బ్యాడ్జ్లు ఇచ్చి అవమానించడం ఇలా ప్రథమార్ధమంతా స్కూల్, అక్కడి పరిస్థితులు, విద్యార్థులు
ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి నేపథ్యాన్ని చూపించడం నేటి పరిస్థితులకు అద్దం
పడుతుంది.
ఈ చిత్రం
ప్రస్తుత జెనరేషన్ లో కేవలం ర్యాంక్ లు, మార్కులు
కోసం మాత్రమే పని చేస్తున్న విద్యా సంస్థలకి ఒక ప్రశ్న లాంటిది అని చెప్పాలి. వారు
అమలు చేస్తున్న విద్యా విధానం ఇలా కాదు చదివే పిల్లలకి ఏం చెప్తున్నారు అనేది కూడా
అర్ధం కావాలి అనేది ఈ సినిమాలో బాగుంది. అలాగే దానికి అనుగుణంగా దర్శకుడు మంచి
ఫ్యామిలీ డ్రామా అందులో కూడా పలు లేయర్లు యాడ్ చేయడం అనేది అదనపు ఆకర్షణ అని
చెప్పవచ్చు.
ఈ చిత్రం లో మరో
కోణం:
ఈ సినిమాలో
తండ్రీ,
కొడుకుల ట్రాక్ అనేది మరో బలమైన అంశంగా కనిపిస్తుంది.
సుమంత్ అలాగే తన కొడుకు పాత్రలో నటించిన మాస్టర్ విహార్ష్ ల నడుమ సన్నివేశాలు
హత్తుకునేలా ఉంటాయి. అంతే కాకుండా భార్య భర్తల నడుమ స్పర్థలు, వారి నడుమ జరిగే సున్నితమైన గొడవలు లాంటివి దర్శకుడు
డీసెంట్ గా హ్యాండిల్ చేసాడని చెప్పొచ్చు.
నటుల ప్రదర్శన:
టాలీవుడ్
హీరోస్ లో సుమంత్ ఎంచుకునే సినిమాలు ఒకింత రిఫ్రెషింగ్ గా అనిపిస్తాయి. పాత
సినిమాల్లో చూసుకున్నా కూడా ఇప్పటికీ చూసే విధంగా ఉంటాయి. అలా తన నుంచి వచ్చిన పలు
సినిమాల్లో ఈ చిత్రం కూడా ఉంటుందని చెప్పవచ్చు. మళ్ళీ రావా సినిమా తర్వాత తాను
ఎలాంటి నటుడు అనేది మళ్ళీ చిత్రంతో చూపించాడు. మన తెలుగు సినిమాలో మంచి అండర్
రేటెడ్ నటుల్లో తాను ఒకరని ఈ సినిమాతో మళ్ళీ ప్రూవ్ అవుతుంది. అంత చక్కగా తన
పెర్ఫామెన్స్ ఈ చిత్రంలో ఉంది.
తన భార్యగా
చేసిన కాజల్ చౌదరి సాలిడ్ పెర్ఫామెన్స్ అందించారు. ప్రతీ ఎమోషన్ ని ఆమె నాచురల్ గా
చేశారు. ఇంకా మాస్టర్ విహార్ష్ ఇంత చిన్న ఏజ్ లో అంత పరిపక్వత గల నటన కనబరచడం
ఇంప్రెస్ చేస్తుంది. అలాగే అవసరాల శ్రీనివాస్ తన రోల్ కి పర్ఫెక్ట్ గా సెట్
అయ్యాడు. స్ట్రిక్ట్ స్కూల్ యాజమాన్య సభ్యునిగా మెప్పించాడు. తాను సహా ఇక ఇతర
నటీనటులు మంచి నటన కనబరిచారు.
తుది తీర్పు:
పాఠశాలలు, ఉపాధ్యాయులు
మరియు తల్లితండ్రులు తెలుసుకోవాలిసింది ఏమిటంటే .. పిల్లల సంగ్రహణ శక్తి ని బట్టి నేర్పే
విధానం తెలుసుకోవాలి.
మన దేశం లో ని
140 కోట్ల జనాభాలో ధనవంతులు ఎంతమంది ఉంటారో పాఠశాలలో టాప్ ర్యాంకర్ లు అంతా మందే ఉంటారు.
మిడిల్ క్లాస్ & లోవర్ క్లాస్ జనాభా ఎంత మంది ఉన్నారో టాప్ ర్యాంకర్ లు కానీ విద్యార్థులు
అంతా మంది ఉంటారు, కానీ వల్ల గురించి ఎవరు అంతా గా పట్టించుకోరు. దేశం లో నైనా, పాఠశాలలో
నైనా వాళ్ళు బాగుంటేనే దేశం & పాఠశాలలు బాగుంటాయి.
=====================
=====================
గమనిక: చిత్రం
పై మా ఈ సమీక్ష వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
=====================


0 Komentar